National

భవానీ పూర్ ఉప ఎన్నిక.. మమత వర్సెస్ ప్రియాంక

పశ్చిమ బెంగాల్‌కు జరిగిన శాసనసభ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి ఓటమి పాలయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. దీంతో భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ (41) పోటీ పడుతూ ఉన్నారు. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఈ ఉదయం పటిష్ఠ భద్రత మధ్య ప్రారంభమైంది. భవానీపూర్‌లో మమత విజయం సాధిస్తేనే ఆమె ముఖ్యమంత్రిగా ఉండగలరు. లేదంటే రాజ్యాంగ సంక్షోభం తప్పదు.

ఎలాగైనా మమతను గెలిపించాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కష్టపడుతూ ఉన్నారని ప్రియాంక ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎమ్మెల్యే మదన్ మిత్రా ఓటింగ్ మెషీన్ ను ఉద్దేశపూర్వకంగా మూసివేశారని ప్రియాంక టిబ్రేవాల్ ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని ఒక స్థానానికి గురువారం ఉదయం ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ సాయంత్రం 6.30గంటల వరకు కొనసాగనుంది. బెంగాల్‌లోని భవానీపూర్‌తోపాటు జాంగీపూర్‌, సంపేర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతోంది. అక్టోబర్‌ 3న ఓట్లను లెక్కించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 15 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ 2011, 2016 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఏడాది మాత్రం ఆమె నందిగ్రామ్ లో పోటీ చేసి తన ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మమతా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అందువల్ల ఆమె ఆరు నెలల్లో ఏదో ఒక సభ నుంచి చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కోసం భవానీపూర్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుభతా బక్షి తన పదవికి రాజీనామా చేశారు.

సంసర్‌గంజ్‌లో బాంబు దాడులు:

పోలింగ్ ప్రారంభానికి ముందు పశ్చిమ బెంగాల్ సంసర్‌గంజ్‌లో బాంబులు విసిరారు. పోలింగ్ బూత్‌లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలింగ్ బూత్‌లకు 200 మీటర్ల దూరంలో సెక్షన్ 144 కింద ఉత్తర్వులు విధించబడ్డాయి. భవానీపూర్‌లో బలగాలను భారీగా మోహరించారు. సంసర్‌గంజ్ నియోజకవర్గంలో భద్రతను కూడా పెంచారు.

Related Articles

Back to top button