More

  బీజేపీ మిషన్ బెంగాల్ స్ట్రాటజీ

  పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చూస్తోన్న బీజేపీ…,  ఆ రాష్ట్రంలో భారీ ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసి పక్కాగా అమలు చేస్తోంది. రెండు నెలల ముందు నుంచే ఓ ప్లాన్ ప్రకారం ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.., అలాగే యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య తోపాటు.. కేంద్రమంత్రులందరూ.. బెంగాల్ లోని అన్ని జిల్లాలను చూట్టేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి బీజేపీ పరివర్తన్ యాత్ర… బెంగాల్ లోని దాదాపు 150 నియోజవర్గాలను కవర్ చేసింది. యాత్ర ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది.

  అటు భారీ స్థాయిలో ప్రచారం కొనసాగిస్తూనే… స్థానికంగా ప్రొ… బీజేపీ వాతావరణం సృష్టించేందుకు… బీజేపీ నేతలు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఏదో ఒక చోట కార్నర్ మీటింగ్ లు…, నిర్వహిస్తున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను…, ఎమ్మెల్యేలను…, సినిమా స్టార్లను, క్రికెట్, పుట్ బాల్ ఆటగాళ్లు ఇలా ఏ ఒక్కరిని వదలి పెట్టకుండా… బీజేపీలోకి ఆహ్వానిస్తూనే ఉన్నారు. వచ్చేవారిని అధికారికంగా పార్టీ కండువాలు కప్పి చేర్చుకుంటూనే ఉన్నారు.

  దీనికి తోడు…బీజేపీకి అండగా నిలిచే… సోషల్ మీడియా టీములు సైతం రంగంలోకి దీగాయి.  ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ అమిత్ మాలవీయా అయితే… గత రెండు నెలల నుంచి బెంగాల్ లోనే మకాం వేశారు. అగ్రనేతల ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే… సోషల్ మీడియా గ్రూపులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మమతా పాలనలో జరిగిన రాజకీయ హత్యలు, అవినీతి కుంభకోణాలు, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు ఇలా ఒక్కొక్క అంశాన్ని హైలెట్ చేస్తూ పోస్టర్ వార్ ను మొదలు పెట్టారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్వీటర్ ద్వారా వాటిని వైరల్ చేస్తున్నారు. ట్రేండింగ్ లోకి తీసుకువస్తున్నాయి. అంతేకాదు రోజు వారి టీవీ డిబెట్ లలో…ఈ  ట్రేండింగ్ అంశాలే…చర్చకు వచ్చేలా పరోక్షంగా అజెండా ను సెట్ చేస్తున్నాయి.  అలాగే ప్రత్యేకంగా రూపొందించిన బీజేపీ ప్రచార గీతాలను బెంగాల్ అంతటా మారుమోగేలా చేస్తున్నారు. ఇంకా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కేంద్ర పథకాలు.., మమతా ప్రభుత్వం ఎలా కేంద్ర పథకాలను బెంగాల్ లో అమలు చేయకుండా వ్యతిరేకించిన తీరును ఎండగడుతూ… సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు.

  తృణమూల్ కు బీజేపీ కార్యకర్తలకు మధ్య ప్రతి రోజు ఏదో ఒక నియోజకవర్గంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చేవి కావు. ఎక్కడికక్కడ లాంటి న్యూస్ బయటకు రాకుండా తృణమూల్ శ్రేణులు…నేతలు జాగ్రత్త పడేవారు.  అయితే తృణమూల్ కార్యకర్తల ఈ హింసా రాజకీయాలను వెలుగులోకి తెచ్చేందుకు బీజేపీ పార్టీ పరంగా ఏకంగా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఘర్షణలకు సంబంధించిన విజువల్స్ తీయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఒక వేళా ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తే వెంటనే పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లడం.., ఆ వెంటనే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేలా ఒక టీమ్ ను పశ్చిమ బెంగాల్ బీజేపీ సిద్ధం చేసిందని చెబుతున్నారు.

  ఎన్నికల కమిషన్ దాదాపు వందకు పైగా నియోజకవర్గాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో రాజకీయ హింస చెలరేగే అవకాశాలున్నాయని…ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పూర్వ చరిత్ర చెబుతోంది. గతంలో కూడా బెంగాల్ లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈసారి అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎనిమిది విడుతలుగా ఎన్నికలు నిర్వహిస్తోంది.

  మరోవైపు… గతంలో ఎన్నడులేని విధంగా…  ఈసారి పీఎం మోదీ ఒక్కరే బెంగాల్ లో దాదాపు 20కి పైగా భారీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా బీజేపీ అధిష్ఠానం షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 7న కోల్‌కతాలోని బ్రిగేడ్‌ మైదానంలో ప్రధాని మోదీ తొలి ప్రచార ర్యాలీలో ప్రసంగించనున్నారు. అలాగే బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానితో భాజపా అగ్ర నాయకులు అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగి ఆదిత్యనాథ్‌, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, స్మృతి ఇరానీ సహా పలువురు నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు.

  ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే మల్దాలో నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతా బెనర్జీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. బెంగాల్ ఆవుల అక్రమ రవాణా, లవ్ జీహాద్. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను దీదీ పోత్సహిస్తున్నారని… మండిపడ్డారు. ఓట్ల కోసం… చివరకు జై శ్రీరామ్ అనడాన్ని కూడా మమతా అడ్డుకుంటున్నారని…, యూపీలో రామమందిర నిర్మాణానికి అడ్డుపడినవారికి పట్టిన గతే మమతకు బెంగాల్ లో తప్పక ఎదురవుతుందని సీఎం యోగి హెచ్చరించారు.

  బెంగాల్ లో మార్చి 27నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  Trending Stories

  Related Stories