ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ప్రచారంతో పాటు పొత్తులు, ఎత్తుల్లో బిజీబిజీగా వున్నాయి. అసోంలో రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందకు కమలనాథులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అసోం గణపరిషద్ తో కలిసి ఎన్నికలకు వెళ్లిన.. బీజేపీ ఈసారి అదే పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది. అలా పొత్తు కుదిరిందో లేదో 70 మంది అభ్యర్థులతో కూడిన తొలి విడత జాబితాను విడుదల చేసింది.
అసోంలో అన్ని పార్టీల కంటే ముందుగా బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇక, తమ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ 26 సీట్లు, యునైటెడ్ పీపుల్స్ పార్టీ (లిబరల్) కు 8 సీట్లు కేటాయించినట్టు బీజేపీ ప్రకటించింది. అసోం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ మజూలీ నియోజవకర్గం నుంచి, మంత్రి హిమంతబిశ్వ శర్మ జలుక్‌బరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఇవే స్థానాల నుంచే వారిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో తొలి విడతలో 47 స్థానాలకు ఎన్నికలు మార్చి 27న జరగనుండగా.. 39 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1న జరగనుంది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ 40 స్థానాలకు జరగనుంది. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి దశకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 9, రెండవ దశకు ఇది మార్చి 12, మూడవ దశకు నామినేషన్ పత్రాలను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 19. ప్రస్తుతం ఒకటి, రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు బీజేపీ నుంచి 70 మంది అభ్యర్థులతో కమలనాథులు జాబితాను విడుదల చేశారు. అసోం పార్టీ అభ్యర్థుల జాబితాను ఆమోదించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా అగ్ర నాయకులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది.
ఇక, అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ప్రచారంలోనే అంతే స్పీడుతో దూసుకుపోతంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలపై బీజేపీ నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇటీవల అసోం తేయాకు తోటల్లో సందడి చేసింది. మహిళా కార్మికులతో కలిసి ఆమె తేయాకు కోయడం మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అసోం బీజేపీ చీఫ్ రంజిత్ దాస్ స్పందించారు. ఎన్నికల ముందు గిమ్మిక్కులు చేసేవారికి కాకుండా, ప్రజలకు మేలు చేసే పథకాలు తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వానికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
మహిళా కార్మికుల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని రంజిత్ దాస్ వెల్లడించారు. గర్భవతులైన మహిళా కార్మికుల కోసం మొత్తం 12 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని, 6 నెలలు ప్రసూతి సెలవులు ఇస్తున్నామని వెల్లడించారు. గర్భవతులైన మహిళా కార్మికులు ఖాతా తెరిచిన వెంటనే మొదట 5 వేలు జమ చేస్తున్నామని, ఓటర్లు ఆ 5 వేలు చూస్తారా..? లేక ప్రియాంక గాంధీ కోసిన 5 టీ ఆకులు చూస్తారా..? అని దాస్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో అసోంలో బంగ్లాదేశీయులు ప్రవేశించి స్థానిక మైనారిటీ రాజకీయ హక్కులను హరించివేశారని ఆయన ఆరోపించారు. అందుకే ప్రజలు బీజేపీని ఎంచుకున్నారని, తాము తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా పంచాయతీ ఎన్నికల్లోనూ గెలిపించారని గుర్తుచేశారు.