పాలక్కాడ్ నుంచి శ్రీధరన్..
రెండు చోట్ల సురేంద్రన్..
కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే..

0
664

కేరళలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలతో పాటు.. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంతో సెగ మరింత రాజుకుంది. ప్రధాన పక్షాలైన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా.. తాజాగా బీజేపీ కూడా దాదాపు అన్ని సీట్లలో తమ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో.. 115 సీట్లలో బరిలోకి దిగుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. వీరిలో 112 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అరుణ్ సింగ్ విడుదల చేశారు. మిగిలిన 25 సీట్లను నాలుగు పార్టీలకు కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారని.. మంజేశ్వర్, కొన్నీ స్థానాల నుంచి ఆయన బరిలో వుంటారని అన్నారు.

ఇక, బీజీపీ సీఎం అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ కు పాలక్కాడ్ నియోజకవర్గం కేటాయించినట్టు ఆయన స్పష్టం చేశారు. తనకు రాష్ట్రంలో ఏ సీటు కేటాయించినా గెలిచి తీరుతానని.. శ్రీధరన్ ఇప్పకటి ప్రకటించారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.రాజశేఖరన్ నెమమ్ సీటు నుంచి,.. మాజీ కేంద్ర మంత్రి కె.జె. అల్ఫోన్స్ కంజీరాపల్లి నుంచి,.. సురేష్ గోపీ త్రిచూర్ నుంచి బరిలో ఉన్నారని అరుణ్ సింగ్ వెల్లడించారు.

ఇక మిగతా రాజకీయ పక్షాలైన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ 91 స్థానాలకు పోటీ చేస్తుండగా.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 27 సీట్లలో బలపరీక్షకు సిద్ధమైంది. అటు, సీపీఐ, సీపీఎం తమ అభ్యర్థుల పేర్లను ఇదివరకే ప్రకటించాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పిన‌రయి విజ‌య‌న్ కూడా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. క‌న్నూర్ జిల్లాలోని ధ‌ర్మాడం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం అభ్య‌ర్థిగా పోటీచేస్తున్నారు. కాగా కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ముఖ్యంగా పాలక ఎల్డీఫ్ ను ఇరకాటాన పెట్టవచ్చని సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేష్.. కస్టమ్స్ అధికారులకు ఇచ్చిన తన వాంగ్మూలంలో సీఎం పినరయి విజయన్, స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ తదితరుల పేర్లను వెల్లడించి అందర్నీ షాక్ కి గురి చేసింది. దీంతో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనీ విపక్ష కాంగ్రెస్ ఇతర పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్ష పార్టీలైన యూడీఎఫ్, బీజేపీలు దీనిని ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మార్చుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. గత వారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీసీ చాకో పార్టీకి రాజీనామా చేసిన తరువాత.. ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి విజయన్ థామస్ బీజేపీలో చేరారు. కేరళలో ఏప్రిల్ 6న మొత్తం 14 జిల్లాల్లో ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 2న తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలతో పాటే కేరళ అసెంబ్లీ ఫలితాలను వెల్లడిస్తారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here