అసోంలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ప్రచారంలో వేగం పెంచడంతో పాటు.. సీట్ల సర్దుబాటును కూడా ఫైనల్ చేసింది. అసోంలో మొత్తం 126 స్థానాలుండగా.. 92 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. ఇక అసోం గణ పరిషద్ 26 స్థానాల్లో పోటీ చేయనుంది. మరో 8 స్థానాల్లో బీజేపీ మిత్ర పక్షాలు బరిలోకి నిలవనున్నాయి. అయితే మరో చిన్న పార్టీ కూడా బీజేపీలో విలీనం అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు బీజేపీ గుర్తుతోనే బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.
మరోవైపు, బీజేపీకి కేటాయించిన సీట్లలో ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ దాస్, అసోం గణ పరిషద్ అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంతాతో పాటు.. రాష్ట్ర మంత్రులు అతుల్ బోరా, బీజేపీ మిత్ర పక్షం UPPL చీఫ్ ప్రమోద్ బోరో, బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వాస శర్మ తదితరులు తీవ్రంగా చర్చించిన తర్వాత పొత్తు ఖరారైంది. అయితే, ఏజీపీ అధ్యక్షుడు, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రపుల్ల కుమార్ మహంతా ఈసారి బరిలోకి దిగరని పార్టీ స్పష్టం చేసింది. అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
2016లో బీజేపీ తొలిసారి అసోంలో జయకేతనం ఎగురవేసింది. ఈసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపింది. అయితే, ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని 12 సీట్లలో గెలిచిన బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఈసారి కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. బీపీఎఫ్ పొత్తు లేకపోయినా తమకు నష్టమేం లేదని.. ఈసారి కూడా విజయం సాధిస్తామని కమలనాథులు చెబుతున్నారు. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీకి.. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో 47 స్థానాలకు, రెండో విడతలో 39 స్థానాలకు, మూడో విడతలో 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.