ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో లేకుండా పోయాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మార్పులపై త్రివిధదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. తాలిబాన్లు ఊహించని వేగంతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించేశారని.. అది కొంత ఆశ్చర్యానికి గురి చేసినట్లు జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లు ఒకవేళ ఆఫ్ఘన్ దాటి వికృతాలకు పాల్పడితే, అలాంటి ఘటనలు భారత్ లో చోటుచేసుకుంటే, వాటికి ధీటుగా బదులిస్తామని బిపిన్ చెప్పుకొచ్చారు. క్వాడ్ దేశాలు ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు మరింత సహకారాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు వశపరుచుకుంటారని తెలుసని, కానీ ఇంత వేగంగా ఆ ప్రక్రియ జరగడం ఆశ్చర్యపరిచినట్లు రావత్ వెల్లడించారు. గత 20 ఏళ్లలో తాలిబన్లు తమ పట్టుకోల్పోలేదని తెలుస్తోందన్నారు.