హెలికాఫ్టర్ ప్రమాదం నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఢిల్లీలో బిపిన్ రావత్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరుకుంది. హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన ప్రాంతానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి బయలుదేరారు.
ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్‌కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది. హెలికాఫ్టర్ కూలిన సమయంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు అలుముకుంది. ప్రమాద ఘటనపై వాయుసేన దర్యాప్తునకు ఆదేశించింది. ఘటనాస్థలిలో గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయని తెలుస్తోంది. మృతదేహాలను కూనూరు ఎయిర్‌బేస్‌లోని వెల్లింగ్‌టన్ ఆస్పత్రికి తరలించారు. అదే ఆస్పత్రిలో రావత్‌కు ముగ్గురు డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.