More

  పాకిస్తాన్ పీచమణచిన ధీరుడు.. చైనాకు ముచ్చెమటలు పట్టించిన పోరాట వీరుడు

  పాకిస్తాన్ పీచమణచిన ధీరుడు ఇక లేరు. చైనాకు ముచ్చెమటలు పట్టించిన పోరాట వీరుడు సెలవుతీసుకున్నాడు. దేశ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన యోధుడు నిష్క్రమించారు. తమిళనాడులోని కూనూరు వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అర్థాంతరంగా కన్నుమూశారు. 63 ఏళ్ల బిపిన్ రావత్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. భారత రక్షణ, భద్రతా రంగాలలో కీలక సంస్కరణలకు బీజం వేసిన రావత్ మృతి యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

  బిపిన్ రావత్.. తమిళనాడులోని కూనూరులో వున్న వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ సహా ఆయన సిబ్బంది, ఇతర రక్షణ అధికారులు బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి తమిళనాడులోని 11 గంటల 45 నిమిషాలకు సూలూరు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ వెల్లింగ్టన్ వెళ్లేందుకు సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయ్యారు.

  హెలికాఫ్టర్‎లో CDS జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి. సాయి తేజ, హవిల్దార్ సత్పాల్ సహా మొత్తం 14 మంది హెలికాప్టర్ లో బయల్దేరారు. అయితే, గమ్యస్థానానికి చేరడానికి 5 నిమిషాల ముందు.. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల ప్రాంతంలో నీలగిరి అటవీప్రాంతంలో ప్రమాదానికి గురైంది. కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలోని కట్టేరి అనే ఊరి వద్దనున్న టీ ఎస్టేట్ లోని చిన్న ఆవాసానికి దగ్గరగా ఉన్న ఒక లోయలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. హెలికాప్టర్ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సైన్యం రంగంలోకి దిగి గాలింపు, సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక పోలీసులు,అధికారులు,స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

  ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా కాలిపోయింది. మంటల్లో కాలిపోతూ నలుగురు వ్యక్తులు హెలికాప్టర్ నుంచి కిందపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పూర్తిగా గాయపడిన సగం మంది అక్కడికక్కడే మృతి చెందారు. బిపిన్ రావత సహా మిగతావారిని వెల్లింగ్టన్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. కొందరు మార్గమధ్యంలోనే అసువులుబాశారు. బిపిన్ రావత్ సహా మరికొంత మంది అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గిపోవడమే ప్రదామానికి కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై వాయుసేన విచారణకు ఆదేశించింది.

  బయో వార్ ముప్పు గురించి హెచ్చరించిన మరుసటి రోజే బిపిన్ రావత్ అకాల మరణం చెందడం దురదృష్టకరం. డిసెంబరు 20 నుంచి 22 వరకు పూనేలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, భూటాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక, భారత దేశాల కూటమి బిమ్స్‌టెక్‌ ఆధ్వర్యంలో.. విపత్తు నిర్వాహాణకు సంబంధించి పానెక్స్‌ 21 సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందన్నారు. కరోనా విపత్తు సమయంలో సాయుధ బలగాలు శ్రమించి పని చేశాయన్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి బయోవార్‌ ముప్పు ఉందనింటూ రావత్‌ హెచ్చరించారు. బయోవార్‌ ఇప్పుడిప్పుడే ఓ రూపు తీసుకుంటోందన్నారు. ఈ బయోవార్‌ని కలిసికట్టుగా ఎదుర్కొవాలంటూ బిమ్స్‌టెక్‌ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పరస్పర సహాకారం అందించుకోవాలని సూచించారు. ఆ మరుసటి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాశారు.

  భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సేవలందించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఉత్త‌రాఖండ్‌లోని పూరీలో 1958 మార్చి 16న జ‌న్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ ఆర్మీలో పని చేసి లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదాలో రిటైర్‌ అయ్యారు. బిపిన్ రావత్ తన ప్రథమిక విద్యను డెహ్రడూన్ లోని కాంబ్రియన్ హాల్ స్కూల్ లో ప్రారంభించారు. ఆ తర్వాత సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరారు. అటునుంచి డెహ్రడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలోకి ప్రవేశించారు. అక్కడ బిపిన్ ప్రతిభకు ‘స్వోర్డ్ అఫ్ ఆనర్’ లభించింది. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇప్పుడు అదే కాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్తూ అకాల మరణం చెందారు. ఇక, హయ్యర్ కమాండ్ కోర్సును యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజ్-ఫోర్ట్ లీవెన్ వర్త్ , కాన్సాస్ లో పూర్తి చేశారు. అలాగే మద్రాస్ యూనివర్సీటి లో డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ డిగ్రీ, మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమాలను పూర్తి చేశారు. అలాగే, సైనిక మీడియా వ్యూహాత్మక అధ్యయనాల మీద పరిశోధనలకు గానూ మీరట్ లోని చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం ఫిలాసఫీలో డాక్టరేట్ అందించింది.

  1978 డిసెంబర్ 16న గూర్ఖా రైఫిల్స్‌లోని 5వ బెటాలియన్‌లో చేరి తన ఆర్మీ జీవితాన్ని ప్రారంభించారు బిపిన్ రావత్. ఆ సమయంలో ఆయన తండ్రి కూడా అదే యూనిట్ లో పనిచేస్తున్నారు. ఆయన యుద్ధ నైపుణ్యాలను గమనించిన ఇండియన్ ఆర్మీ పలు కీలక ఆపరేషన్లలో ఆయన సేవలను ఉపయోగించుకుంది. రావత్ కు యుద్ధ విద్యలో అపార అనుభవం ఉంది. దేశ వ్యతిరేక, తిరుగుబాటు కార్యకలాపాల నిరోధక ఆపరేషన్లలో పదేండ్ల పాటు సేవలందించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని ఉన్న సమయంలో జమ్మూకాశ్మీర్ ఆర్మీ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యురీ, జమ్మూకాశ్మీర్ లలో మేజర్, కల్నల్ గా సేవలందించారు. సరిహద్దు వెంట Southern కమాండర్ గా III Corps 19th Infantry Division MONUSCO North Kivu కు నాయయత్వం వహించారు. బ్రిగేడియర్ పదోన్నది పొందిన తర్వాత Rashtriya Rifles, Sector 5, 5/11 Gorkha Riflesకు నాయకత్వం వహంచారు. బ్రిగేడియర్ హోదాకు పదోన్నతి పొందిన ఆయన సోపోర్ లో 5 సెక్టార్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్ కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (మోనుస్కో)లో జరిగిన చాప్టర్ 62 మిషన్ లో బహుళజాతి బ్రిగేడ్ కు నాయకత్వం వహించగా, అక్కడ ఆయనకు రెండుసార్లు ఫోర్స్ కమాండర్ ప్రశంసా పత్రం లభించింది.

  మేజర్ జనరల్ గా పదోన్నతి అనంతరం రావత్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ 19వ పదాతి దళ విభాగం (ఉరి)గా బాధ్యతలు స్వీకరించారు. డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో ప్రత్యేక పదవిలో సేవలు అందించారు. మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, మధ్య భారతదేశంలోని రీ ఆర్గనైజ్డ్ ఆర్మీ ప్లెయిన్స్ ఇన్ ఫాంట్రీ డివిజన్ లాజిస్టిక్స్ స్టాఫ్ ఆఫీసర్, మిలటరీ సెక్రటరీ బ్రాంచ్ లో కల్నల్ మిలటరీ సెక్రటరీ మరియు డిప్యూటీ మిలటరీ సెక్రటరీ, జూనియర్ కమాండ్ వింగ్ లో సీనియర్ ఇన్ స్ట్రక్టర్ వంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్‌ 2019లో నియమితులయ్యారు.

  ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు బిపిన్ రావత్. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి రక్షణదళాల అధిపతిగా బిపిన్ రావత్ కృషి చేస్తున్నారు. ముందు చూపుతో వ్యవహరించే సమర్ధత బిపిన్ రావత్ సొంతం.. దేశంలోకి చొరబడే శత్రువులను మట్టుపెట్టడంలో, దెబ్బకొట్టడంలో వ్యూహాలు రచించడంలో బిపిన్ రావత్ దిట్ట. భారత ఆర్మీలో విశేషమైన సంస్కరణలు తీసుకొచ్చి.. ఆర్మీ స్థయిర్యాన్ని పెంచిపోషించారు బిపిన్ రావత్. ప్రభుత్వం భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లుగా ఏర్పాటు చేసే బాధ్యత బిపిన్ రావత్‌దే. భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారిగా గుర్తింపు పొందిన బిపిన్ రావత్.. లద్ధాఖ్ సంక్షోభ సమయంలో త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేశారు. ఇటీవలికాలంలో చైనా జిత్తులకు మన ఆర్మీ దీటుగా సమాధానం చెబుతుందంటే దానికి బిపిన్ రావత్ కృషే కారణం. అలాంటి మహోన్నత సైనిక వీరుడిని కోల్పోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేషనలిస్ట్ హబ్ ప్రార్థిస్తోంది. సెల్యూట్ సర్..!

  Trending Stories

  Related Stories