కరోనా వ్యాక్సిన్లలో చవకైన వ్యాక్సిన్ల కోసం కూడా పెద్ద రేస్ జరుగుతోంది. అందులో భాగంగా ‘బయోలాజికల్ ఈ’ ఫార్మా సంస్థ తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్ ను అందించడానికి ముందుకు వచ్చింది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్ టీకా దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్ కానున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్ ఈ సంస్థ కార్బివాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా మొదటి రెండు దశల్లో మెరుగైన ఫలితాలు చూపగా.. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి.
ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి రూ. 500గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో డోసు కేవలం 250 రూపాయల కంటే తక్కువ కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. సంస్థ మాత్రం ఇంకా కార్బివాక్స్ టీకా ధరను అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ రూ. 500కే రెండు డోసులు లభిస్తే దేశంలోనే అత్యంత చవకైన వ్యాక్సిన్ ఇదే కానుంది.
భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల ధరలు ఇంతకంటే ఎక్కువే ఉన్న సంగతి తెలిసిందే..! సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 600/2 డోసులు, ప్రైవేటులో రూ. 1200/2 డోసులుగా ఉంది. ఇక భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ రెండు డోసుల ధర ప్రభుత్వాలకు రూ. 800, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 2400గా ఉంది. రష్యా టీకా స్పుత్నిక్ వి ధర ఒక్కో డోసుకు రూ. 995గా నిర్ణయించారు.
బయోలాజికల్-ఈ నుంచి 30 కోట్ల టీకా డోసుల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది. 30కోట్ల టీకా డోసుల కోసం గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ డీల్ కుదర్చుకుంది. 1,500 కోట్ల రూపాయలను అడ్వాన్స్‌గా అందించనుంది. మూడో దశ ప్రయోగాల తర్వాత అత్యవసర వినియోగానికి సంస్థ దరఖాస్తు చేసుకుంది. మరికొద్ది నెలల్లోనే ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవాగ్జిన్ తర్వాత రానున్న మరో దేశీయ టీకా ఇదే కావడం విశేషం. బయోలాజికల్ ఈ సంస్థ ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య టీకాలను తయారు చేసి, నిల్వ చేస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి, వ్యయపరంగా సహాయం అందించి స్వదేశీ టీకాలను ప్రోత్సహించేందుకే దేశీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. బయోలాజికల్ ఈ ఫార్మా సంస్థ హైదరాబాద్ కు చెందినదే కావడం విశేషం.