బీహార్ లో కుప్పకూలుతున్న బ్రిడ్జిలు.. కేబుల్ బ్రిడ్జి రెండోసారి..!

0
231

అవినీతికి కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే బీహార్ లో ఓ బ్రిడ్జి కూలిపోవడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బీహార్‌ భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న కేబుల్‌ వంతెన కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఖగారియాలో రూ.1,717 కోట్లతో వంతెనను నిర్మిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయి నీటిలో పడిపోయింది. గంగా నదిపై నిర్మాణంలో ఉన్న నాలుగు లేన్ల వంతెన పేకమేడలా కూలిపోయింది. 2014లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించిన ఈ వంతెన సుల్తాన్‌గంజ్, ఖగారియా జిల్లాలను కలుపుతుంది. ఘటనపై విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బ్రిడ్జి కూలినప్పుడు ఏదో పేలుడు సంభవించిందని అనుకున్నామని, తీరా బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వ అవినీతికి సాక్ష్యమని అంటున్నారు. బ్రిడ్జి కూలిపోవడం ఇదే మొదటిసారి కాదని, ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయిందని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఖగారియా అగువాని – సుల్తాన్‌గంజ్‌ మధ్య గంగా నదిపై ఈ వంతెనను బీహార్‌ ప్రభుత్వం నిర్మిస్తోంది. 2020 నాటికి పూర్తి కావాల్సిన ఈ వంతెన పనులు ఇంకా పూర్తీ అవ్వలేదు. ఈ వంతెన కూలిపోవడం ఇది రెండోసారి. సీఎం నితీశ్‌ కుమార్‌ కలల ప్రాజెక్టు అయిన దీనిని 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్‌గంజ్‌ పేరుతో నిర్మిస్తున్నారు. 2014లో దీని నిర్మాణానికి నితీశ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. 2020 నాటికే ఈ వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అయినా ఇంకా జరగలేదు.

అయితే బీహార్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఏమీ కొత్తకాదు. గతంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ బిల్డింగ్ లు, బ్రిడ్జ్ లు ఊహించని విధంగా కూలిపోయాయి. దీనితో బీహార్ అవినీతికి కేరాఫ్ గా మారిపోయింది. గత డిసెంబర్‌లో బెగుసరాయ్ జిల్లాలో వంతెన రెండుగా చీలి బుర్హి గండక్ నదిలో పడిపోయింది. వంతెనను ప్రజల కోసం అధికారికంగా ప్రారంభించలేదు. ప్రారంభించడానికంటే ముందే వంతెన కూలిపోయింది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. నలంద జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఓ కార్మికుడు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. కిషన్‌గంజ్‌, సహర్సా జిల్లాల్లోనూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూడా కూలిపోయాయి.