More

  అమెరికాలో ఆర్థిక మాంద్యం..! భారత్‎పై బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

  మొన్న శ్రీలంక.. నిన్న పాకిస్తాన్.. నేడు నేపాల్. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి.. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోంది. అలాగే రాజకీయ సంక్షోభం సైతం కలవరపెడుతోంది. బ్రిటన్ వంటి దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.

  ఇలాంటి తరుణంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం నిత్యం పెరుగుతూ వెళ్తున్నది. దేశాల ఉనికిని ఈ ద్రవ్యోల్బణంగా సవాల్ గా మారింది. దీంతో కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో మాంద్యంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో మాంద్యం రాబోదన్నారు. తన దృష్టిలో ప్రస్తుతం మాంద్యంలోకి వెళ్లడం లేదని చెప్పారు. అమెరికాలో నిరుద్యోగ రేటు ఇప్పటికీ చరిత్రలో అత్యల్పంగా ఉందన్నారు. ఇది కేవలం 3.6శాతంలోనే ఉన్నదని వెల్లడించారు. ఈ వేగవంతమైన వృద్ధి నుంచి స్తబ్దత ఉన్న వృద్ధికి తాము వెళుతున్నప్పుడు.. తమ ఆర్థిక వ్యవస్థ కొంచెం తిరోగమనాన్ని చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది దేవుని చిత్త అని.., తాము మాంద్యం చూడబోతున్నామని అనుకోనన్నారు.

  ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు భారత్‌పై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ మినహా చాలా పెద్ద దేశాలు మాంద్యం బారినపడుతాయన్నారు. ఇప్పటికే ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న చాలా ఆసియా దేశాలు మాంద్యం బారినపడే ప్రమాదం ఉందని ఇటీవల బ్లూమ్‌బర్గ్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం చైనా మాంద్యంలోకి కూరుకుపోయే అవకాశాలు 20 శాతం ఉన్నాయి. అమెరికాలో 40 శాతం, యూరప్‌లో 55 శాతం ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రపంచ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది మాంద్యం ప్రమాదాన్ని పెంచింది. ఆసియా ఆర్థిక వ్యవస్థలు యూరప్, అమెరికా కంటే మరింత స్థితిస్థాపతను కలిగి ఉన్నాయి. అయితే, ఆసియా దేశాలు 20 నుంచి 25 శాతం మాంద్యం బారినపడే అవకాశాలున్నాయి.

  మరోవైపు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం త్వరలో దిగిరానుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల గ్లోబల్ కమొడిటీ ధరలు తగ్గిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వివిధ దేశాలు అనుసరించిన కఠినమైన ద్రవ్య విధానం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అధిక వడ్డీ రేట్ల పెంపు ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చని ఆయా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో గత మూడు నాలుగు వారాలుగా ఉన్న అధిక ద్రవ్యోల్బణం తగ్గనుందని అనంత నాగేశ్వరన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. తగ్గుతున్న కమొడిటీ ధరలు, ఆర్థిక వృద్ధిపై అధిక వడ్డీ రేట్ల ప్రభావంతో ద్రవ్యోల్బణం గరిష్ఠానికి చేరుకుందన్నారు. భారత్‌కు సంబంధించి తగ్గుతున్న కమొడిటీ ధరలు, అమెరికాలో బాండ్ మార్కెట్ వడ్డీ రేట్లు అనుకూలంగా మారాయని ఆయన తెలిపారు. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న సమయంలో సేవలు, సరుకుల ఎగుమతుల వృద్ధి ద్వారా చమురు దిగుమతి బిల్లు బ్యాలెన్స్ అవుతోందని అనంత నాగేశ్వరన్ వివరించారు. ప్రస్తుతం భారత్ వద్ద 580 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లు ఉన్నప్పటికీ అధిగమించగలమని అనంత నాగేశ్వరన్ వెల్లడించారు.

  అయితే అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోన్న వేళ ఆర్థిక మాంద్యం భయాలు మాత్రం నానాటికీ ఎక్కువ అవుతున్నాయి. అయితే పలు అమెరికా ఉన్నతాదికారులు మాత్రం మాంద్యం భయాందోళనలను కొట్టిపారేస్తున్నారు. కార్మిక రంగం పటిష్టంగా ఉన్నందున ఆర్ధిక వ్యవస్థ తిరోగమనం అసంభవమని చెబుతున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అమెరికా వృద్ధి రేటు ఊహించిన దానికంటే 1.6శాతం పడిపోయింది. వరుసగా రెండో ఏడాదిలోనూ జీడిపీ తగ్గే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు జూన్ నెలలో ద్రవ్యోల్బణం కూడా 40ఏళ్ల సరికొత్త గరిష్టానికి చేరింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఫెడ్ సమావేశం కానుంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీ రేట్ల పెంపు అత్యవసరమని ఇప్పటికే ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ఆర్థిక వ్యవస్థను నిర్వర్యం చేయకుండా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని అన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరగడం, మాంద్యం భయాలతో అమెరికాలో బైడెన్ ప్రజామోద రేటు, ఆర్థిక నిర్వహణ రేటు గణనీయంగా పడిపోయాయి. ట్రంప్ హయాంలో ఆయనకు ఉన్న చెత్త రేటింగ్ కంటే బైడెన్ ప్రజామోద రేటు తక్కువగా ఉండటం గమనార్హం.

  Trending Stories

  Related Stories