అమెరికా మరోసారి దాని బుద్దిని బయట పెట్టింది. శక్తివంతమైన దేశాల మీదకు చిన్న దేశాలను రెచ్చగొట్టి ఆ తర్వాత అర్ధంతరంగా వదిలేయటం ఆ దేశానికి అలవాటే. ఇప్పుడూ అమెరికా అదే చేసింది. ఐతే రష్యా – ఉక్రెయిన్ మధ్య నెలలు తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది నిండుతుంది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తోంది.
అలాగే రష్యా దాడులను ఉక్రెయిన్ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. 11 నెలలుగా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ.. వారిని వెనక్కి పంపించగలిగింది. ఇక రష్యా కూడా వ్యూహత్మకంగా ముందుకు సాగుతోంది.
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు ఎఫ్ 16 యుద్ధ విమానాలను సరఫరా చేయడాన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ కు ఆయుధ సహాయాన్ని అందించడంలో భాగంగా ఎఫ్ 16 యుద్ధ విమానాలను సరఫరా చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
అలాగే ఉక్రెయిన్ కు నైతిక మద్దతును తెలియజేయడానికి తాను పోలెండ్ లో పర్యటించనున్నట్లు బైడెన్ చెప్పారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేయాల్సిందిగా తన స్టాఫ్ కు ఆదేశించానని వెల్లడించారు. 11 నెలలుగా రష్యాతో పోరాడుతున్న తమకు మరిన్ని ఆయుధాలను అందించాలని, వాటి సరఫరాను వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే జో బైడెన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనితో ఉక్రెయిన్ కు మిగతా దేశాల సాయం అందటం పై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా నిర్ణయం ఉక్రెయిన్ కు పెద్ద దెబ్బే అని నిపుణులు చెప్తున్నారు.