More

  ఆధార్‎తో దొంగ ఓట్లకు చెక్..!

  ఎన్నికల సంస్కరణల దిశగా అధికార ఎన్డీఏ ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల ప్రక్రియలో దశాబ్దాల వెనుకబాటు తర్వాత.. భారీ సంస్కరణలకు బాటలు వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిన ఎన్నికల నిర్వహణను సరళతరం చేయాలని ప్రధాని మోదీ సంకల్పించారు. ఇందులో భాగంగా.. ఆయన ఇప్పటికే వన్ నేషన్, వన్ ఎలక్షన్‎ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే, అంతకంటే ముందు ప్రజాస్వామ్యానికి చీడపురుగులా మారిన నకలీ ఓట్ల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌కు మరిన్ని అధికారాలు కల్పించేలా.. ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2021ని తీసుకొచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు తాజాగా లోక్‎సభలో ఆమోదం పొందింది. అసలు ఎన్నికల సవరణ బిల్లులో ఏముంది..? ఓటర్లకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం.

  దేశంలో ఓటింగ్ స్వరూపాన్ని మార్చేసే ప్రతిష్టాత్మక బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‎సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు కొన్ని ప్రతిపక్షాలు అడ్డుపడినా.. చివరికి సభ ఆమోదం పొందింది. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఈ బిల్లులో పలు ప్రతిపాదనలున్నాయి. అందులో మొదటితి, అతి ముఖ్యమైనది ఆధార్ – ఓటర్ ఐడీ అనుసంధానం. అందుకే ఈ బిల్లును ఆధార్ – ఓటర్ ఐటీ అనుసంధాన బిల్లు అని కూడా పిలుస్తున్నారు. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని.. స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఓటర్ ఐడీలకు ఆధార్ కార్డును లింక్ చేయడమనేది.. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రతిపాదనల్లో ఇది కూడా ఒకటి.

  పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో మనమే స్వయంగా ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ రెండు డాక్యుమెంట్లను లింక్ చేయడం ద్వారా.. ఓటర్ లిస్ట్‎లోని డూప్లికేట్ ఓట్లకు చెక్ పడుతుంది. తద్వారా ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే తొలగించేలా చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. అంటే, దేశంలో నకిలీ ఓట్ల పీడవిరగడవుతుంది. అయితే, లింక్ చేయడానికి ఇష్టపడని వారి కోసం.. ఎన్నికల కమిషన్ కు మరికొన్ని అధికారాలు ఇచ్చింది. అవసరం అనుకుంటే.. ఇలాంటి వారిని ఆధార్ నెంబర్ అడిగే అధికారాన్ని ఈసీకి కట్టబెట్టింది. ఈ భారీ సవరణ కోసం 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23ని ప్రభుత్వం సవరించింది కేంద్ర ప్రభుత్వం.

  ప్రస్తుతం, దేశంలోని ఓటర్ ఐడీ నమోదుకు ఉన్న నియమ నిబంధనలు, అనేక మోసాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం.. ఓటర్ నమోదు సమయంలో అధికారులు అనేక రకాల పత్రాలను సేకరిస్తున్నారు. అవన్నీ దొంగ ఓట్లకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. పాస్ పోర్టు కాపీ, గ్యాస్ బిల్లు, నీటి బిల్లు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఆధార్ కార్డు.. వీటిలో ఏది ఇచ్చినా.. ఓటు నమోదు చేస్తారు. అయితే, వీటిలో ఆధార్ కార్డు మినహా.. ఏది కూడా బయోలాజికల్ ప్రూఫ్ కాదు. దీంతో ధృవీకరణ పత్రాలను దుర్వినియోగం చేసి నకిలీ ఓట్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త బిల్లుతో నకిలీల లీలలకు తెరపడనుంది. తద్వారా దేశంలో భారీగా నమోదవుతున్న దొంగ ఓట్లకు కాలం చెల్లినట్టే.

  జీవ సంబంధమైన మన ఉనికికి ప్రస్తుతం ఆధార్ ను మించిన ప్రత్యామ్నాయం లేదు. ఆధార్ కార్డులో ప్రతి ఒక్కరి బయో మెట్రిక్ డేటా నిక్షిప్తమయి వుంటుంది. ఒకరి బయోమెట్రిక్ డేటాతో పౌరుడి ఆధార్ కార్డును తయారు చేసిన తర్వాత, దానిని నకిలీ చేయడం దాదాపు అసాధ్యం. ఓటరు ఐడీతో ఆధార్ కార్డులను అనుసంధానించడం వల్ల.. వలసదారులకు చెక్ పడుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడి.. అక్రమార్గంలో ఓటు నమోదు చేసుకుంటున్న మతోన్మాదుల ఆటలు ఇక సాగవు.

  ఈ బిల్లు ద్వారా ఇంకా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. అది ఏటా నాలుగు సార్లు ఓటు నమోదు ప్రక్రియ చేపట్టడం. ప్రస్తుతం ప్రతి ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటినవారు మాత్రమే ఓటర్ ఐడీ కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొత్త బిల్లు అమల్లోకి వచ్చాక.. ఏటా నాలుగు సార్లు ఓటరు నమోదుకు అవకాశం లభిస్తుంది. అంటే, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునేవారు.. ప్రతి మూడు నెలల కాలంలో ఎప్పుడు 18 ఏళ్లు నిండినా.. ఓటు నమోదు చేసుకోవచ్చన్నమాట. అయితే, కొత్తగా ఓటు నమోదు చేసుకునే అభ్యర్థులు దృవీకరణలో భాగంగా.. ఈసీ ఆధార్ కార్డును చూపాల్సివుంటుంది.

  ఇలా ఏటా నాలుగు సార్లు ఓటు నమోదుకు అవకాశం ఇవ్వడం ద్వారా.. జాప్యానికి తెరపడనుంది. ఉదాహరణకు జనవరి 2వ తారీఖున ఒక వ్యక్తికి 18 ఏళ్లు నిండాయని అనుకుందాం. అంటే, ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి మళ్లీ జనవరి 1 వరకు ఆగాలి. ఈలోపు ఏవైనా ఎన్నికలు జరిగితే.. 18 ఏళ్లు నిండినా కూడా.. ఓటు వేసే హక్కును కోల్పోతారు. అందుకే, ఈ కొత్త బిల్లు ఏటా నాలుగు సార్లు ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ప్రాతిపదికన ఏటా నాలుగు సార్లు ఓటు నమోదు చేసుకునే అవకాశం వుంటుంది.

  ఇక ఈ కొత్త బిల్లు.. సర్వీసు ఆఫీసర్ల భార్యలకు మాత్రమే ఉన్న పోస్టల్ బ్యాలెట్ హక్కును జెండర్ న్యూట్రల్‎గా మార్చింది. కొత్త రూల్ ప్రకారం మహిళా సర్వీసు ఆఫీసర్ల భర్తలు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తి భార్య మాత్రమే సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంది. ఇటీవలికాలంలో దేశంలోని సైనిక వ్యవహారాల్లో మహిళల భాగస్వామ్యం కూడా భారీ స్థాయిలో పెరుగుతోంది. కాబట్టి, సర్వీస్ ఓటర్ల జాబితా నుండి వారి భర్తలను మినహాయించడం లింగ వివక్షే అవుతుంది. దీంతో కొత్త చట్టం ప్రకారం.. సైనికుల జీవిత భాగస్వాములు.. అంటే, భార్యలైనా, భర్తలైనా.. ఓటు నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇందుకోసం 1950 ప్రజాప్రాతినిథ్య చట్టంలోలోని సెక్షన్ 20, అలాగే, 1951లోని సెక్షన్ 60ని సవరించనున్నారు.

  ఇక, పోలింగ్ కేంద్రాల స్వాధీనంపై ఈసీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల నిర్వహణ కోసం ఎంపిక చేసే పాఠశాలలు, ముఖ్యమైన సంస్థలను ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి. ఇలాంటి వాటికి సంబంధించి అన్నింటికి ఈ బిల్లు చెక్ పెట్టనుంది. ఇకపై పోలింగ్ కేంద్రాల ఎంపిక విషయంలో పూర్తిగా ఈసీకే అధికారం కట్టబెట్టింది.

  ఓటర్ల జాబితాను మెరుగు పరచడానికి ఓటింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికే కొత్త బిల్లును తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. భారత ప్రజస్వామ్యాన్ని దొంగ ఓట్లు అపహస్యం చేస్తూనేవున్నాయి. ఎంత అత్యాధునిక టెక్నాలజీ వాడినా.. ఈ నకిలీ ఓట్ల సమస్య తొలిగిపోలేదు. దీంతో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

  అయితే, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చే ఇలాంటి ప్రతిష్టాత్మక బిల్లును సైతం విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విఘాతమంటూ కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలు ఆరోపించాయి. శశిథరూర్, అసదుద్దీన్ వంటి స్వయంప్రకటిత రాజకీయ మేథావులు.. ఈ ప్రతిష్టాత్మక బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పూర్తి మెజారిటీతో కూడిన మోదీ ప్రభుత్వం లోక్‎సభలో బిల్లును గట్టెక్కించింది.

  ఇదిలావుంటే, ఆధార్‎తో ఓటర్ ఐడీ అనుసంధానాన్ని రాజకీయ, సామాజిక, ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న దొంగ ఓట్ల నిర్మూలనుకు ఇంతకు మించిన పరిష్కారం లేదని కొనియాడుతున్నారు. ఈ చర్యను.. ఎన్నికల ప్రక్రియ నుంచి దొంగ ఓట్లను దూరం చేసే ఆయుధంగా అభివర్ణించారు.. ఆధార్ ప్రాదికారక సంస్థ మాజీ సీఈవో, ప్రస్తుత కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అభిప్రాయం వ్యక్తం చేశారు.

  మొత్తానికి, ఈ బిల్లు ద్వారా దేశంలో భారీ ఎన్నికల సంస్కరణకు మార్గం సుగమమైంది. అయితే, ఎన్నికల ప్రక్రియ మరింత సరళతరంగా, పారదర్శంగా మారాలంటే ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సివుంది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వద్ద ఇలాంటివి దాదాపు 40 ఎన్నికల సంస్కరణలు క్యూలో వున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగం కోసం తమ నియోజకవర్గాల వెలుపల ఉన్న వ్యక్తులకు రిమోట్ ఓటింగ్ కూడా ఇందులో ఉంది. అదేవిధంగా, ఎన్నికల సమయంలో పెయిడ్ న్యూస్ ముప్పు నిర్మూలించడం కూడా ఇందులో ఒకటి.

  ప్రస్తుతం అమల్లోవున్న ఎన్నికల చట్టాలు తరుచూ నిపుణుల విమర్శలకు గురవుతూనేవున్నాయి. EVM ట్యాంపరింగ్, రాజకీయ పార్టీల నిధులు, పెయిడ్ వార్తల దుర్వినియోగం, సంక్లిష్టమైన ఎన్నికల నియమాల కారణంగా గతంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. కొత్త ఎన్నికల సంస్కరణలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  మొత్తానికి, ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానంతో దొంగ ఓట్లకు తెరపడినట్టే. అన్నట్టు ఈ రెండు డాక్యుమెంట్లను ఎలా లింక్ చేసుకోవాలో చెప్పలేదు కదూ.. చాలా సింపుల్ అండీ..! ఓటర్ ఐడీకి ఆధార్ కార్డును లింక్ చేయాలనుకునేవారు.. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్‌ www.voterportal.eci.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి.. అక్కడ వున్న ఇన్ స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎస్ఎంస్, ఫోన్ కాల్ ద్వారా కూడా ఆధార్, ఓటర్ ఐడీ లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం 166 లేదా 51969 నెంబర్‌కు ఓటర్ ఐడీ, ఆధార్ నెంబర్లను ఎస్ఎంఎస్ చేయాలి.

  ఇక, 1950 నెంబర్ కు కాల్ చేసి కూడా రెండింటినీ అనుసంధానం చేసుకోవచ్చు. అయితే, 1950 నెంబర్‌కు కాల్ చేయాలనుకునేవారు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య కాల్ చేయాల్సివుంటుంది. ఇవన్నీ కుదరకపోతే.. మీకు దగ్గర్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ జిరాక్స్ ఇచ్చి ఈ రెండు డాక్యుమెంట్స్ లింక్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత రెండు నెంబర్లు లింక్ అవుతాయి. లింకింగ్ స్టేటస్ www.voterportal.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

  Trending Stories

  Related Stories