More

    ఆపద్బాంధవునికి మరో అరుదైన పురస్కారం..!

    ప్రధాని మోదీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా.. తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఎన్‎గడగ్ పెల్ గి ఖోర్లో’ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. Overjoyed to hear His Majesty pronounce Your Excellency Modiji’s name for the highest civilian decoration, Order of the Druk Gyalpo.. అంటూ ట్విట్టర్ వేదికగా కీర్తించింది..

    అంతేకాదు, మోదీని గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అంటూ కొనియాడింది భూటాన్ పీఎంవో. అనేక సంవత్సరాలుగా, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మోదీజీ అందించిన మోదీ మద్దతు, స్నేహం మరువలేనివని ప్రశంసించింది. భూటాన్ పీఎంవో తన ఫేస్‌బుక్ పేజ్‌లోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. భూటాన్ ప్రజల నుంచి అభినందనలు అందుకోడానికి మోదీ అర్హులని.. వారు మిమ్మల్ని మహోన్నత ఆధ్యాత్మిక వ్యక్తిగా చూస్తున్నారని తెలిపింది. మీతో కలిసి సన్మానం జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నారంటూ కీర్తించింది.

    భూటాన్‌ రాజు జగ్మే వాంగ్‎చుక్ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్రమోదీకి దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తున్నామని భూటాన్ ప్రధాని లొటే షెరింగ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆయన అందిస్తున్న స్నేహపూర్వక సహకారం, ముఖ్యంగా కొవిడ్‌ సమయంలో మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నామని ప్రకటించారు. ఈ అవార్డు అందుకునేందుకు మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్ చేశారు.

    2008లో తొలిసారి భూటాన్ ప్రభుత్వం ‘ఎన్‎గడగ్ పెల్ గి ఖోర్లో’ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ‘ఎన్‎గడగ్ పెల్ గి ఖోర్లో’ అనేది భూటాన్ ప్రజలకు, ఆ దేశానికి జీవితకాల సేవకు గుర్తింపుగా అందించే అత్యున్నత పురస్కారం. పురస్కారాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆ దేశ పౌరులకు మాత్రమే ఈ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో, ఈ అత్యున్నత పౌరపుస్కారానికి ఎన్నికైన తొలి విదేశీ నేతగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు.

    భారత్, భూటాన్‌ల మధ్య దశాబ్దాలుగా బలోపైతమైన దౌత్య సంబంధాలున్నాయి. ఆర్థిక, సామాజిక అంశాల్లో భారత్ ఆ దేశానికి అండగా నిలుస్తూ వస్తోంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బంధం మరింత బలపడింది. ఇటీవలికాలంలో భూటాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు భారత్ సాయం అందించింది. గత నెలలోనే భూటాన్‌లో ఈ-రూపే కార్డు యొక్క రెండవ దశను మోదీ ప్రారంభించారు.

    కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న సందర్భంలో.. భూటాన్‎కు భారత్ ఆపన్న హస్తం అందించింది. వాక్సిన్ మైత్రిలో భాగంగా భారత్ నుంచి తొలి కొవిడ్ టీకా డోసు భూటాన్‎కే వెళ్లింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‎ టీకాలను 2021 జనవరిలో భూటాన్‎కు అందించింది భారత్. ఆపత్కాల సమయంలో 5 లక్షల 50 వేల వ్యాక్సిన్ డోసులను ఉచితంగా పంపిణీ చేసి ఉదారతన చాటుకుంది. ఈ వ్యాక్సిన్ మైత్రితో భారత్-భూటాన్ బంధం మరింత బలోపేతమైంది.

    స్వాతంత్ర్యం తర్వాత.. భారత్, భూటాన్ మధ్య ఫ్రెండ్‌షిప్ ట్రీటీ కుదిరింది. ఇందులో చాలా నిబంధనలున్నాయి. విదేశీ వ్యవహారాలు, రక్షణ అవసరాల కోసం భారత్‌పై భూటాన్ ఆధారపడటం ఒకటి. తర్వాతి కాలంలో ఈ ఒప్పందంలో మార్పులు చేశారు. కాలం చెల్లిన నిబంధనలను తొలగించారు. ఆర్థిక సహకారంతోపాటు సంస్కృతి, ఆరోగ్యం, స్పోర్ట్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో బంధాలను బలోపేతం చేసుకొనేందుకు కొత్త నిబంధనలు చేర్చారు. అప్పటి నుంచి అనేక అంశాల్లో భారత్.. భూటాన్‎కు బాసటగా నిలుస్తూ వస్తోంది.

    చైనాతో డోక్లాం వివాదం సమయంలో భూటాన్‌కు మద్దతుగా భారత్ నిలవడంతో మూడు నెలల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. డోక్లాం వివాద సమయంలో.. భారత్ అనవసరంగా భూటాన్ సరిహద్దు శిబిరంలో కాలు పెడుతోందని చైనా ఆరోపించింది కూడా. నాటి నుంచి డ్రాగన్ భారత్ పై మరింత గుర్రుగా వుంది. చీటికిమాటికి సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతూనేవుంది. అటు భూటాన్‎ను కూడా బెదిరిస్తోంది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య భూటాన్ ప్రభుత్వం ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఒక్క భూటాన్ మాత్రమే కాదు.. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు భారత్‎ను తమ విశ్వసనీయమైన మిత్ర దేశంగా గుర్తించాయి. ఎల్లప్పుడూ పొరుగుదేశాలతో బలమైన మైత్రిని కోరుకునే మోదీ.. ప్రధాని పదవి చేపట్టి నాటి నుంచి అనేక దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా వాక్సిన్ మైత్రిలో భాగంగా 96 దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేసి కష్ట కాలంలో ఆపన్న హస్తం అందించారు. మోదీ సహాయ సహకారాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు కురిపించాయి. కొవిడ్ వ్యాక్సిన్లు ఉచితంగా అందించిన భారత్ సౌశీల్యతను అనేక దేశాలు కీర్తించాయి. అగ్రదేశాలు సైతం అచ్చెరువొందాయి.

    ఒక్క కరోనా విషయంలోనే కాదు.. ఆర్థిక, సామాజిక, సాంస్కృతి, రక్షణ రంగాల్లో ఎన్నో దేశాలతో సహాయ సహకారాలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు మోదీ. ఈ నేపథ్యంలో మోదీ స్నేహశీలతను, అభివృద్ధి కాంక్షను గుర్తించిన ఎన్నో దేశాలు.. భూటాన్ లాగే తమ దేశాలకు చెందిన అత్యున్నత పౌర పురస్కారాలు అందించి సత్కరించాయి. గతంలో సౌదీ అరేబియా, అప్ఘనిస్తాన్, అమెరికా, రష్యా వంటి ఎన్నో దేశాలు ప్రధాని మోదీని తమ దేశ పౌర పురస్కారాలతో సత్కరించాయి.

    భారత ప్రధానిని గౌరవించే విషయంలో పరస్పర శత్రుదేశాలు ఒకేతాటిపైకి రావడం మోదీ దార్శనికతకు.. ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ దౌత్యనీతికి అద్దం పడుతోంది. అమెరికా ప్రభుత్వం ‘లెజియన్ ఆఫ్ మెరిట్’తో సత్కరిస్తే.. ఆ దేశం అంటే ఏమాత్రం పొసగని రష్యా.. ‘ఆర్దర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్’ పురస్కారాన్ని అందజేసింది. ఈ పురస్కారం రష్యాలో అత్యున్నత పౌరపురస్కారం. ప్రధాని మోదీ ఇరు దేశాలకు సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇరు దేశాలతోనూ రక్షణ కొనుగోళ్లు జరుపుతున్నారు. ఎస్-400, ఎస్-500 వంటి అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. అయితే, రష్యా నుంచి ఎస్-400 కొనుగోలు చేసిన మిగతా దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది. కానీ, భారత్ విషయంలో మాత్రం బైడెన్ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అంతేకాదు, స్వయంగా అమెరికా సైతం మనకు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని ఎగమితి చేస్తోంది. అపాచీ, చినూక్ వంటి అత్యాధునిక హెలికాప్టర్లను మనం యూఎస్ నుంచే కొనుగోలు చేస్తున్నాం.

    ఇక, ఇజ్రాయెల్, పాలస్తీనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఆ రెండు దేశాలు ఎంత బద్ధ శత్రువులో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ, ప్రధాని మోదీ విషయంలో మాత్రం ఇరు దేశాలు సమాన గౌరవమర్యాదలు అందిస్తాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‎తో దౌత్య బంధానికి బాటలు వేశారు. ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీనే. రక్షణ రంగం విషయంలో ఇరు దేశాలు విశేషమైన సహాయ సహకారాలు ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ కు భారత్ నమ్మకమైన మిత్రదేశం. సహజంగా ఈ పరిణామం పాలస్తీనాకు కంటగింపుగా మారాలి. కానీ, ఆ దేశం కూడా భారత్ తో మునుపెన్నడూ లేని విధంగా దౌత్య బంధాన్ని కొనసాగిస్తోంది. విదేశీ నేతలకు ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ఇచ్చింది గౌరవించింది పాలస్తీనా. 2018లో ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్’ అవార్డుతో సత్కరించింది.

    ఇవే కాదు.. సౌదీ అరేబియా ‘ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్’ పురస్కారాన్ని అందజేసింది. ఈ దేశంతో భారత్ దౌత్య సంబంధాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అభివృద్ధి చెందిన ఇస్లామిక్ దేశాల్లో సౌదీది మొదటి స్థానం. సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశం అయినప్పటికీ.. పాకిస్తాన్ ను కాదని.. భారత్ తో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. రోజు రోజుకూ ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన బంధం బలోపేతమవుతోంది. ఇదే సమయంలో ఉగ్రవాద పాకిస్తాన్ తో సంబంధాలను తెంచుకుంది సౌదీ. ముఖ్యంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ అసద్ కు భారత ప్రధాని మోదీ అంటే అపారమైన గౌరవం.

    ఇక, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ‘స్టేట్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లాఖాన్’ పురస్కారం అందుకున్నారు మోదీ. భారత్ అందిస్తున్న సహాయసహకారాలు, దైత్య సంబంధాలకు గుర్తింపుగా.. ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. తాలిబన్లు ఆక్రమించుకునే వరకు ఆఫ్ఘనిస్తాన్‎తో భారత్ బలమైన మిత్రదేశంగా కొనసాగింది. ఆ దేశంలో పార్లమెంట్ బిల్డింగ్, నీటి పారుదల ప్రాజెక్టులు సహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేసింది. ప్రస్తుత తాలిబన్ సర్కార్ కూడా భారత్‎తో సఖ్యతగానే ఉంటున్నట్టు కనిపిస్తోంది.

    అలాగే, యూఏఈతోనూ భారత్‎కు బలమైన దౌత్య సంబంధాలున్నాయి. ఆ దేశం ప్రధాని మోదీకి ఇచ్చిన ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ అవార్డు ఇందుకు అద్దం పడుతుోంది. మాల్దీవులు సైతం ప్రధాని మోదీని ‘ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్’ అవార్డుతో సత్కరించింది. అలాగే, 2019లో బహ్రెయిన్ నుంచి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్’ పురస్కారాన్ని పొందారు మోదీ.

    ఆఫ్ఘనిస్తాన్, సౌదీ, యూఏఈ మాత్రమే కాదు.. మొత్తం గల్ఫ్ దేశాలన్నీ ప్రధాని మోదీ పట్ల, భారత్ పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడో మీరో విషయం గమనించారా..? ప్రధాని మోదీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించిన దేశాల్లో సింహభాగం ఇస్లామిక్ దేశాలే. కానీ, మన దేశంలోని కుహనా సెక్యులర్లకు, మతోన్మాదులకు, లెఫ్ట్ లిబరల్ మేథావులకు, ఒంటికన్ను మీడియా సంస్థలకు, ఓట్లకోసం మాత్రమే రాజకీయాలు నడిపే సెక్యులర్ పార్టీలకు మాత్రం.. మోదీ ముస్లిం ఒక వ్యతిరేకి. కానీ, ఈ కుహనావాదుల దుర్భుద్ధి ఇస్లామిక్ దేశాలకు లేదు. అందుకే, మోదీని, భారత ప్రభుత్వానికి గౌరవ మర్యాదలు ఇస్తున్నాయి. అధికారం కోసం దేశాన్ని అస్థిరపరిచేందుకైనా సిద్ధపడే రాజకీయ పక్షాలు ఎంతగా విషం చిమ్మినా.. ప్రపంచ వేదికపై మోదీ ప్రతిష్ట, భారత్ కీర్తిని ఏమాత్రం దిగజార్చవు అనడానికి ఆ దేశాలు అందిందిచిన, అందిస్తున్న పురస్కారాలే సాక్ష్యం.

    ఉగ్రవాద పాకిస్తాన్, వక్రవాద చైనా మినహా.. దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశం భారత ప్రధానిని తమ అత్యున్నత పురస్కారాలతో సత్కరిస్తున్నాయి. ఇలా ప్రపంచ దేశాలకు తలలో నాలుగా మెదులుతూ.. వైసుదైక కుటుంబం అనే సనాతన హైందవ ధర్మ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలన్నింటితోనూ స్నేహ సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారు. అందుకే, ఆయా దేశాల నుంచి ఇంతలా గౌరవ మర్యాదలు, పురస్కారాలు దక్కుతున్నాయి. ఇక్కడ ప్రధాని మోదీకి దక్కుతున్న గౌరవం అంటే.. ఆయనకు వ్యక్తిగత గౌరవం కాదు. దేశాలిచ్చే పురస్కారాలు ఆయనకు, ఆయన కుటుంబానికి కాదు. ప్రధానిగా అందుకుంటున్న ప్రతి పురస్కారం.. భారత్‎కు గౌరవ చిహ్నం. భారతదేశ ప్రతిష్టకు నిలువుటద్దం.

    Trending Stories

    Related Stories