‘భారతీయ యుద్ధ ధర్మం’పై కొత్త కోర్సు..!

0
765

విదేశీయుల కుట్రలతో మెకాలే మూసలో పడిపోయి.. వందల సంవత్సరాలుగా భారతీయ సనాతన విజ్ఞానికి దూరమవుతున్నాం. స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర శతాబ్దాలు గడిచినా.. ఇంకా.. అన్నం పెట్టే చేతిని నరికేసే వలస పాలకుల చరిత్రను వల్లెవేస్తున్నాం. ఇప్పటికీ మన పాఠ్యపుస్తకాల్లో మొఘల్స్, బ్రిటిష్ చరిత్రలే తిష్టవేసుకుని కూర్చున్నాయి. శత్రువు దాడి చేసి.. సంపద దోచుకుంటున్నా.. ప్రాణాలు హరిస్తున్నా.. ఇంకా శాంతి మంత్రాన్నే జపిస్తున్నాం. శాంతి మంత్రాన్ని ఎక్కడ ఉచ్ఛరించాలో.. ఎక్కడ పౌరుషాన్ని చూపించాలో తెలియని దీనస్థితిలో.. యుద్ధ ధర్మాన్ని మరిచిపోయి చేష్టలుడిగి చేస్తూనేవున్నాం. మరిచిపోతున్న మన సనాతన విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించాలన్న ధ్యాస పాలకులకు లేదు. పిల్లల ఎదుగుదలను మార్కుల పట్రీలతో కొలుస్తున్న తల్లిదండ్రులకూ లేదు. అయితే, కొన్ని యూనివర్సిటీలు హైందవ సనాతన చరిత్రను అందిస్తుండటం శుభపరిణామం.

వారణాసిలో వున్న బనారస్ హిందూ యూనివర్సిటీ అందిస్తున్న ‘హిందూ స్టడీస్’ విభాగంలో తాజాగా కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. మరిచిపోయిన మన క్షాత్ర ధర్మాన్ని గుర్తుచేసేలా ప్రాచీన గ్రంథాల్లోని యుద్ధ తంత్రాలు కోర్సులో పొందుపరిచింది. అంతేకాదు, ఈ కోర్సులో సైనిక వ్యూహాలు, శిబిరాల ఏర్పాటు, యుద్ధంల మహిళా సైనికుల పాత్ర వంటి అనేక అంశాలుంటాయి. ప్రాచీన వేద సాహిత్యంలోని ‘డిఫెన్స్ స్టడీస్’ను అధ్యయనం చేస్తూ.. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే అంశాలు తెలియచెప్పడమే కోర్సు ముఖ్య ఉద్దేశం.

కోర్సులో ప్రధానంగా “ఇండియన్ మిలిటరీ, సైన్స్ అండ్ స్ట్రాటజీ’ పేరుతో ఒక పేపర్ కింద నాలుగు యూనిట్లు ఉంటాయి. వాటిలో..
మిత్రులు, శత్రువులు – నిర్వచనం
శత్రువులపై విజయం సాధిస్తూ మిత్రులను ప్రోత్సహించే విధానం
సైన్యంలో మహిళల పాత్ర
కోటలు, సైనిక శిబిరాల నిర్మాణం
యుద్ధానికి అనువైన వేళలు, ప్రదేశం
యుద్ధవ్యూహాలు – అమలు
గెలుపు లేదా ఓటమి తరువాత వ్యూహాలు.. వంటి అంశాలతో కోర్సు సాగుతుంది.

వేద సాహిత్యంలోనే సైనిక విజ్ఞానం, సైన్యం వ్యూహాల గురించిన ప్రస్తావన ఉందని ప్రపంచం మొత్తానికీ తెలుసు. అయితే ఆ జ్ఞానం ఇప్పటివరకు అభ్యాసంలోకి రాలేదు. విద్యార్థులకు పాఠ్యాంశాల ద్వారా ప్రాచీన సైనిక శాస్త్రం, వ్యూహాలు తెలియచేయడం, అధ్యయనం చేయించడం ఈ పరిస్థితుల్లో అత్యంత అవసరం. అందుకే, యుద్ధ తంత్రాలపైన కొత్త కోర్సును అందిస్తున్నట్టు బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు రెండు ముఖ్యమైన పుస్తకాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సంస్కృతంలోని వశిష్టుడి ‘ధనుర్వేద సంహిత’ తో పాటు వైశంపాయనుడి ‘నీతి ప్రకాశిక’లో సైనిక వ్యూహలుంటాయి. వాటి గురించి చాలామందికి తెలీదు.

దేశ రక్షణలో చైనా వంటి దేశాలు ప్రాచీన సైనిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాయి. మనం మాత్రం మన యుద్ధరీతులను మరిచిపోయాం. మిగతా నాగరికతలు పురుడుపోసుకోకముందే.. భారతావని వైజ్ఞానిక గని. భారతదేశానికి చెందిన వేదకాలంనాటి గ్రంథాలు, ప్రాచీన సాహిత్యంలో రాజ్యరక్షణ కోసం ఎన్నో వ్యూహాలున్నాయి. బయటి అంతర్గత శత్రువులతో ఎలా వ్యవహరించాలనేదానిపై కీలక సమాచారం ఉంది. యుద్ధం, రాజకీయాలు, జాతీయ వ్యూహం, పరిపాలనకు సంబంధించిన అంశాలపై భారతీయ శాస్త్రగ్రంథాల్లో ప్రత్యేక ప్రస్తావన ఉంది. అలాంటి ముఖ్యమైన అంశాలపై మరింత అధ్యయనం, పరిశోధన మరింత విస్తృతంగా జరగాలి. ఇంతవరకు మెయిన్ సిలబస్ లో ప్రత్యేక పాఠ్యాంశాలుగా లేవు. హిందూస్టడీస్ లో భాగంగా.. బనారస్ హిందూ యూనివర్సిటీలోని ఫిలాసఫీ అండ్ రిలీజియన్, భారత్ అధ్యయన కేంద్రం, సంస్కృత విభాగం, ప్రాచీన చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాఖలు ఆ ప్రయత్నమే చేస్తున్నాయి.

ఒకప్పుడు మిలిటరీలో మహిళలు పోషించిన పాత్రకీలకం. చరిత్రలో సైన్యం, యుద్ధాల్లో మహిళల భాగస్వామ్యం చాలా గొప్పది. రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి వంటి వాళ్లు యుద్ధభూమిలో పోరాటం చేశారు. ఇప్పుడూ మహిళలు రక్షణ సేవల్లో భాగం కావాలి. అది మన మూలాల్లోనే ఉంది అనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాలవాళ్లు హిందువులు వారి నాగరికత గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.ఇక విదేశాల్లో స్థిరపడిన వాళ్లైతే మరింత ఆసక్తిగా ఉన్నారు. తమ మూలాలను వెతుక్కుంటూ వెళ్లి, మరింత కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ప్రాచీన సాహిత్య గ్రంథాల్లోని జ్ఞానసంపదను తెలుసుకోవాలని తిరిగి పొందాలనే సంకల్పం వారిలో కనిపిస్తోంది.

ఇక ఈ తాజాగా ప్రవేశపెట్టిన కోర్సులో మొదటి సంవత్సరం 40 మంది విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. రెండేళ్ల MA కోర్సులో 9 కచ్చితమైన, 7 ఐచ్ఛికమైన పత్రాలు ఉంటాయి.

ఇలా సైనిక శాస్త్రం, తత్వశాస్త్రం, జ్ఞానశాస్త్రం వంటి హిందూ మత గ్రంథాల్లోని వివిధ అంశాలకు అకడమిక్ ఫార్మాట్ ఇవ్వడం దేశంలో ఇదే మొదటిసారి. సిలబస్‌లో సంప్రదాయ హిందూజీవన విధానం, ప్రధానసూత్రాలు, వ్యాఖ్యానాలు, చర్చలు, ఆయా గ్రంథాల అర్థాన్ని వివరించే నిర్ణయించే పద్ధతులు, పాశ్చాత్య జ్ఞానం, రామాయణం, మహాభారతం, వాస్తుశిల్పం, జానపద, జానపద – నాటకం, భాషాశాస్త్రం, ప్రాచీన సైనిక శాస్త్రం ఉన్నాయి.

ఏదేమైనా, మరిచిపోతున్న మన విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించడానికి బెనారస్ యూనివర్సిటీ ముందుకురావడం శుభపరిణామం. ఇక్కడ విశేషమేంటంటే, నేషనలిస్ట్ హబ్ మహాయజ్ఞంలో మేం చేస్తున్న ప్రయత్నం కూడా అదే. సనాతన యుద్ధ ధర్మాలను, యుద్ధనీతి, యుద్ధ విద్యలను ముందు తరాలకు అందించడానికి ఇటీవలే ‘క్షాత్రం’ ఛానెల్ ను ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. క్షాత్రంలో ప్రాచీన భారతీయ యుద్ధ శాస్త్రాన్ని.. ఇప్పటి ఆధునిక కాలానికి అనుగుణంగా వివరిస్తూ రూపొందించిన ఎపిసోడ్లు.. అతి త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × two =