ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ ప్రమాణం చేయించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయ్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాతీ భాషలో భూపేంద్ర పటేల్ ప్రమాణం చేశారు. భూపేంద్ర పటేల్ గుజరాత్ 17 వ ముఖ్యమంత్రి.
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. భూపేంద్ర పటేల్ తనకు చాలా సంవత్సరాలుగా తెలుసని, ఆయన ఉత్తమమైన పనితీరును తాను గమనించానని మోదీ చెప్పారు. ఆయన భారతీయ జనతాపార్టీ కోసమైనా, పరిపాలనలోనైనా, సమాజసేవలోనైనా ఉత్తమ పనితీరు కనబరుస్తారని ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు.
భూపేంద్ర పటేల్ రాజకీయ జీవితం:
59 ఏళ్ల పటేల్ ఇంజనీరింగ్ చదివారు. అతని రాజకీయ జీవితం 1995 లో మేమ్‌నగర్ నాగార్పిక సభ్యుడిగా ప్రారంభమైంది. అతను 1999-2000 మధ్య మేమ్‌నగర్ నాగార్పిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( AUDA) ఛైర్మన్ మరియు అమదవద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC) స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. గుజరాత్‌లోని ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పటేల్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన శశికాంత్ పటేల్‌పై 1,17,000 ఓట్ల తేడాతో గెలిచారు. యుపి గవర్నర్ మరియు గుజరాత్ మాజీ సిఎం ఆనందీబెన్ పటేల్ గతంలో ఈ సీటు నుండి పోటీ చేశారు. మృదువుగా మాట్లాడే, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్ ను ఆదివారం నాడు విజయ్ రూపానీ వారసుడిగా ఎన్నుకున్నారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన నేతలతో పాటూ విజయ్ రూపానీ భూపేంద్ర పేరును ప్రతిపాదించారు, దీనిని కేంద్ర పార్టీ పరిశీలకుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా సమర్థించారు. ముఖ్యమంత్రి రేసులో ఎంతో మంది అగ్రనేతలను కాదని భూపేంద్ర పటేల్ ను బీజేపీ అధిష్టానం ఎన్నుకుంది. డిసెంబర్ 2022 లో జరగబోయే కీలకమైన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీకి ఆయనే నాయకత్వం వహిస్తారు.