National

జమ్మూ కాశ్మీర్ లో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన

శ్రీవెంకటేశ్వరస్వామి జమ్మూకశ్మీర్‌లోనూ కొలువుదీరనున్నారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో భూమిపూజ చేశారు. జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం 62.10 ఎకరాలు కేటాయించింది. రూ.33.22కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఆలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన నిర్వహించారు. మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత అక్కడ ఆలయం నిర్మిస్తామని అప్పట్లోనే టీటీడీ ప్రకటించింది. అందులో భాగంగా ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టారు.

జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జమ్మూ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే మజీన్ ప్రాంతంలో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించనుంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి ఆనుకునే ఉంటుందీ ప్రాంతం.

జమ్మూలోని మజీన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించాలని భావించిన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నానని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. రూ .33.22 కోట్ల వ్యయంతో రెండు దశల్లో ఈ ఆలయ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆలయం, వేద పాఠశాల, టీటీడీ ఉద్యోగుల క్వార్టర్లను నిర్మిస్తారు. ఇది తొలిదశలో నిర్మాణం పూర్తవుతుంది. రెండోదశలో భక్తులకు అవసరమైన కాటేజీల నిర్మాణాన్ని టీటీడీ భావిస్తోంది. మెడిటేషన్ సెంటర్‌ను కూడా నిర్మిస్తారు.

ఈ భూమి మొత్తాన్నీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు లీజుకు ఇచ్చింది. లీజు కాల పరిమితి 40 సంవత్సరాలు.. ఆ తరువాత కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. దశలవారీగా నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రధాన ఆలయాన్ని రెండేళ్లలో నిర్మించాలని ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. ఆశిష్ కోహ్లీ (డోగ్రా జర్నలిస్ట్) ఆలయం నిర్మిస్తున్న ప్రదేశం వీడియోను పంచుకున్నారు.

టీటీడీ ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత మాతా వైష్ణో దేవి మందిరం, అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రాల యాత్రికులను, పర్యాటకులను ఆలయం కూడా ఆకర్షించనుంది. ఈ ప్రాంతం యొక్క ఆర్ధిక వృద్ధికి ఈ ఆలయం దోహదపడుతుందని ఆయన అన్నారు. ఏప్రిల్ 1, 2021 న లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా నేతృత్వంలోని జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఈ ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లో టీటీడీ ఆలయ నిర్మాణాన్ని 2019లో ప్రకటించింది. వారణాసిలో కూడా ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 3 =

Back to top button