పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కళాశాల క్యాంపస్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో నివసిస్తున్నారు. విద్యార్థులు హాస్టల్ గదిలో తోటి విద్యార్థిపై కర్రలు, పీవీసీ పైపులతో దాడి చేసిన వీడియో వైరల్ అయ్యింది. దాడిచేసిన వ్యక్తులు కర్రలతో కొడుతూ ఉండగా బాధితుడు వేడుకుంటూ క్షమాపణలు చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో బాధితుడు అంకిత్ గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ కావడంతో ప్రవీణ్, ప్రేమ్, స్వరూప్, నీరజ్ అనే నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగిందని, శనివారం వీడియో ఘటన వెలుగులోకి రావడంతో చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
యువతి విషయంలో గొడవ పడినట్లుగా తెలుస్తోంది. ఇంజినీరింగ్ కాలేజీలో అంకిత్ ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఓ యువతి విషయంలో నలుగురు విద్యార్థులు అంకిత్‌తో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఈ నెల 2న అంకిత్‌ను హాస్టల్‌లోని తమ గదికి పిలిచిన నలుగురు విద్యార్థులు అతడిని గదిలో బంధించి కర్రలతో చావబాదారు. ఆపై ఇస్త్రీపెట్టతో కాల్చారు. తనను విడిచిపెట్టాలని బాధిత విద్యార్థి వేడుకుంటున్నా వారు కనికరించలేదు. యువకుడిని చితకబాదుతుండగా కొందరు విద్యార్థులు తీసిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కాలేజీ యాజమాన్యం బాధిత యువకుడు, యువతి సహా ఆరుగురిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.