యోగి ఆదిత్యనాథ్ పై పోటీ చేయనున్న చంద్రశేఖర్ ఆజాద్

0
913

బీజేపీ అధిష్టానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను తూర్పు యూపీలోని స్వస్థలమైన గోరఖ్‌పూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిపింది. గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో అక్కడే నుంచే ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యోగి ఆదిత్యనాథ్ పై పోటీకి పలువురు దిగుతున్నారు. ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ కి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ అయిన చంద్రశేఖర్ ఆజాద్ గత వారం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో సమాజ్ పార్టీ, SP మధ్య పొత్తుకు అవకాశం లేదని ఆజాద్ తెలిపారు. 2022 యూపీ ఎన్నికల్లో చంద్రశేఖర్ ఆజాద్ గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తారని ఆజాద్ సమాజ్ పార్టీ అధికారిక నోట్ విడుదల చేసింది. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు చర్చలు విఫలమవడంతో చంద్రశేఖర్‌ ఆజాద్ పార్టీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో దాదాపు 33 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది.

గోరఖ్‌పూర్ యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోటగా పరిగణించబడుతుంది. యోగి 1998, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికలలో వరుస విజయాలను నమోదు చేసి, గోరఖ్‌పూర్‌ నుండి ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. అంతేకాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన గోరఖ్‌నాథ్‌ మఠానికి అధిపతిగా ఉన్నారు. అక్కడ ఆయన్ను ఓడించాలంటే ఇతర పార్టీలకు చాలా కష్టమే..!

అధికార బీజేపీ జనవరి 15న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 107 మంది అభ్యర్థులతో తమ మొదటి జాబితాను విడుదల చేసింది. గోరఖ్‌పూర్ (అర్బన్) అసెంబ్లీ నియోజకవర్గం నుండి యోగి ఆదిత్యనాథ్‌ను, ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సిరతు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను పోటీకి దింపింది. కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ ఎస్పీ చీఫ్ అఖిలేష్‌పై విరుచుకుపడ్డారు, యుపి అసెంబ్లీ ఎన్నికలలో పోరాడటానికి ఆయన భయపడుతున్నారని అన్నారు. ‘అఖిలేష్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయం.. పోటీ చేసే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి చాలా సమయం పట్టింది. పోటీ చేయాలంటేనే భయపడుతున్నారు.2012 నుంచి 2017 మధ్య కాలంలో ఏ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందిందో చెప్పండి అఖిలేష్ జీ’ అంటూ మౌర్య కౌంటర్లు వేశారు. ఇక సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే..! ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ జనవరి 19, 2021న బీజేపీలో చేరారు.