పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఈ శుక్రవారం విడుదలైంది. టికెట్ ధరలు పెంచుతామన్న ఏపీ ప్రభుత్వం ఇంకా పెంచలేదు. థియేటర్లపై ఏపీ ప్రభుత్వం రెవెన్యూ అధికారులు, పోలీసులతో నిఘా విధించారు. దీనిపై పవన్ అభిమానులు ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానీల వాహనాలను అడ్డుకున్నారు. గుడివాడలో జీ3 భాస్కర్ థియేటర్ ప్రారంభోవత్సవ కార్యక్రమానికి వచ్చిన పేర్ని నాని, కొడాలి నానీలను పవన్ అభిమానులు అడ్డుకున్నారు. జనసేన జెండాలు పట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా వాహనాలకు అడ్డుగా రావడంతో పోలీసులు అడ్డుకోవాల్సి వచ్చింది. పవన్ అభిమానులను అక్కడ్నించి పంపించివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలని చంద్రబాబు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.
తీవ్ర విమర్శల నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కల్యాణ్ సినిమాను తొక్కేయాల్సిన అవసరం తమకు లేదని, సినిమాను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఏనాడైనా చంద్రబాబు, నారా లోకేశ్ పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణం బాధలో తామున్నామని, అందువల్లే టికెట్ ధరలకు సంబంధించిన జీవో ఆలస్యమయిందని చెప్పారు. సినిమాలో దమ్ముంటే విజయం సాధిస్తుందని, లేకపోతే మరో ‘అజ్ఞాతవాసి’ అవుతుందని అన్నారు. తన సినిమాను ఉచితంగా చూపిస్తానని పవన్ కల్యాణ్ అన్నారని గుర్తు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని స్వయంగా బాలకృష్ణే తనతో చెప్పారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బాలకృష్ణ అబద్ధం ఆడతారని తాను అనుకోవడం లేదన్నారు పేర్ని నాని. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు సినిమా విడుదలకు ముందు నన్ను కలవడానికి విజయవాడ వచ్చారు. అదే సమయంలో వారు హీరో బాలకృష్ణతోనూ ఫోన్ లో మాట్లాడించారు. జగన్ ను కలుస్తానని బాలకృష్ణ చెప్పారు. అదే విషయాన్ని నేను సీఎం జగన్ కు తెలిపాను. అయితే ‘అఖండ’ సినిమాకు సంబంధించి బాలకృష్ణ నిర్మాతలకు పూర్తి సహకారం అందించమని జగన్ నాకు చెప్పారు. బాలకృష్ణ తనను కలిస్తే అది వేరే విధమైన ప్రచారానికి కారణమౌతుందని జగన్ అన్నారు. అప్పుడు సీఎం జగన్ ను కలుస్తానని చెప్పిన బాలకృష్ణ ఇప్పుడు కలవనని చెబుతారని నేను అనుకోవడం లేదని. బాలకృష్ణ అబద్ధం చెబుతారని కూడా భావించడం లేదని నాని అన్నారు.
ఏపీలో సినిమా టికెట్లపై నెలకొన్న వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ట్రోలింగ్‌కు ఎంతమాత్రం భయపడేది లేదని ఆయన ప్రకటించారు. టికెట్ ధరలు నచ్చకపోతే..సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కూడా బొత్స చెప్పుకొచ్చారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల, అతి తక్కువగా ఉన్న సినిమా టికెట్ రేట్ల కారణంగా కొన్ని సినిమా థియేటర్ల మూత తదితరాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయనుకుంటే.. ఆ వ్యవహారం తేలేదాకా సినిమా విడుదలను వాయిదా వేసుకోవచ్చుకదా? అని మంత్రి ప్రశ్నించారు. టికెట్ రేట్లు, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశ్రమకు చెందిన చిరంజీవి సహా పలువురు ప్రతినిధులు ఇప్పటికే తమ ప్రభుత్వంతో చర్చలు జరిపారని, ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన విషయాలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసిందన్నారు. కమిటీ నివేదిక వచ్చాక అన్ని విషయాలపై నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. అప్పటిదాకా పాత జీవో ఆధారంగానే సినిమా టికెట్లు ఉంటాయని అన్నారు. ఇవేవీ పట్టకుండా తమ ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియా వేదికగా కొందరు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని, ఈ తరహా ట్రోలింగ్‌కు తాము భయపడే ప్రసక్తే లేదని బొత్స తేల్చిచెప్పారు.
భీమ్లా నాయక్ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఆ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ యాజమాన్యాలను నష్టాల నుంచి ఆదుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో హుండీలు ఏర్పాటు చేశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో విరాళాల సేకరణ కార్యక్రమాలు చేపట్టారు. భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు తాజా పరిణామాలతో నష్టపోతే అందులోని సొమ్మును అందించాలని పవన్ కల్యాణ్ అభిమానులు నిర్ణయించారు.