More

  ఒక్కసారి ఆలోచించండి..!
  – డా. భాస్కరయోగి

  ఉక్కు కవచాల్లా మోదీ, షా మనకున్నారని గుండె మీద చేయి వేసుకుని గుర్రుగా నిద్రిస్తున్నాం. వాళ్లు ఆ సింహాసనం దిగిపోయిన అర గడియలో ఈ దేశం మళ్ళీ పాత పద్ధతిలో కి వచ్చేస్తుంది అన్నది ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. వాళ్లు మన గల్లీ లో కూడా మనల్ని రక్షించాలని ఆశించి నోరు తెరుచుకొని కూర్చోవడం ఊహాత్మక మైన భ్రమనే తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు వాళ్ళ స్థాయిలో చరిత్రలో కొన్ని పేజీలకు శిలాక్షరాలు రాసేశారు. కశ్మీర్ 370 ఆర్టికల్, 35 A రద్దు, రామ మందిరం ఇష్యూ, CAA వగైరా వగైరా. మరి, మనం వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా, చరిత్ర మకిలిని తొలగించకుండా, విశ్వవిద్యాలయాల్లో మార్పులు లేకుండా, మీడియాను కంట్రోల్ చేయకుండా కేవలం ఆ ఇద్దరిని చూస్తూ బ్రతుకే ద్దామా..!?

  సారంగాపూర్, గజియాబాద్, భైంసా, ఓల్డ్ సిటీ, కాన్పూర్, బోధన్.. మొదలైన ప్రాంతాల్లో కూడా వాళ్లే వచ్చి మమ్మల్ని రక్షిస్తారని గుర్రుపెట్టి నిద్ర పోదామా..!? ఇపుడు మనల్ని జనాభా సమస్య పట్టిపీడిస్తోంది. మేం ఇద్దరం.. మాకు ఇద్దరు.. ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు.. ఈ సూత్రం మనం అద్భుతంగా అమలు చేయడం వల్ల ఇప్పుడు వృత్తి పనులన్నీ మన చేతుల్లో లేకుండాపోయాయి.. మన పని మనం చేసుకోలేని దుస్థితి.. దానికి కారణం ఏంటి..!? నీ దగ్గర మనిషి లేకుంటే పోరాటం ఎవ్వడు చేస్తాడు.. ఇద్దరిలో ఒకడు ఆస్ట్రేలియాలో మరొకడు అమెరికాలో.. వాడు అక్కడి నుంచి డాలర్స్ పంపిస్తుంటే వంటినిండా షుగర్.. బీపీ పెట్టుకొన్న.. ముసలి తండ్రి ఇక్కడ ఫామ్ హౌజ్ భూములు, రెరా పర్మిషన్ ఉన్న విల్లాలు కొనడంలో బిజీ. మధ్య తరగతి నుంచి పై స్థాయి వారికి ఇదే గోల.. ఇక కిందిస్థాయి వాళ్లను ప్రభుత్వ పథకాలు, పార్టీలు, కులాలు, అజ్ఞానం, పేదరికం అవిద్య, అవగాహన లోపం, ద్వేషం, అసూయ, అమాయకత్వం పట్టి పీడిస్తోంది. ఇతర మతాల వాళ్ళు పంచర్ షాప్ నడిపినా పాలస్తీనా మీద అవగాహన ఉంటుంది. మనవాళ్లకు ధర్మం పట్ల గాని దేశం పట్ల గాని కౌన్సిలింగ్ శూన్యం.

  ఇటీవల మద్రాస్ హైకోర్టు మతం మారిన వాళ్లకు రిజర్వేషన్లు వర్తించవు అన్న తీర్పు మనం విపరీతంగా సర్కులేట్ చేస్తున్నాం. సంస్థాగతంగా మన పరిధిలో ఆ తీర్పు రావడానికి ఏమైనా ప్రయత్నం చేశామా..? ఎవడో వళ్ళు మండి కోర్టుకు వెళ్లి నానా హింస పడి డబ్బులు ఖర్చు పెట్టి తీర్పు తెస్తే మనం సర్క్యులేట్ చేయడమా..!? బెంగాల్ లో రోజుల తరబడి మత హింస జరిగితే మనకు ఎలాంటి అధికారాలు ఉండవా.!. కేరళ లో కమ్యూనిస్టులు హిందూ సంస్థల కార్యకర్తలు చంపితే మనకు అధికారాలు ఉండవా..! ఢిల్లీలో కేజ్రీవాల్ అండతో షాహిన్ బాగ్ ధర్నాలు జరిపి ఢిల్లీలో అల్లర్లు సృష్టిస్తే.. ఇలాంటి అధికారాలు ఉండవా..! అంటే భారత రాజ్యాంగం.. మమతా బెనర్జీకి, కేజ్రీవాల్ కు, పినరయి విజయన్ కు మాత్రమే.. వీర విహారం చేసేందుకు కావలసిన అధికారులను ఇచ్చిందా..! బెంగాల్ లో మత హింస జరిగిన తర్వాత ఇప్పటివరకు ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ కమిషన్ వేయకపోవడం కూడా మన అను శాసనంలో భాగమేనా!? మరి ఇంత దారుణమైన.. అమాయక క్రమశిక్షణ… మనకు ఎలా మేలు చేస్తుంది..!?

  అసలు మనం మేధో రంగంలో ఎందుకు విశేషంగా.. పనిచేయడం లేదు. విశ్వవిద్యాలయాలు, వ్యవస్థలు, ప్రచార ప్రసార మాధ్యమాలు ఇంత దుర్మార్గంగా, మనల్ని ఎందుకు చూస్తున్నాయి.. మనం అంటే భయం లేకపోవడమా..!? అలుసా..!? తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకోండి.. మీడియాలో జాతి వ్యతిరేక విషయాల చర్చ జరిగితే.. వారి వద్దకు వెళ్లి మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్న టీమ్ ఉందా..? ఎవరికి తోచింది వాడు చేస్తున్నాడు. ఎవరికి దురద పెడితే వాళ్ళు గోక్కుంటున్నారు. వాడికి గాయమైన సంగతి వాడికే తెలియడం లేదు. అయ్యో గాయమైందని పక్క వాళ్ళను మందు అడిగితే నన్ను అడిగి గోక్కున్నావా..! అంటున్నారు. పెద్దన్న పాత్ర పోషించి సమాజంలో జరిగే అన్ని రకాల అంశాలకు కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేసే, లేదా మార్గనిర్దేశనం చేసే వ్యవస్థ ఇంత లోపభూయిష్టంగా నడిస్తే ఎలా..? ప్రతీదీ కాలానికి వదిలిపెట్టి.. మనం టెన్త్ క్లాస్ విద్యార్థుల్లాగా ఒక సిలబస్ తో వెళ్లడం ఎంతవరకు కరెక్ట్.. అని పెద్దలు ఆలోచించాలి.

  రాజకీయ పార్టీలనే ఈవెంట్ మేనేజర్లు నడిపిస్తున్న ఈ కాలంలో మ్యాన్ టు మ్యాన్.. తో మనం గమ్యం ఎప్పుడు చేరుకోగలుగుతాం.. ఇప్పుడు భావజాల సంఘర్షణే యుద్ధం. మేధో ఉగ్రవాదాన్ని మనం ఎదుర్కోవడానికి కావలసిన టూల్స్ మన దగ్గర ఏమున్నాయి.. మత పరమైన పరిజ్ఞానం మనకు శూన్యం. ఇవి ప్రాథమికంగా ఉండే ఆచారాలు దగ్గరే ఆగిపోయింది. దాన్నే మనం సంస్కృతిగా అభివర్ణిస్తున్నారు.. ఆధ్యాత్మికత బోధించాల్సిన స్వామీజీ లంతా తలా ఓ పార్టీలో చేరిపోయారు.

  ఇక వ్యవస్థలన్నీ బ్యూరోక్రాట్స్ (అందరూ కాదు) చేతుల్లో ఉన్నాయి. వాళ్లు చచ్చే రూల్స్ చెప్పి ఈ వ్యవస్థను కాపాడుతున్నాం అనే అజ్ఞానంతో ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు కాపలా కుక్కలా హిందూ జాతిని పీల్చి పిప్పి చేస్తున్నారు… తర్వాత కాలంలో వాళ్లే మనకు సలహాదారులు అవుతున్నారు. ఈ పెద్దలు ఉద్యోగంలో ఉన్న కాలంలో మనల్ని వాళ్ల గేటు కూడా దాటనివ్వరు.ఉద్యోగంలో ఉన్నా, లేకున్నా మన వ్యవస్థలను పరోక్షంగా వాళ్లే నడిపిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగా ఎవర్ని నిందించడం కాదు. అదే మన వ్యతిరేక సిద్ధాంతంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లను చూడండి. వాళ్లు వ్యవస్థను ఎలా వాడుకొని జాతి వ్యతిరేక ఇంజెక్షన్లు ఇవ్వడంలో చురుకుగా ఉంటున్నారు. కింద స్థాయిలో ఒక హిందువు పై చిన్న case అయితే దిక్కు దివాణం లేదు.

  ఇక విశ్వవిద్యాలయాల్లో, మీడియా లో ఉన్న మేధో వర్గం కేజీబీ.. సి ఏ ఏ… ఏజెంట్ల మాదిరి మనమీద దారుణం గా విషం చిమ్ము తున్నారు. ఒక ఆసిఫా మరణాన్ని వీళ్ళు ఆసియా ఖండం మొత్తం వినబడేటట్టు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మరి మనం..!? కనీసం వరంగల్ గుడిలో మైకు పెట్టిన పాపానికి చచ్చిపోయిన పూజారి సత్యనారాయణ హత్యను గురించి గవర్నర్ దగ్గరికి వెళ్ళ గలిగామా..? రోజూ మన ధర్మానికి చెందిన అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసగించబడి మతం మార్చబడి మరణిస్తూ ఉంటే దాన్ని ఆపే అందుకు మన దగ్గర ఒక యోజన ఉందా..?

  సాహిత్య కళారంగాలలో జరుగుతున్న విధ్వంసం మనకు తెలుసా..? 18 మంది మావోయిస్టు సానుభూతిపరులైన రచయితలకు మేధావులకు ఈ ఆరేళ్లలో అవార్డు ఇచ్చిన ఘనత ఎవరిది..!? తదనంతర కాలంలో వీళ్లే జాతి వ్యతిరేక టూల్స్ ను తయారు చేస్తూ.. మనల్ని మింగేస్తుంటే మనం చేతులు ముడుచుకొని చూడడం తప్ప ఇంకేం చేయగలం..!?

  ఆర్ట్స్ కాలేజీ ముందు హిందుత్వాన్ని విమర్శించేందుకు… బ్రాహ్మణవాదం, ఫాసిజం, అంబేద్కరిజం పేరుతో మీటింగ్ లు పెట్టి దుమ్ము దులుపుతున్న వాళ్లను ఎదుర్కొనేందుకు మనం యువ మేధావులను తయారు చేస్తున్నామా..!? పోనీ, ఈ దేశ ప్రధానమంత్రిని అవమానిస్తూ వందలాది కార్టూన్లను వ్యంగంగా చిత్రీకరిస్తున్న పత్రికల వాళ్ళ దగ్గరికి మనం వెళ్లి ఓ రాజకీయ పార్టీగా మాట్లాడగలిగిన సామర్థ్యం మనకు ఉందా..!? బైంసా అల్లర్లలో గాయపడి ఈరోజు వరకు బెయిల్ రాకుండా ఉన్న వ్యక్తుల కుటుంబాలను రక్షించుకునేందుకు మనం సంస్థాగతంగా ఏం చేయగలుగుతున్నాం.!?

  తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వ వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు మనకు ఒక పేపర్ గానీ టీవీ గానీ ఉందా..!? వ్యతిరేక భావజాలాన్ని నేను బహిష్కరించాను అంటూ వ్యక్తిగతంగా గొప్పలు పోతున్న మనం… చదువకుంటే.., చూడకుంటే ఆ టీవీలు ,పత్రికలు మూతపడుతున్నాయా? ఒక్కసారి విజ్ఞత తో ఆలోచించాలి .ఓ పెద్ద సమాజం వాటిని చూడకుండా చదవకుండా ఉంటుందా? చెఱువు మీద అలిగి .. డ్డి కడుక్కోకుండా పోయినట్టుగా. ఉందిమన వ్యవహారం. పోనీ ఇవన్నీ ఆపరేట్ చేసేందుకు ఏదైనా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ లాగా అండర్ కరెంట్ వర్క్ నడుస్తోందా..!?

  కనీసం సినిమా వాళ్ళు చేస్తున్నవిధ్వంసం.. నుండి ఇ మన యువతను రక్షించు కోకపోతే 15 ఏళ్లలో ఈ యువతకు మన దేశానికి ఏ సంబంధం ఉండదు. జాతీయత నుండి మన యువత ను వేరు చేస్తున్న సినిమా నటులు క్రికెట్ ఆటగాళ్లు పోర్న్ సైట్స్ పై మనం దృష్టి పెట్టకపోతే ఇంతే సంగతులు చిత్తగించవలెను. మహిళా శక్తిని విధ్వంస పూరిత ఆలోచనల వైపు నడిపిస్తున్న వినోద కార్యక్రమాలు సీరియల్స్… గురించి మనకు ఏమీ తెలియకుండా అమాయకంగా జీవించడం ఆత్మ ద్రోహమే. భయంకరమైన గేమ్స్ తో మన పిల్లల్ని మాయ చేస్తున్న ఇంటర్నెట్ విధ్వంసం గురించి అమాయకంగా ఉండడం మనల్ని మనం వంచించు కోవడమే…!? ఇతరుల పై దుష్ప్రచారం చేయకున్నా పర్లేదు కానీ మనకు జరిగే అన్యాయానికి గొంతు కూడా లేపకుండా ఎలా ఉండాలి…!? తక్షణం వీటిపై మనకు కార్యాచరణ ఉండకపోతే.. మనం చేస్తున్న పని అంతా ఏటిలో పిసికిన చింతపండు పులుసే.

  (జరుగుతున్న విధ్వంసం కళ్ల ముందు కదులుతుంటే కదిలిన డాక్టర్ భాస్కరయోగి కలం)

  spot_img

  Trending Stories

  Related Stories