More

    ఓ కాలజ్ఞానీ..! మమ్మల్ని మన్నించు..!!
    – డా. పి. భాస్కరయోగి

    ఆయనో కాలజ్ఞాని. 17వ శతాబ్దపు క్రాంతదర్శి. ఆధ్యాత్మికత అందించిన తత్వవేత్త. కంసాలి కులంలో జన్మించిన ఆయన ఈ సమాజాన్ని తన సుత్తితో కొట్టి, పుటం బెట్టిన పుణ్యమూర్తి. జీవసమాధి పొంది ‘సంజీవ మూర్తి’గా జ్ఞాన శిఖరంపై కూర్చుని స్వర్ణమూర్తిగా కాంతులీనుతున్న కర్మయోగి..! సుత్తిబాడిసె పట్టి కమ్మరి వృత్తిలో జీవించినట్టి శ్రమైకమూర్తి..!! ఆయనే బ్రహ్మజ్ఞాని ‘పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి’. కులవాదంతో కొట్టుమిట్టాడుతున్న ఈ సమాజంలో సంయమనం నింపుతూ, దానిని కొనసాగించేందుకు ఆయన ‘మఠం’ స్థాపించారు. ఆ ‘మఠం’ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. వివాదాల్లో పడింది. వారసుల మధ్య ‘కోల్డ్ వార్’ నడుస్తోంది. కోర్టు దాకా వెళ్లింది. ఆ పంచాయతీ ఇప్పుడు హఠయోగంలోని ఆసనంలా ఓ పట్టాన తేలడం లేదు. కానీ ఇటువంటి ‘కోల్డ్ వార్’ అన్ని మఠాల్లో, పీఠాల్లో నడుస్తూనే ఉంది అన్నది నిష్ఠుర సత్యం. ప్రస్తుతం మన కళ్లకు బ్రహ్మంగారి మఠం కనిపిస్తోంది. అంతే!

    ప్రస్తుత ఆధునిక ఆడంబర కాలంలో ఒంటిపై ఏమీ లేకుండా గోచి పాతబెట్టుకొని ‘రమణ మహర్షి’లా ఉన్నా, నిసర్గ దత్త మహరాజ్ లా నిరాడంబరంగా ఉన్నా, గెంటేల వేంకట రమణుల్లా ఆత్మ భావంతో ఉన్నా, ఇటువంటి వారిని వినోదానికి, పైపై మెరుగుల అట్టహాసాలకు అలవాటు పడ్డ భక్తజనం పట్టించుకోరు. ఏ ‘పాల్ బ్రంటన్’ లాంటివారో, సోదరి నివేదిత వంటివారో చెపితే గానీ అటువైపు తిరిగి చూడరు. అదీ మన భక్తికి పట్టిన బూజు.

    బాలసాయి లాగానో, కాళేశ్వర్ బాబా లాగానో ఆస్తులు, ట్రస్టులు సృష్టించి, ఆధునిక హంగులు అద్ది, మంత్ర తంత్రాల ఆర్భాటాలు చూపిస్తే, ఇక అక్కడ వాలే పెద్ద గ్రద్దలు వాళ్లు చచ్చేవరకూ వదిలి పెట్టరు. మొత్తానికి ఏ స్వామి కష్టం ఆ స్వామికి ఉండనే ఉంది. చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పకుంటే ప్రాణమే పోతుంది. ఇదీ ఈనాటి ఎందరో స్వాములూ, వారి మఠాల పరిస్థితి ! ఈ సంప్రదాయ పీఠాల కన్నా రియల్ ఎస్టేట్ తోనో, రాజకీయ నాయకుల అండతోనో సృష్టించుకున్న ఆచార్యులే హాయిగా ఉన్నారు. వాళ్లకు నోరును ఇచ్చేందుకు మీడియా ఎలాగూ ఉంది.

    ఇక బ్రహ్మంగారి మఠంలో ఇటీవల శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి గొప్పవాడే. ప్రజ్ఞ గలవాడే. ఆధ్యాత్మిక వేత్తే. కానీ ఆయన మరణానంతరం ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా టైటిల్ కు అక్కడేం తక్కువ జరగడం లేదు. సంప్రదాయం ప్రకారం పీఠానికి పెద్ద భార్య కుమారుడు ‘వేంకటాద్రి స్వామి’ పీఠాధిపతి కావాలని ఒకరు వాదిస్తే, రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ తన కుమారుడిని పీఠాధిపతిని చేయాలని, లేదంటే కోర్టుకెళతానని, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తోంది. ముక్కు పచ్చలారని ఆ ముని కుమారుడే సజీవ సమాధిపై ఆధిపత్యం వహించాలని ఆ అబ్బాయి కళ్లల్లో ఆనందం చూడాలని ఆమె కోరిక ! ఈలోపు ‘పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చింది’ అన్నట్లుగా ఈ వివాదంలోకి ఎండోమెంట్ శాఖ దిగుతోంది. మరోవైపు మేనేజర్ ఈశ్వరాచారి అక్రమాలకు పాల్పడటం మరో మాయామశ్చేంద్రజాలం. ఈ మఠం ఆస్తుల్లో 2016 నాటికే 3.93 కిలోల బంగారం, 117 కిలోల వెండి ఉన్నట్లు నమోదైంది. 85 ఎకరాల పొలం, 9 కోట్ల రూపాయల ఫిక్స్ డిపాజిట్లు ఉన్నాయని, అధికార, అనధికార వర్గాల భోగట్టా. ప్రసాదాలు, దర్శనం, తలనీలాలు, షాపుల అద్దెలు వంటివన్నీ వీటికి అదనం. ఇంతటి ఆస్తులు అక్కడి ప్రస్తుత పోరుకు మరో కారణం. విరాళాలు, హుండీ లెక్కింపు కోట్లలో ఉండడం ఈ వివాదం చుట్టూ ఈగలు మూగేందుకు ప్రధాన కారణం.

    ఈలోపు హిందూ ధర్మ రక్షణకు ముందుండే శివస్వామి తనతో పాటు మరికొంతమంది స్వాములతో కలిసి ‘జ్యేష్ఠ కుమారుడు వేంకటాద్రికే ఇవ్వాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు 150 పేజీల నివేదిక అందించారు. ఇక ఈ వివాదం ఎలా తేలుతుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే అనుకుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యే రంగంలోకి దిగినా మహాలక్ష్మమ్మకు కోర్టు దారి కనిపించింది. అయితే ఈ మఠ స్థాపకులైన బ్రహ్మజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మంగారి గురించి వినటమే తప్ప పూర్తి వివరాలు, చరిత్ర అనేకమందికి తెలియకపోవచ్చు. ఆ చరిత్ర ఎంత గొప్పదో ఒక్కసారి చూద్దాం.

    అన్నమయములైన వన్ని జీవమ్ములు కూడు లేక జీవకోటి లేదు కూడు తినెడు కాడ కులభేదమేలకో కాళికాంబ..! హంస..! కాళికాంబ..!
    ఇంత దమ్ముతో కులాన్ని వ్యతిరేకించి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని శూద్ర వర్గాల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి. వీరబ్రహ్మేంద్రస్వామి 1608 కీలక నామ సంవత్సరం కడప జిల్లాలోని పోతులూరు అనే గ్రామంలో దువ్వూరి గురవయ్యాచార్యుడు అనే విశ్వకర్మ (కంసాలి) కు జన్మించాడు. వీరప్పయ్య అనే పేరు మొదట ఆయనకు పెట్టగా, బాలుడు పెరిగి పెద్దవాడై అదే జిల్లాలోని కందిమల్లయ్య పల్లెలో స్థిరపడ్డాడు. గృహస్థుడై పరబ్రహ్మ యోగేంద్రునిగా ప్రసిద్ధిని పొంది ‘బ్రహ్మంగారు’గా పిలవబడ్డాడు. బ్రహ్మంగారివల్ల తత్వశాస్త్రం పై తెలుగునాట కొత్త వెలుగు ప్రసరించిందని చెప్పొచ్చు.

    బ్రహ్మంగారి ముందుకాలం వరకు వారి వారి మతానుసారం పీఠాలేర్పడ్డాయి. ఈ సంప్రదాయం ఆదిశంకరుల కాలం నుండి స్థిరత్వం పొందిందని చెప్పొచ్చు. ఈ గురుపీఠాలు అగ్రవర్ణాల వాళ్లకు లేదా కొంచెం విద్యనభ్యాసం చేసిన వాళ్లకే పరిమితమైనాయి. విద్యాభ్యాసం లేని పామరులకు దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలుగునాట ఉదయించడం ఒక క్రాంతి శకం అనే చెప్పొచ్చు. ఆయనకు ముందు సంఘంలో పాతుకొన్న కులతత్వాన్ని, కపట కాషాయాది వేషధారణను కొన్ని అంధ విశ్వాసాలను నిరసించి ఆధ్యాత్మిక మార్గాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ముఖ్యంగా శూద్రకులాలకు ఆధ్యాత్మిక అధికారం ఉంది అని నిరూపించారు. ఆనాటి ఛాందసులైన వాళ్లు ఎంత నిరసించినా వారికి శాస్త్ర ప్రమాణాలు చూపించి నోళ్ళు మూయించారు బ్రహ్మంగారు. దూదేకుల కులానికి చెందిన షేక్ సయ్యద ను సిద్ధప్పగా మార్చి, తన శిష్యునిగా చేర్చుకొని, కడప నవాబుకు, తన స్వంత కుమారులకు కళ్లు తెరిపించాడు. అలాగే బ్రాహ్మణుడైన అన్నాజయ్యకు కాలజ్ఞానం చెప్పాడు. మాదిగ కక్కయ్యకు సాంఖ్యతత్వ ప్రబోధం చేసి కనువిప్పు కల్గించాడు. తన భార్య గోవిందమ్మను, అదే పరంపరలో తన మనుమరాలు ఈశ్వరమ్మకు స్ఫూర్తిని ఇచ్చి స్త్రీలను ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశపెట్టాడు.

    బ్రహ్మంగారి శిష్యులు, అనుచరులు ఆనాటి కులవ్యవస్థను ఛాందసవాదాన్ని ఎదిరించారు. బ్రాహ్మణులతో సమానంగా శూద్రులకు ధర్మోపదేశం చేశారు. ఆ పరంపర ఈనాటికీ కొనసాగుతూ ఉంది. వీర బ్రహ్మేంద్ర స్వామి ఫ్రెంచ్ దేశస్థుడు నోస్ట డామస్, కన్నడ దేశంలోని సర్వజ్ఞుడిలా కాలజ్ఞానం చెప్పి ప్రసిద్ధి చెందాడు. అందులో కొంత మార్మిక లక్షణం కన్పించినా ఈనాడు ఎన్నో సంఘటనలు భవిష్యత్ సూచనలు కన్పిస్తున్నాయి. దళిత, శూద్ర జాతులకు అధికారం లభిస్తుందన్నారు. బ్రాహ్మణుల్లో చాలామంది ధర్మాన్ని వదిలి పెడతారని అంత్య కులజులు వేదజ్ఞానం పొందుతారన్నాడు బ్రహ్మంగారు. కుల బ్రాహ్మణత్వం నశిస్తుందన్నారు.

    బాపలమనుకొని గీపలమనుకొని
    వేదాలు పట్టుక తిరుగేరుమా
    వేదాలు పుట్టిన తావుదెల్పమని
    బాపల బహుబాధ పెట్టేరుమా || హరిగోవింద గోవింద ||

    ముఖ్యంగా మాల మాదిగ జాతులకు మంచాలు, బ్రాహ్మణులకు పీటలు వేసే కాలం వస్తుందని చెప్పారు.

    బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు
    మహిలో వేసేదినము లొచ్చేనుమా
    మధుర తంజావురు మరి హరణమయ్యేను
    మహానంది శిఖరమ్ము విరిగేనుమా || హరిగోవింద గోవింద ||

    బ్రాహ్మణులు శూద్రులు వైశ్యులితరులు గలిసి
    మధుపానమత్తులై పోయేరుమా
    వేదములు అంత్యజుల పాలయ్యిపొయ్యేనుమా!
    బ్రాహ్మణులు భ్రష్టులై పోయేరుమా || హరిగోవింద గోవింద ||

    కులవృత్తి నశియింప కుములుతూ బ్రాహ్మణులు
    పరుల సేవలు సేయ చూసేరుమా
    పరవిద్యకై వీరు పంటభూములనమ్మి
    పేదలై పృథ్వి విలసిల్లేరుమా || హరిగోవింద గోవింద ||

    ఇంత గొప్పగా ఆయన జీవితం గడిచింది. అందుకే ఆ మహాయోగి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగా ప్రసిద్ది చెందారు. బ్రహ్మంగారు, సిద్ధప్ప, ఈశ్వరాంబ తత్వత్రయం యొక్క తాత్విక ప్రభోధం వల్ల నిమ్నజాతులు అనుకునే వాళ్లలో తాము తక్కువ వారమనే భావం తొలగిపోయింది. సంఘంలోని మానవులంతా సమానమే అనే అవగాహన కలిగి శూద్రవర్ణానికి వెన్ను తట్టినట్లయిటి. కులం కన్నా గుణానికి ప్రాధాన్యం ఇవ్వాలనే భావన మరోసారి వెలుగు చూసింది. అదీ బ్రహ్మంగారు మనకిచ్చిన సందేశం. ఇప్పటికే తిరుమల తిరుపతి లాంటి ప్రసిద్ధ దేవాలయాలు అవకాశవాదుల చేతుల్లో చిక్కి హిందూ మతం కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు పక్కదారి పడుతోంది. మొత్తం భారతదేశంలోని హిందూమతాన్ని కాపాడాల్సిన అవకాశం ఉన్నా టిటిడి తన పరిధిని తగ్గించుకుని పనిచేస్తోంది.

    ఇక ‘దేవదాయ’ శాఖ దేవాదాయ శాఖగా మారిపోయింది. దేవాలయ భూములు కట్టాకోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటే సీపీఐ నారాయణ ఆ భూముల్లో ఎర్ర జెండాలు పాతుతామంటాడు. వక్స్, చర్చ్ భూముల్లో ఎర్ర జెండా ఎగరేస్తాం అనే దమ్ము కమ్యూనిస్టులకు లేదు. ఇక ఇలాంటి స్వతంత్ర మఠాల్లో ఇదీ దుస్థితి. ఇక హిందూమతానికి దిక్కెవరు ? కంచి స్వామినే ఊచలు లెక్కించేటట్లు చేసిన ఘనులున్న ఈ దేశం బలహీనత ఇది. ఆధ్యాత్మికత రాజకీయంగా మారుతున్న వేళ బ్రహ్మంగారి మఠం వివాదాల్లో చిక్కుకోవడం ఇంకో ఘోరం. ఒలింపిక్స్లో గెలిచిన గజ ఈతగాడు పెరట్లోని గుంతలో పడి చచ్చినట్లు, దీపం కింద చీకటి లాగా ప్రస్తుత మఠం వివాదం ఓ తంతులా నడుస్తోంది. భారతీయ బ్రహ్మజ్ఞాని, సమతా స్థాపకుడు విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వివాదం త్వరగా పరిష్కారం కావాలని ఆశిద్దాం..

    (ఇటీవల బ్రహ్మం గారి మఠం వివాదం చూసి.. స్పందించిన.. ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి భాస్కర యోగి)

    Trending Stories

    Related Stories