More

  ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేత – ఎన్నో అనుమానాలు..!
  – డా. పి. భాస్కరయోగి

  తెలంగాణ ప్రభుత్వం తన ‘సేఫ్టీ వాల్వ్’‌ను తానే ధ్వంసం చేసుకుంటోందా? 2014లో కె.చంద్రశేఖర రావు గద్దెనెక్కిన తర్వాత కమ్యూనిస్టులను దూరం పెట్టారు. మావోయిస్టు సానుభూతిపరులలో కొందరికి పదవులు ఎర వేసి నిలువరించగా, మరికొందరి పట్ల ఉద్దేశపూర్వక విస్మరణతో చాణక్య నీతిని ప్రదర్శించారు. కేసీఆర్‌ ‌తీరు వాళ్లకు ‘ఆత్మహత్య’ సదృశంగా మారిందన్నది నిజం. అటువంటి కేసీఆర్‌ ‌ప్రభుత్వం నాలుగు వారాల క్రితం ఉన్నట్టుండి జీవో 122 ద్వారా ‘ప్రజా సంఘాలపై నిషేధం’ ఎత్తివేసినట్లు ప్రకటించడం ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తోంది.

  మార్చి 30, 2021 నాడు జీవో 73 ద్వారా ‘తెలంగాణ ప్రజా భద్రతాచట్టం 1992’ ఆధారంగా తెలంగాణలోని 16 ప్రజా సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయంటూ విప్లవ రచయితల సంఘం (విరసం), తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (‌టీపీఎఫ్‌), ‌తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్‌), ‌తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమొక్రటిక్‌ ‌స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌ (‌డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్‌), ఆదివాసీ స్టూడెంట్‌ ‌యూనియన్‌ (ఏఎస్‌యూ), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సీఆర్‌పీఏ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్‌ఎస్‌), ‌తుడుం దెబ్బ, ప్రజా కళా మండలి (పీకేఎమ్‌), ‌తెలంగాణ డెమొక్రటిక్‌ ‌ఫ్రంట్‌ (‌టీడీఎఫ్‌), ‌ఫోరం అగెనెస్ట్ ‌హిందూ ఫాసిజం అఫెన్సెస్‌ (ఎఫ్‌ఎ ‌హెచ్‌ఎఫ్‌ఓ), ‌పౌరహక్కుల సంఘం (పీఎల్‌ఎస్‌), అమరుల బంధుమిత్రుల సంఘం (ఏబీఎంఎస్‌), ‌చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) అనే 16 ప్రజా సంఘాలపై నాడు నిషేధం విధించిన ప్రభుత్వం ఆశ్చర్యకరంగా జూన్‌ 23‌న జారీ చేసిన జీవో ఆధారంగా ఆ సంఘాలపై నిషేధం ఎత్తేసినట్లు ప్రకటించింది.

  ఉన్నట్టుండి నిషేధం ఎత్తివేయడానికి వెనుక కారణం ఏమిటి? అనే కోణంలో ఆలోచిస్తే అనేక విభ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 31 మార్చి 2021న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అనేకచోట్ల మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో ఎన్‌ఐఏ ‌నిర్వహించిన సోదాలలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పత్రికల ద్వారా వెల్లడయ్యింది. ఈ దాడుల నేపథ్యం అంతా 2018లో ‘భీమా- కొరేగావ్‌’ ‌కేసులో ‘ఉపా’ చట్టం క్రింద అరెస్టయిన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు, అంతకుముందే అరెస్టయిన అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌సాయిబాబాలు తెలుగు ప్రాంతాలకు చెందినవారు కావడం వల్ల హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో జరిగాయి. అందువల్ల ఆ తేదీకి ఒకరోజు ముందు ఈ సంఘాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం ఏప్రిల్‌ 23 ‌వరకూ ప్రభుత్వం వెల్లడించలేదు. 2005లో కూడా ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం విప్లవ రచయితల సంఘాన్ని నిషేధించి నప్పుడు ‘ముగ్గురు న్యాయమూర్తుల సలహా మండలి’ నిషేధం చెల్లదని చెప్పినందుకు నిషేధం ఎత్తేశారు.

   నిషేధాన్ని ప్రశ్నిస్తూ సంస్థల సానుభూతిపరులు పత్రికల్లో వ్యాసాలు; కేసీఆర్‌, ‌సీఎస్‌లకు లేఖలు రాశారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణను కలసి వినతిపత్రం కూడా ఇచ్చారు. ‘అమరుల బంధుమిత్రుల సంఘం’ పేరుతో హైకోర్టులో పిటిషన్‌ ‌వేశారు. మొత్తానికి ప్రభుత్వం నిషేధం ఎత్తేసింది. వెనువెంటనే గద్దర్‌పై ఉన్న కేసులను ఎత్తివేస్తున్నట్లు మాద్యమాలకు లీకైంది. ఇంతవరకూ బాగానే ఉంది. దీని వెనువెంట జరిగిన పరిణామాలు, ఇంకొన్ని కొత్త విషయాలు ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాయి. ‘పాలనా వ్యవస్థ’ను బోనులో నిలబెట్టే పనికి సుప్రీంకోర్టు ఇంకో అడుగు ముందుకేసిందని విశ్లేషకులంటున్నారు.

  రాజ్యాంగంలోని దేశద్రోహ నేరానికి సంబం ధించిన 124-ఎ సెక్షన్‌ను ప్రశ్నిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్‌ ‌వలసవాద ప్రభుత్వం ప్రయోగించిన చట్టం అనీ, ‘చెట్టును కోసేందుకు రంపమిస్తే అడవిని నరికేసినట్లుంది’ అనీ అన్నట్టు పత్రికలలో వచ్చింది. ఈ దేశద్రోహ చట్టాన్ని రాజ్యాంగపరంగా ప్రశ్నిస్తూ మాజీ సైనికాధికారి ‘ఎస్‌జి ఒంబట్కెరె’ వేసిన వ్యాజ్యంపై అటార్నీ జనరల్‌ ‌కె.కె.వేణుగోపాల్‌ను ప్రశ్నిస్తూ విచారణకు అంగీక రించింది. అంటే త్వరలో ఈ చట్టాన్ని రద్దు చేయించి, ‘భీమా-కొరేగావ్‌ అల్లర్ల’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విడిపించే ప్రయత్నం మొదలైందా? అని వివిధ వర్గాల్లో అనుమానం మొదలైంది.

  అసలు మన రాజ్యాంగం సగభాగం బ్రిటిషు ఇండియా 1935లో చేసిన చట్టం నుండే గదా వచ్చింది! ఇప్పుడు కొత్తగా ఈ చట్టంపై చర్చను ఎందుకు కోర్టు లేవనెత్తింది? అయితే భీమా-కొరేగావ్‌ అల్లర్ల నేపథ్యంలో అరెస్టు అయి ఇటీవల మరణించిన 84 ఏళ్ల స్టాన్‌స్వామి మరణాన్ని ‘ప్రభుత్వ హత్య’ అంటూ పలువురు అర్బన్‌ ‌నక్సల్స్ ‌వ్యాసాలు రాస్తే, ఆ చట్టాన్ని సృష్టించిన కాంగ్రెస్‌ ‌పార్టీని నడిపే రాహుల్‌ ‌గాంధీ ‘దయ, మానవత్వం’ అంటూ ‘ట్వీట్‌’ ‌చేశాడు. మరి యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కదా అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌సాయిబాబాను అరెస్టు చేసింది! ఆ విషయం రాహుల్‌ ‌మరిచిపోయాడా!

  అయితే ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేత, రాజద్రోహం చట్టాలను కొట్టేసే యత్నం దేశద్రోహులకు ‘స్వేచ్ఛావిహారం’ కల్పించే దిశగా పయనిస్తోందనే ఆందోళన కలిగిస్తోంది. తాజా వ్యాఖ్యలతో మోదీ ప్రభుత్వాన్ని ‘నియంత రాజ్యం’గా చూపించే పరిణామం ఏమైనా జరుగుతోందా!

  జనవరి1, 1818లో జరిగిన ‘భీమా-కొరేగావ్‌’ ‌యుద్ధంలో మహర్లు పీష్వాలను ఓడించారు. దీన్నిబట్టి 200 ఏళ్ల క్రితమే దళిత వర్గాలు ఎంత యోధులో చెప్పాల్సింది పోయి కొన్ని మేధోవర్గాలు దళితుల పేరుతో ‘లాల్‌నీల్‌’ ‌వాదం, ‘జై భీమ్‌-‌జై మీమ్‌’ ‌వాదం ముందుకు తెచ్చాయి. మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్‌జీఓలపై నిషేధాలు, ఖర్చు-జమా లెక్కలు అడగటం వంటివి నచ్చనివారు ప్రధానిపై అకారణంగా ద్వేషం పెంచుకున్నారన్నది నిజం. భీమా-కొరేగావ్‌ ‌సభ దరిమిలా జరిగిన అల్లర్ల తరువాత జరిగిన దర్యాప్తులో దొరికిన లేఖల్లో మోదీ పేరు పేర్కొనకున్నా ‘రాజీవ్‌ ‌తరహా ఘటన’ అని పేర్కొనడం, కామ్రేడ్‌ ‌ప్రకాశ్‌ను ఉద్దేశిస్తూ ‘ఆర్‌’ అనే వ్యక్తి రాసిన లేఖలో ఇంకెన్నో విషయాలను గమనించారు. ‘మోదీ శకానికి ముగింపు పలికేందుకు కామ్రేడ్‌ ‌కిషన్‌, ‌మరికొందరు సీనియర్లు గట్టి చర్యలు ప్రతిపాదించారు. ‘రాజీవ్‌ ‌తరహా ఘటన జరపడం గురించి ఆలోచిస్తున్నాం, ఎం-4 తుపాకీ, 4 లక్షల తూటాల కొనుగోలుకు 8 కోట్లు అవసరం. మోదీ నేతృత్వంలోని హిందూ ఫాసిస్టు పాలన దేశీయ ఆదివాసీల జీవితాలను కబళిస్తోంది.

  బిహార్‌, ‌పశ్చిమ బెంగాల్‌లో ఓటమి పాలైనప్పటికీ 15కు పైగా రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో మోదీ విజయం సాధించారు’. ఆ లేఖలోని ఇలాంటి అమృత వాక్యాలు పుణే సెషన్స్ ‌కోర్టు ముందుకు వచ్చాయి. సుమారు 10 వేల పేజీల చార్జ్‌షీట్‌ను పరిశోధన విభాగం దాఖలు చేసింది. దాని తర్వాత వాళ్ల తరఫున పనిచేసే మేధావులు వాళ్లకున్న పరపతితో అరెస్టయిన వారికి బెయిల్‌ ఇప్పించేందుకు అన్ని రకాల టూల్స్‌ను వాడారు. ఈ ద్వేషం ఇంతటితో ఆగలేదు. ‘అర్బన్‌ ‌నక్సల్స్’ ‌సృష్టించిన కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ‌ఖలీద్‌, ‌షర్జిల్‌ ఇమాం లాంటి ‘తుక్డే తుక్డే గ్యాంగు’ దేశద్రోహ వ్యాఖ్యలు చేశారు. కోర్టులు ఏళ్ల తరబడి విచారించి ఉరివేసిన నేరగాళ్లకు అనుకూలంగా ఈ గ్యాంగు యూనివర్శిటీల్లో నినాదాలు చేశారు. అఫ్జల్‌ ‌గురు, అజ్మల్‌ ‌కసబ్‌, ‌యాకూబ్‌ ‌మెమన్‌ ‌లాంటి కరడుగట్టిన తీవ్రవాదులను స్తుతిస్తూ కొత్త నినాదాలు సృష్టించారు. దేశాన్ని ముక్కలు చేస్తామంటూ ఈ ‘గ్యాంగు’ యుద్ధ వాతావరణం ఏర్పరచారు. అలాగే ఇటీవల బెంగ ళూరుకు చెందిన 23 సంవత్సరాల ‘దిశా రవి’ సాగు చట్టాలపై అవగాహన అంటూ దేశానికి వ్యతిరేకంగా ‘టూల్‌ ‌కిట్‌’ ‌రూపొందించినట్లుగా పోలీసులు నిర్ధారించి ఫిబ్రవరి 13, 2021న అరెస్టు చేశారు. మరి ఇదంతా ఏమిటి? మోదీని ప్రజలు కోరుకున్న సంగతిని ఇక్కడ అంతా విస్మరించడం బాధాకరం.

  అరెస్టయిన వాళ్లంతా నేరగాళ్లు కాకుంటే కోర్టులు తేల్చవచ్చు. స్వామి అసీమానంద, కల్నల్‌ ‌పురోహిత్‌, ‌సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌లను ఏ కారణం లేకుండా ఇదే ‘రాజద్రోహ చట్టం’ క్రింద అరెస్టు చేసి ఏళ్లతరబడి చార్జ్‌షీట్‌ ‌కూడా దాఖలు చేయకపోవడాన్ని ఈ హక్కుల కార్యకర్తలు ప్రశ్నించారా! ప్రజ్ఞాసింగ్‌ను స్త్రీ అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఇది ‘రాజద్రోహ చట్టం’ అని గుర్తుకు రాలేదా! గౌతం నవలఖా (2004), రోనా విల్సన్‌ (2005), ‌వినాయక్‌ ‌సేన్‌ (2007), ‌జిఎన్‌ ‌సాయి బాబా (2010)లను అరెస్టు చేసింది ఏ ప్రభుత్వం? అప్పుడు కరుణ, దయ, జాలి వీళ్లకు ఎందుకు కలగలేదు? ఇదంతా మోదీని గద్దె దింపే కుట్ర.

  ఇప్పుడు కోర్టులు, న్యాయమూర్తులు అత్యుత్సా హంతో ‘భళా’ అనిపించుకోవాలన్న ఆతురతతో మొత్తం వ్యవస్థకే ముప్పు తెచ్చే విషయాలను కదిపితే మరో ప్రమాదంలో పడతాం. ఒక ఆరోపణలోనో, కేసులోనో తప్పు ఉంటే దాన్ని విచారించి తీర్పు ఇవ్వాలి గానీ అసలు చట్టమే తప్పని చెపితే ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుప్రమాదం. అందుకే ‘వ్యవస్థ వ్యక్తుల కోసం కాదు’ అని గుర్తించాలి. ఎన్‌ఐఎ 10‌వేల పేజీల చార్జ్‌షీట్‌ ‘‌మొత్తం అబద్ధం’ అని కొట్టేస్తే భావి సమాజం ఈ వ్యవస్థలను ఎలా నమ్ముతుంది? న్యాయవ్యవస్థ కూడా ఈ వ్యవస్థలో భాగమే. ఇప్పటికే ప్రజలు వ్యవస్థాగతమైన సంఘటనలను అసహ్యించుకుంటు న్నారు. ఇప్పటివరకు నక్సల్స్ ‌దాడుల్లో మరణించిన పోలీసులకు విలువ లేదా? అంతా మిథ్యేనా అన్న ప్రశ్న ఉదయిస్తే దేశవ్యతిరేక చర్యల అదుపులో రేపు మన బలగాలు ఎలా చిత్తశుద్ధితో పాల్గొనగలుగు తాయని న్యాయమూర్తులు ఆలోచించాలి. మనకు పనికిరాని సుమారు 1200 చట్టాలను ఎన్డీయే ప్రభుత్వమే రద్దు చేసింది. ఈ చట్టం రద్దుతో సార్వభౌమత్వాన్ని ‘సవాల్‌’ ‌చేస్తూ వినపడే ప్రమాద ఘంటికలను ఉన్నత న్యాయస్థానం గుర్తించాలి. దేశం తీవ్రవాద, అరాచక శక్తులకు స్థానం లేకుండా ‘రామరాజ్యం’ లా ఉందని ఉన్నత న్యాయస్థానంలో ఎవరూ చెప్పలేరు. ఇప్పటికే తీవ్రవాదం వల్ల ఇద్దరు ప్రధానులను ఈ దేశం కోల్పోయింది. దేశ ప్రధాని హత్యకు కుట్ర పన్నారని చెబుతున్నా ‘బూజు పట్టిన సెక్షన్‌’ అం‌టూ తోసేస్తే భవిష్యత్తులో జరిగే పరిణామా లకు బాధ్యత ఎవరిది? చట్టంలోని లొసుగులను సరిచేయడానికి, దుర్వినియోగం కాకుండా చూడటానికి సుప్రీంకోర్టుకు పూర్తి అధికారం ఉంది. కానీ, సంస్కర ణలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు సార్వభౌమత్వాన్ని రక్షించేట్లుగానూ ఉండాలి.

  ‘రాజద్రోహ చట్టా’న్ని కొనసాగిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ ‌ప్లేట్‌ ‌ఫిరాయించినట్లే తెరాస ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. ఇందుకు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు మొదలుకావడం ఒక కారణం కావచ్చు. తెలంగాణలో నక్సల్స్ ‌దాడిలో మరణించినవారు ఎక్కువమంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) వారు కావడం వల్ల ఇక్కడ ప్రధాన సిద్ధాంత వైరుధ్యం మావోయిస్టులకు – జాతీయవాద సంస్థల మధ్యే ఉంది. ఇటీవల తెలంగాణ భాజపాలో ఎక్కువమంది ఏబీవీపీ నాయకులు తెరపైకి రావడం, ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావడం వల్ల తెరాస ప్రభుత్వం ఈ ‘అర్బన్‌ ‌నక్సల్స్’ ‌సహాయం కోరుకుంటోందా? అన్న ప్రశ్న భాజపా వర్గాల్లో రావడం సహజమే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య కళారంగాలు, మేధో, మాద్యమ రంగాల్లో మావోయిస్టు, కమ్యూనిస్టు లదే పైచేయిగా ఉండడం వల్ల పరోక్షంగా వారి ‘మేధో మథనం’ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందా? అన్నదీ చరిత్ర తేలుస్తుంది.

  ప్రజాసంఘాలపై నిషేధం, రాజద్రోహం చట్టం మనుగడపై విచారణ అంశాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయి. మోదీపై, జాతీయవాదంపై కక్ష గట్టిన శక్తులు తమ గమ్యాన్ని చేరడంలో విజయం సాధిస్తే భారతీయతకు గొడ్డలిపెట్టే. చట్టాల్లోని లొసుగులు, దయ, కరుణ వంటి మానవీయ విలువలు, సూడో సెక్యులర్‌ ‌స్టంట్స్, ‌మేధోవర్గాల పేరుతో చేసే విన్యాసాలు ‘దేశ సార్వభౌమ’త్వాన్ని ధ్వంసం చేసే ఇనుప కత్తులుగా మారితే అది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం.

  – డా. పి. భాస్కరయోగి,  ప్రాంత సంఘటన కార్యదర్శి, భారతీయ సాహిత్య పరిషత్‌

  Trending Stories

  Related Stories