Bhaskara Vani

తాటకి మళ్ళీ పుట్టింది..!?

పీనుగలు మాట్లాడుతున్న వైనం
ఏనుగులు ఉన్న చూస్తున్న దీనత్వం
నన్ను నన్నుగా ఉండనివ్వలేని జ్ఞానం
తన్నుకు వస్తున్న ఈ అక్షర బాణం..

మా మాంస ఖండాలను మృత్పిండాల్ల
ఎగిరేయడం ఎవరి వద్ద నేర్చుకున్నావమ్మా..!?
ఎంతలా ఎన్నికల్లో గెలిస్తే మాత్రం
మమ్మల్ని గుంతలో పాతి పెట్టమని నీకు ఎవడు చెప్పాడు..?

రాకాసులను సన్నని కుంకుమరేఖల పైకి
ఉసిగొల్పడం నీకే చెల్లింది..
మా ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్లను పంపించడం
బూజురు గడ్డం జోసెఫ్ స్టాలిన్ నేర్పించాడా..
ఒసామా బిన్ లాడెన్ నేర్పించాడా..!?

నాటు బాంబులను వేట కొడవండ్లను
నీ చంకలో పెట్టుకుని ఓటు కోసం వచ్చినప్పుడు
మేం గుర్తించలేకపోయాం తల్లి..!
అవన్నీ..
మా పొట్టను చీల్చి వేస్తుంటే
ఇది” దీదీ గిరి “అని కని పెట్టాం

వేటాడి వేటాడి మమ్మల్ని వెంటాడుతుంటే
కాలకూట విషాన్ని మా కన్నుల్లో చిమ్ముతుంటే
తల్లి చచ్చిన జింక పిల్లల్లా మేము బెదిరిపోతుంటే
మా కనుగుడ్లను కత్తులకు గుచ్చి
కవాతు చేయడం ఏం ప్రజాస్వామ్యం..!?

నీవు ఓడావో గెలిచావో.. కానీ,
నీ మదపుటేనుగులను ఊర కుక్కల్ని చేసి
మా మీదకు వేటకి పంపిస్తావా..!
కళేబరాలను అత్యాచారం చేసే కామాంధులను
కన్నతల్లిలా కాపాడే నీవు
కాళిక వెలసిన నేలను నిస్సిగ్గుగా ఏలుతున్నావా..?

ముతక చీరలో మమత ఉందని భ్రమ పడ్డాం కానీ
కుత్తుకలు కోసే కుట్ర దాగుందని గ్రహించలేకపోయాం..
వేటకొడవళ్లను మింగి పుట్టిన నీవు
తాటకిలా మారిపోయి వికటాట్టహాసం చేస్తున్నావ్

నరహంతక ముఠాలను పాలిస్తూ..
కరకరా మా కుత్తుకలను తెగటార్చుతుంటే
తాటకి మళ్ళీ పుట్టింది అని అనిపించింది

(ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్ లో జరిగిన హింసకు స్పందిస్తూ…. డా భాస్కర యోగి… కవిత)

Related Articles

One Comment

  1. Even tataki also will feel ashamed by seeing didi. Very nice poem where the pain was shown and seen by me.

Leave a Reply

Your email address will not be published.

18 − 12 =

Back to top button