More

  నేడు, రేపు భారత్ బంద్.. పాల్గొనడం లేదని చెప్పిన భారతీయ మజ్దూర్ సంఘ్

  కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు, రేపు రెండు రోజులపాటు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్టు కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ప్రకటించింది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కార్మిక చట్టాల్లో సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉపాధిహామీ నిధుల్లో కోతలకు వ్యతిరేకంగా, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణను డిమాండ్ చేస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నట్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరంలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి.

  సమ్మెకు దిగుతున్నట్టు బొగ్గు, ఉక్కు, చమురు, టెలికం, తపాలా, ఆదాయపన్ను, కాపర్, బ్యాంకులు, బీమా తదితర రంగాల కార్మికులు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్టు పేర్కొంది. వీరితోపాటు రోడ్డు రవాణా, విద్యుత్ రంగ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపింది. రైల్వే, రక్షణ రంగాల్లోని యూనియన్లు కూడా సమ్మెకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. ఈ సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కూడా మద్దతు ఇచ్చింది. బంద్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, వామపక్షాలు నిర్ణయించాయి. రవాణా కార్మికులు, విద్యుత్ కార్మికులు నిరసనలో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఫోరం తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకింగ్, బీమా సేవలకు చెందిన ఉద్యోగులు కూడా బంద్‌లో ఫాల్గొన‌నున్నారు. స‌మ్మె నేఫ‌థ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మార్చి 28, 29 తేదీలలో సేవల‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌నుంద‌ని పేర్కొంది.

  ఇది రాజకీయ ప్రేరేపితమని, ఇందులో పాల్గొనడం లేదని కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ పేర్కొంది. “2022 మార్చి 28, 29 తేదీల్లో కొన్ని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన రెండు రోజుల సమ్మెలో BMS పాల్గొనదు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు, భారతీయ మజ్దూర్ సంఘ్ ఇందులో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది” అని BMS తెలిపింది. ఈ యూనియన్లు అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీల మనుగడ కోసం సమ్మెకు పిలుపునిచ్చాయని.. ఇది రాజకీయంగా ప్రేరేపించబడింది, కార్మికుల ప్రయోజనాలతో ఎటువంటి సంబంధం లేదు. ఈ సమ్మెలలో రైతులు, విద్యార్థి సంఘాలు నిమగ్నమవ్వడం వల్ల ఈ సంఘాలు కార్మికుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ రాజకీయ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కార్మికులను మాత్రమే ఉపయోగించుకుంటాయని స్పష్టం చేసింది. “కొన్ని రాజకీయ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం శ్రామికవర్గాన్ని దోపిడీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము” అని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రకటనలో పేర్కొంది.

  Trending Stories

  Related Stories