Right Angle

నాడు దోవల్ – నేడు జైశంకర్
తాలిబన్ ఉగ్రవాదంపై
భారత్ మల్టీ ట్రాక్ స్ట్రాటజీ..!

అంతిమంగా గగన తలమే ప్రవాస భారతీయులకు ప్రాణభిక్ష పెట్టింది. వర్తమానంలో వినీలాకాశం అంతిమ లక్ష్యానికి ప్రతీక కాదు. అంతమొందించే వ్యూహానికి కేంద్రం. తాలిబన్ సేనల ఆక్రమణ పర్వంలో భయకంపితులైన భారతీయులు ఆపన్నహస్తం కోసం ఆక్రందనలు చేశారు. రాజ్యాంగాన్నీ, రాజకీయాన్నీ, సాయుధ బలగాన్ని మించిన సాహసం చేసేదీ, చేయగలిగేదీ…దౌత్యం మాత్రమే అని తాజా స్థితి మరోసారి నిరూపించింది.

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆగస్ట్ 17ఉదయం బయలుదేరిన C-17 యుద్ధ విమానం గుజరాత్‌లోని… జామ్‌నగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో 120 మంది భారతీయ అధికారులు ఉన్నారు. వీరంతా ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో పనిచేసేవారే! నైతికతకూ దౌత్యానికీ ఘర్షణా, వైరుధ్యం ఉండటం సహజం. ఎవరితో రాయబారం నడపాలన్నది మనం ఉన్న ‘స్థితి’ మాత్రమే నిర్ణయిస్తుంది.

ఇప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి కానీ, సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం పరిస్థితి భిన్నంగా ఉండేది. తాలిబన్ల డిమాండ్ లకు తలొగ్గి నరహంతకులను విడుదల చేయాల్సిన స్థితి దాపురించిన రోజులవి. అది ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం. కొందరు మిలిటెంట్లు దాన్ని హైజాక్ చేశారు.

శ్రీనగర్ జైల్లో ఉన్న మసూద్ అజార్, ముస్తాక్ ఆహ్మాద్ జర్గర్ లాంటి నరహంతకులను విడిపించుకున్నారు. కాందహార్ హైజాక్ ఘటన జరిగిన 1999లోనూ, 2021 తాలిబన్ వెల్లువలోనూ యాధృచ్చికంగా భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది. ఈ రెండు సందర్భాల్లోనూ నాటి మన ప్రభుత్వం తాలిబన్లతో సంప్రదింపులే జరిపింది. కఠినంగా వ్యవహరించలేదు.

విమానాన్ని హైజాక్ చేసిన  ఉగ్రవాదుల విషయంలో కఠినంగా ఎందుకు వ్యవహరించలేదు? 120 మంది భారతీయుల ప్రాణాల విషయంలో నాటి ప్రభుత్వం ఎలా వ్యవహరించింది? భారత పౌరుల ప్రాణాలు ప్రమాదకర ఉగ్రవాదుల ప్రాణాల కన్నా ముఖ్యమైనవని నాటి ప్రభుత్వం భావించిందా?  

ఆఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్ అవలంబిస్తున్న ‘‘Multi-track strategy’’లో ఏముంది? స్టెఫెన్ ట్యానర్ రాసిన ‘‘AFGHANISTAN: A MILITARY HISTORY FROM ALEXANDER THE GREAT TO THE FALL OF THE TALIBAN’’ పుస్తకంలో ఏముంది? ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను, దౌత్యకార్యాలయ సిబ్బందిని మన రహస్య బృందం ఉలా రక్షించింది? ‘‘ IAF’s C-17 mission to evacuate embassy staff’’ కథనం వెనుక మతలబు ఏంటి?

ఇలాంటి భయోద్నిగ్న వర్తమాన చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

మసూద్ అజర్ 1994 జనవరి 29న బంగ్లాదేశ్ విమానంలో ఢాకా నుంచి ఢిల్లీ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారి అనుమానించడంతో అడ్డంగా దొరికిపోయి భారత జైల్లో బందీ చేయబడ్డాడు. 1999లో జమ్మూ కోట్ భలావల్ జైలు నుంచి ఆయన్ను తప్పించడానికి ఒక సొంరంగం కూడా తవ్వారు. కానీ లావుగా ఉండడంతో మసూద్ అజర్ దాన్లో ఇరుక్కుపోయారు. మళ్లీ దొరికిపోయాడు.

కొన్ని నెలల తర్వాత 1999 డిసెంబర్‌లో మిలిటెంట్లు ఒక భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లారు. విమానంలో ఉన్న వారిని విడిపించడానికి ముగ్గురు మిలిటెంట్లను వదిలేందుకు అంగీకరించింది. వీరిలో మసూద్ అజర్ కూడా ఒకరు. కాందహార్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ కట్జూ, నాడు ఐబీ చీఫ్ గా పనిచేసిన అజిత్ దోవల్, రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్ అధికారి  సీడీ సహాయ్ లు మసూద్ అజార్, ముస్తాక్ ఆహ్మద్ లను తాలిబన్లకు అప్పగించారు.

అజిత్ దోవల్ హైజాక్ అయిన విమానంలోని ప్రయాణికులను కలిసి బాగోగులు తెలుసుకున్నారు. దోవల్ విమానం దిగగానే కిడ్నాపర్లు బర్గర్, శాండీలతో పాటు ఒక చిన్నపాటి  ‘బైనాకులర్’ ను బహుమతిగా ఇచ్చారు. విమానం బయట ఏమేం జరుగుతోందో తెలుసుకునేందుకు ఈ బైనాక్యూలర్ ఎంతో ఉపయోగపడిందని తర్వాత సందర్భాల్లో దోవల్ వెల్లడించారు. ఫ్లైట్ ఇంజనీర్ అనిల్.కే.జగ్గియా, ఇన్వెస్టిగేటిల్ రిపోర్టింగ్ చేసిన సౌరవ్ శుక్లా ఉమ్మడిగా రాసిన  ‘‘ IC814 HIJACKED’’ పుస్తకంలో ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలను మనం చదవవచ్చు.

ఈ రెండు సందర్భాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం తాలిబన్లతో రాజీ ధోరణితో వ్యవహరించడానికి కారణమేంటి అనే సందేహం రావచ్చు. రాజీధోరణి ప్రదర్శించాలా, దాడి ఎత్తుగడ రచించాలా అనేది సమయం, సందర్భం, స్థితి, కాలం లాంటి అంశాలు మాత్రమే నిర్ణయిస్తాయి. 1999 కాందహార్ లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయ్యేనాటికి తాలిబన్ పాలన ఉచ్ఛదశలో ఉంది. 173 గంటల పాటు విమానంలో ప్రయాణికులు తీవ్రభయాందోళనలో గడుపుతున్నారు. రూపన్ కతియాల్ ను అప్పటికే ఉగ్రవాదులు హతమార్చారు. నీలేష్ మిశ్రా రాసిన ‘‘173 Hours in Captivity: The Hijacking of IC814’’ పుస్తకంలో విమానంలో ఉన్న భయంగొలిపే వాతావరణాన్ని చదవవచ్చు.

హైజాక్ అయిన విమానంలోని ప్రయాణికులతో విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్, భారత అధికారుల బృందం అదే రోజు తిరిగి భారత్ వచ్చేసింది. కానీ, ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌లో పనిచేసే ఏఆర్ ఘనశ్యామ్‌ను భారత విమానంలో ఇంధనం నింపి, దానిని తిరిగి దిల్లీ తీసుకువచ్చే ఏర్పాట్ల కోసం కాందహార్‌లోనే ఉంచేశారు.

ఎయిర్ ఇండియా కు చెందిన 14 మంది సిబ్బంది కూడా అక్కడే ఉండిపోయారు. తర్వాత ఎఆర్ ఘనశ్యామ్ తన రిపోర్టులో “అందరూ వెళ్లిపోయిన తర్వాత నేను ఆ విమానంలోకి వెళితే పరిస్థితి భయంకరంగా ఉందనీ, ముక్కులు పగిలిపోయేలా దుర్గంధం వ్యాపించి ఉందనీ,  కాక్‌పిట్ ప్యానల్ వరకూ చికెన్ ఎముకలు, ఆరెంజ్ తొక్కలు పడి ఉన్నాయని పేర్కొన్నారు. టాయిలెట్ చాలా ఘోరంగా ఉంది. అది అసలు ఉపయోగించేలా లేదని వెల్లడించారు.

తాలిబన్లు కేవలం మసూద్ అజార్ విడుదల కోసం మాత్రమే ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయలేదు. దృష్టి మరల్చే వ్యూహం కూడా ఇందులో ఇమిడి ఉందని నిపుణులు తేల్చారు. విమానాన్ని పేల్చి 170 మంది భారతీయుల ప్రాణాలను హరిస్తే…భారత్ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతోనే  రాజీమార్గాన్ని ఎంచుకుందని అజిత్ దోవల్ తర్వాత కాలంలో ఎంచుకున్నారు.

ఇదంతా నాటి స్థితి…తాజాగా తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను తిరిగి ఆక్రమించుకున్న తర్వాత ప్రభుత్వం భారతీయులను ఎలా కాపాడింది అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం.

150 మంది దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బందిని భారత్ కు క్షేమంగా రప్పించడంలో అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్‌ కీలక పాత్ర పోషించారు. భారతీయ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్నాళ్లూ రక్షణ కల్పించిన ఇండో–టిబెట్‌ సరిహద్దు భద్రతా సిబ్బంది-ఐటీబీపీ భద్రత మధ్య వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు.

భారత్‌కు రావాలనుకునే ప్రయాణికులకు వీసాలు ఇచ్చే కార్యాలయం షహీర్‌ వీసా ఏజెన్సీపై తాలిబన్లు దాడికి దిగడంతో రెండు విమానాల్లో సిబ్బందిని తీసుకువచ్చారు. తొలివిడతలో ప్రయాణించాల్సిన భారతీయులు కాబూల్‌ విమానాశ్రయానికి వస్తుండగా తాలిబన్లు అడ్డగించారు. వారి దగ్గరున్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఇక రెండో విడత వచ్చిన విమానంలో రాయబారి టాండన్‌ సహా 30 మంది దౌత్య సిబ్బంది, 99 ఐటీబీపీ కమాండోలు, నలుగురు జర్నలిస్టులతో సహా మొత్తం 21 మంది సాధారణ పౌరులు ఉన్నారు.  మరికొంతమంది భారత పౌరులను రక్షించే పరిస్థితి లేకపోవడంతో  ఆఫ్ఘన్ దౌత్యశాఖ శరవేగంగా కొత్త ఆలోచన చేసింది. ఫ్రాన్స్ సహకారంతో 21 మంది భారత పౌరులను కాబూల్‌ నుంచి పారిస్‌కు తరలించింది.

భారత్‌కు రావాలని కోరుకుంటున్న అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కులకు మన దేశంలో ఆశ్రయం కల్పించాలని కేంద్రం నిర్ణయించడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసింది ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న ఇండియన్ టీమ్. ఈ తరలింపు జరుగుతున్నన్ని రోజులూ…దౌత్యకార్యాలయం కాకుండా మరో గుర్తు తెలియని ప్రదేశం నుంచి తన కార్యకలాపాలు చేశారు భారత దౌత్య అధికారులు.

దౌత్య సిబ్బంది కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత బయట పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. ఎయిర్ పోర్ట్ క్రిక్కిరిసిపోయింది. భారత దౌత్యసిబ్బందిని తరలించేందుకు రావాల్సిన విమానం వేళకు రాలేకపోయింది. మధ్నాహ్నం రావాల్సిన విమానం సాయంత్రానికి రాలేదు. ప్రత్యేక భద్రతల నడుమ సోమవారం రాత్రి విమానాశ్రయంలోనే గడిపారు.

దౌత్య సిబ్బందితో సి-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో భారత్‌కు బయలుదేరింది. రాయబార కార్యాలయం నుండి సొంత ప్రాంతాలకు తరలించే ఉద్దేశంతో భారత వైమానిక దళం నడుపుతున్న రెండు సైనిక విమానాల్లో సి-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానం ఒకటి. ఆగస్ట్ 15 తేదీ రాత్రి మరో సి-17 విమానం 40 మంది దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందిని భారత్‌కు తీసుకువచ్చింది.

రెండు విమానాలు పాక్‌ గగనతలంపై నుండి కాకుండా ఇరాన్‌ మీదుగా ప్రయాణించి అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు చేరుకున్నాయి. గత ఏడాది భారత్ జలాలాబాద్‌, హెరాత్‌ కార్యాలయాలను మూసివేసింది. గత నెలలో కాందహార్‌, మజార్‌ ఏ షరీఫ్‌ల్లోని కార్యాలయాలను మూసివేసింది.

ఈ తరలింపు అంత సులభంగా సాధ్యం కాలేదు. దీని వెనుక భారత ప్రభుత్వం అనుసరించిన Multi-track strategy ఉంది. భారత్ అధికారికంగా తాలిబాన్లను ఎన్నడూ గుర్తించలేదు. కానీ ఈ ఏడాది జూన్‌లో రెండు వర్గాల మధ్య “బ్యాక్‌ చానెల్ చర్చలు” జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.

“వివిధ స్టేక్‌హోల్డర్ల”తో చర్చిస్తున్నాం అంటూ అప్పట్లో కేంద్రం ఒక సంజాయిషీ ఇచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ శాఖా మంత్రి ఎస్.జయశంకర్ ఆఫ్ఘనిస్థాన్ విధానంపై వివరణ ఇచ్చారు. మల్టీ ట్రాక్ స్ట్రాటజీ అవలంబిస్తున్నట్టూ ప్రకటించారు. దోహాలో ఆఫ్ఘన్ ప్రభుత్వంతో పాటు మరో సందర్భంలో తాలిబన్లతో చర్చలు జరిపినట్టూ స్పష్టం చేశారు.

ఇప్పుడు భారత్‌కు రెండే మార్గాలు ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించడం లేదా అన్ని సంబంధాలు తెంచేసుకుని 90లలో మాదిరి విధానాన్ని కొనసాగించడం. రెండో మార్గాన్ని అవలంబిస్తే, గత 20ఏళ్లలో అక్కడ చేపట్టిన కార్యక్రమాలన్నిటికీ స్వస్తి పలికినట్టే.

భారత్ మధ్యేమార్గంగా తాలిబాన్లతో చర్చలు ప్రారంభించింది. దీంతో అఫ్గానిస్తాన్‌ అభివృద్ధి కార్యక్రమాల్లో తన పాత్రను కొనసాగించే వీలు ఉంటుంది. అక్కడి నుంచి భారతీయులందరినీ తరలించడం వల్ల దీర్ఘకాలంలో పెద్ద ప్రయోజనం ఉండదు. ఆదరాబాదరాగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అందుకే భారతీయుల భద్రత విషయంలో వీలైనంత వరకూ తాలిబన్లతో సఖ్యతగానే మెలగాలని నిర్ణయించింది. 1990లలో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తరువాత, భారతదేశం తమ రాయబార కార్యాలయాలను మూసివేసినప్పుడు, కాందహార్ విమానం హైజాక్ అయినప్పుడు, భారత వ్యతిరేక ముఠాలు విస్తరించాయి. 2011లో భారత్, అఫ్గానిస్తాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం అన్ని విధాలా అఫ్గానిస్తాన్‌కు మద్దతు ఇస్తామని భారత్ హామీ ఇచ్చింది. అందుకే తాజా పరిణామాలపై భారత్ ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

one × four =

Back to top button