పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డా.గుర్‌ప్రీత్ కౌర్‌తో భగవంత్ మాన్ వివాహం గురువారం చండీగఢ్‌లో జరగనుంది. ఈ పెళ్లికి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పంజాబ్ మంత్రులు, సన్నిహితులు హాజరుకానున్నారు. 48 ఏళ్ల భగవంత్ మాన్ తన మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్‌కు 2015లో విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పేరు దిల్షాన్ మాన్, కూతురు పేరు సీరత్ కౌర్ మాన్. విడాకుల తర్వాత ఇంద్రప్రీత్ కౌర్ పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 16న భగవంత్ మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పిల్లలు ఇద్దరు పాల్గొన్నారు.
ఇంద్రప్రీత్ కౌర్‌తో భగవంత్ మాన్ విడాకులకు కారణమేంటనేది ఇప్పటివరకూ వెల్లడికాలేదు. బహుశా పాలిటిక్స్‌లో బిజీగా మారి కుటుంబానికి తగిన సమయం కేటాయించకపోవడం వల్లే భార్యతో విడాకులు తీసుకున్నారనే ప్రచారం ఉంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని తల్లి, చెల్లెలు కోరడం వల్లే భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తల్లి, చెల్లెలే ఈ సంబంధం తీసుకొచ్చినట్లు సమాచారం.
భగవంత్ మాన్ కమెడియన్ నుంచి రాజకీయ నేతగా మారారు. కమెడియన్‌గా ఆయన పదుల సంఖ్యలో చిత్రాల్లో నటించారు. 2014లో తొలిసారి సంగ్రూర్ లోక్‌సభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా ఎన్నియ్యారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధూరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 117 స్థానాలకు గాను ఏకంగా 92 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ గెలుపుతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా తనదైన మార్క్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు.