More

  ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బ్యాటరీలను కొట్టేస్తూ ఉన్న జంట.. ఎట్టకేలకు

  బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ బ్యాటరీలను కొట్టేస్తున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలి నెలల్లో 68 ట్రాఫిక్ కూడళ్ల నుంచి దొంగిలించిన 230 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. కరెంట్ పోయిన సమయంలో ఈ బ్యాటరీల సహాయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేస్తాయి. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ లైట్ల నుండి బ్యాటరీ దొంగతనాలు జరుగుతున్న సంఖ్య ఇటీవలి కాలంలో పెరగడంతో పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. నిందితులను గుర్తించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి కేసును చేధించగా నిందితుల గురించి తెలుసుకుని వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దొంగతనాలకు పాల్పడింది ఓ జంట.

  బెంగళూరులోని చిక్కబాణవరానికి చెందిన ఎస్ సికందర్ (30), అతని భార్య నజ్మా సికందర్ (29) నిందితులుగా నిర్ధారించారు. ఇటీవల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దంపతులు స్కూటర్‌పై తిరుగుతున్నట్లు గుర్తించారు. వాహనం రిజిస్ట్రేషన్ సమాచారాన్ని కెమెరాలు గుర్తించకుండా నిరోధించడానికి వారు తమ స్కూటర్ టెయిల్ లైట్లను ఆఫ్ చేసి, ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలించే వారు. ఈ జంట జూన్ 2021లో ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను దొంగిలించడం మొదలుపెట్టారు. డబ్బు సంపాదించడానికి వారు ఆ బ్యాటరీలను జంక్‌గా విక్రయించేవారు.

  సికందర్‌కు ఒక టీ దుకాణం ఉండేది. అయితే లాక్‌డౌన్ కారణంగా దానిని మూసివేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. తర్వాత స్కూటర్‌పై టీ అమ్మడం మొదలుపెట్టాడు. అతన్ని అనేక సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అతని ఫ్లాస్క్‌ని కూడా ఒకసారి పగలగొట్టారు. దీంతో కోపోద్రిక్తుడైన సికందర్ ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఉన్న బ్యాటరీలను దొంగిలించాలని ప్లాన్ చేశాడు. పోలీసు అధికారి అందించిన సమాచారం ప్రకారం, బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ సిగ్నల్స్ వద్ద 68 చోరీ సంఘటనలు నమోదయ్యాయి. దొంగతనాలకు పాల్పడుతున్న స్కూటర్ నిందితులను పట్టుకోవడం కోసం అచ్చం అలాంటి స్కూటర్ కు సంబంధించి ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) నుండి డేటాను తీసుకున్నారు. 300 మంది వ్యక్తులను ప్రశ్నించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గొరగుంటెపాళ్యం జంక్షన్‌లో కొద్దిరోజులుగా క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిందితులు దొరకడం.. అది కూడా భార్యాభర్తలే ఈ పని చేయడం కాస్త షాకింగ్ గా అనిపించింది పోలీసులకు కూడానూ..!

  Trending Stories

  Related Stories