పుష్ప స్టైల్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్.. అడ్డంగా దొరికిపోయిన యాసిన్ ఇనయితుల్లా

0
1037

బెంగళూరుకు చెందిన ఓ డ్రైవర్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో లాగా గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేద్దామని అనుకున్నాడు. అయితే పోలీసులు అతడిని ట్రక్కుతో సహా పట్టేశారు. రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం, యాసిన్ ఇనయితుల్లా తన ట్రక్కులో ఎర్రచందనం రవాణా చేస్తూ కర్ణాటక-ఆంధ్రా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు వెళ్తున్నాడు. సరిహద్దు దాటిన తర్వాత సాంగ్లీ జిల్లా మీరజ్ నగర్ గాంధీచౌక్ వద్ద మహారాష్ట్ర పోలీసులు అతడిని అడ్డుకున్నారు. రూ.2.45 కోట్ల విలువైన చందనం, రూ.10 లక్షల విలువైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడం మాట్లాడుతూ, “ఎర్ర చందనం అక్రమ రవాణా గురించి మాకు రహస్య సమాచారం అందింది. అటవీశాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాం. ఈ దాడిలో మేము ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాము ఒక నిందితుడిని అరెస్టు చేసాము. 2.45 కోట్ల విలువైన 1 టన్ను చందనం, వాహనం విలువ రూ. 10 లక్షలు ఉంటుంది. IPC సెక్షన్లు 379, 34 కింద కేసు నమోదు చేసాము. అటవీ చట్టంలోని వివిధ సెక్షన్లు కూడా పెట్టాము” అని అన్నారు.

‘పుష్ప’ సినిమా స్ఫూర్తితో నిందితుడు యాసిన్ ట్రక్కులో ముందుగా ఎర్రచందనం లోడ్ చేసి, ఆపై పండ్లు, కూరగాయల డబ్బాలను ఉంచాడు. వాహనంపై COVID-19 ముఖ్యమైన ఉత్పత్తులు అనే స్టిక్కర్‌ను అతికించాడు. స్మగ్లర్ కర్నాటక సరిహద్దులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లగలిగాడు, కానీ సరిహద్దు దాటాక మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. అతని వెనుక ఉన్న నెట్‌వర్క్ గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో చిల్లకూరు మండలం నెల్లూరు-చెన్నై రహదారిపై బుధానం టోల్‌ప్లాజా వద్ద దాడులు నిర్వహించి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో 55 మంది కూలీలు, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. తమిళనాడులోని పలు స్టాక్ లొకేషన్లలో చైనాకు రవాణా చేసేందుకు ఉంచిన 45 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ఒక వాహనం, 31 సెల్‌ఫోన్లు, 24 గొడ్డళ్లు, ఇతర ఎర్రచందనం చెట్ల నరికివేత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పుష్ప సినిమాపై గరికపాటి విమర్శలు:

ఈ చిత్రంపై ప్రముఖ ప్రవచనకర్త, సహస్రావధాని గరికపాటి నరసింహారావు విమర్శలు చేశారు. తనకు సినిమాల గురించి కూడా తెలుసని చెప్పారు. ‘పుష్ప’ సినిమాలో హీరోను స్మగ్లర్ గా చూపించారని.. చివరి ఐదు నిమిషాల్లో హీరోను మంచిగా చూపిస్తామనో లేదా రెండో పార్టులో మంచిగా చూపిస్తామనో అంటారని, రెండో పార్ట్ వచ్చేలోపు సమాజం చెడిపోదా? అని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ‘తగ్గేదే లే’ అనడం ఏమిటని ప్రశ్నించారు. ఓ కుర్రాడు వేరే వాళ్లను కొట్టి తగ్గేదే లే అంటున్నాడు కదా దీనికి కారణం ఎవరని అడిగారు. ఈ డైలాగ్ తనకు కోపం తెప్పిస్తోందని అన్నారు. ఆ సినిమా హీరోని కానీ, డైరెక్టర్ కానీ తనకు సమాధానం చెప్పాలని అన్నారు. వారిద్దరినీ అక్కడే కడిగిపారేస్తానని చెప్పారు. ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ను శ్రీరాముడు, హరిశ్చంద్రుడు వంటివారు వాడాలని అంతేకానీ, ఒక స్మగ్లర్ ఎలా వాడతాడని ప్రశ్నించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.