ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో లేదో.. ఓట్ల వేట మరింత జోరందుకుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి అప్పుడే వేసవిని తలపిస్తోంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా వుండే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వాతావరణం మరింత వేడి మీదుంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొత్త కొత్త ఎత్తులు, కొత్త కొత్త పద్దతులు తెరమీదికొస్తున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటి కొత్త కొత్త స్లోగన్స్ బయటికొచ్చాయి. ముఖ్యంగా బెంగాల్ లో వినిపిస్తున్న ఓ స్లోగన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే.. ‘ఖేలా హోబ్’.. అసలేంటీ ‘ఖేలా హోబ్’..? ఈ మాటకు అర్థం ఏంటి..?
పశ్చిమ బెంగాల్ లో ఏ మూలకు వెళ్లినా.. ఇప్పుడు ‘ఖేలా హోబ్’ అనే మాట మారుమోగుతోంది. ప్రతి నాయకుడి నోటా ఇదే మాట. బీజేపీ, తృణమూల్ నేతలు ‘ఖేలా హోబ్’ అంటూ ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నారు. పొలిటికల్ ర్యాలీల్లో అయితే ‘ఖేలా హోబ్’ స్లోగన్‌తో డీజే పాటలు హోరెత్తిపోతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం.. ‘ఖేలా హోబ్’ అంటూ దీదీకి సవాలు విసిరారు. ఇంతకీ ఖేలా హోబ్ అనే మాట ఎందుకింత పాపులర్ అయ్యింది..? ఈ మాటకు అర్థం ఏంటి..?
కొద్దిరోజుల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొలిసారి ఈ పద ప్రయోగం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘ఖేలా హోబ్’ అంటూ నినదించారు. క్రితం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో అప్పటినుంచి రాష్ట్రంలోని ఎక్కడ చూసినా ఇదే మాట వినపడుతోంది. టీఎంసీ నేతలతో పాటు విపక్ష బీజేపీ, సీపీఎం నాయకులు సైతం ఇదే నినాదాన్ని ఎత్తుకున్నారు. గల్లీ సభల నుంచి బహిరంగ సభల వరకు.. లీడర్లంతా ‘ఖేలా హోబ్’ అంటూ సవాలు విసిరుతున్నారు.
బెంగాలీలో ‘ఖేలా హోబ్’ అంటే ‘ఆట మొదలైంది’ అని అర్థం. కొన్నేళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన బ్లంగాదేశీ ఆవామీ లీగ్ ఎంపీ షమీమ్ ఒస్మాన్ తొలిసారిగా ఈ ‘ఖేలా హోబ్’ నినాదాన్ని అక్కడ వినిపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బిర్భమ్ జిల్లా అధ్యక్షుడు టీఎంసీ అనుబ్రతా మండల్ బెంగాల్‌లో ఈ నినాదాన్ని వినిపించారు. ‘ఖేలా హోబ్’.. ఇది చాలా ప్రమాదకర ఆట.. అయినా ఆట కొనసాగుతుంది..’ అని అన్నారు. తాజాగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఖేలా హోబ్ అంటూ మమతకు సవాల్ విసిరారు. ‘అవును ఆట మొదలైంది… రాష్ట్రంలో అభివృద్ది, శాంతి కోసం నిజంగానే ఆట మొదలైంది…’ అని కామెంట్ చేశారు. ఇక టీఎంసీ ఇంకాస్త ముందుకెళ్లి.. ‘ఇన్‌సైడర్-ఔట్‌సైడర్’ థీమ్‌తో ‘ఖేలా హోబ్’ స్లోగన్‌ను వాడుకుంటున్నారు. గల్లీ గల్లీలో డీజేలు పెట్టి హోరెత్తిస్తోంది.