More

    ఎన్డీయే కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధనకర్‌

    ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగదీప్‌ ధనకర్‌ను బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం జగదీప్‌ పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో శనివారం ఢిల్లీలో బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ను జె.పి.నడ్డా ప్రకటించారు.

    వృత్తిరీత్యా న్యాయ‌వాది అయిన ధ‌న్‌క‌ర్‌ సుప్రీంకోర్టులో ప‌లు కేసుల‌ను వాదించారు. రాజ‌స్థాన్ బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగానూ ప‌నిచేశారు. 1989లో జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున ఎంపీగా గెలిచిన ధ‌న్‌క‌ర్‌ 1989-91 మ‌ధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. 2003లో ఆయ‌న బీజేపీలో చేరారు. శ‌నివారం బీజేపీ పార్ల‌మెంట‌రీ భేటీకి ముందుకు ప్ర‌ధాని మోదీతో ధ‌న్‌క‌ర్ భేటీ అయ్యారు.

    Related Stories