More

    బెంగాల్ లో మోదీ ప్రచారం.. మతువాల ఓట్లపై కన్ను

    పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. ప్రధాని మోదీ నరేంద్రమోదీ కూడా స్పీడ్ పెంచాడు.బెంగాల్ లోని  పురూలియాలో నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతా బెనర్జీ పై విరుచుకుపడ్డారు. మమతా చేసిన ఖేలా హోబె నినాదానికి పీఎం మోదీ తన స్టయిల్లో వికాస్ హోబె అంటూ బదులిచ్చారు. బెంగాల్ లో ఆట మొదలైందని దీదీ పదే పదే చెబుతున్నారని… , అయితే వారి దృష్టిలో బెంగాల్ ఎన్నికలంటే కేవలం ఒక ఆట అని… అదే బీజేపీ దృష్టిలో అయితే ఆట కాదని… తమకు అభివృద్ధి ముఖ్యమని కౌంటర్ వేశారు. దీంతో సభా ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా కరతలాధనులతో మార్మోగింది.

    అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ ను పొడి అక్షరాల్లో అయితే టీఎంసీగా పిలుస్తారు. అయితే టీఎంసీ పార్టీకి…. పీఎం ఈ సభలో సరికొత్త అర్థం చెప్పారు. టీఎంసీ అంటే ట్రాన్స్ ఫర్ మై కమిషన్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా పేద ప్రజలకు వచ్చే సొమ్ములో కొంతభాగం టీఎంసీ నాయకులు తమ వాటాగా మందే కట్ చేసుకుని మిగిలిన సొమ్మును ఇవ్వడాన్ని వ్యవస్థలో భాగమన్నట్లుగా మార్చేశారని, బెంగాల్ లో అసలు కట్ మనీ లేనిదే ఏ పని జరగదని  ప్రధాని మోదీ  ఆరోపించారు. అదే బీజేపీ మాత్రం..డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానాన్నే విశ్వసిస్తుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ ప్రయోజనాలు ఏ మధ్యవర్తి లేకుండా నేరుగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  

    అంతేకాదు మమతా బెనర్జీ తమపై ఎప్పుడు విసుగును ప్రదర్శిస్తుంటారని, తాము మాత్రం ఆమెను ఎప్పుడు గౌరవిస్తునే ఉంటామని, ఆమెకు గాయమైనప్పుడు కూడా మేం ఆందోళన చెందామని ఆమె కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని తాము ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని మోదీ చెప్పారు.

    తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులు, ఆదివాసులు, ఇతర వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. టీఎంసీ పదేళ్ళ పాలనలో బెంగాల్ ప్రజలను అణగదొక్కారని, ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మమతా బెనర్జీకి ఓటమి తప్పదని మోదీ అన్నారు. అలాగే టీఎంసీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని కూడా మోదీ ఆరోపించారు.

    బెంగాల్లో తొలి దశలో మార్చి 27న 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 1న రెండో దశలో మరో 30 నియోజకవర్గాలకు  పోలింగ్ జరగనుంది. మార్చి 27న జరిగే పోలింగ్ కు ఒక రోజు ముందు పీఎం మోదీ మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే గుడాకాందీని సందర్శిస్తారు. ఇది బంగ్లాదేశ్ లో ఉంది. మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం.! ప్రధానితో పాటు బెంగాల్‌లోని మాతువా వర్గానికి చెందిన బీజేపీ పార్లమెంట్‌ సభ్యుడు శాంతను ఠాకూర్‌ సైతం గుడాకాందీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    ఎస్సీలుగా ఉన్న మతువాలు దశాబ్దాల క్రితమే పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమబెంగాల్‌కు వలస వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం మతువాలు పశ్చిమ బెంగాల్‌లో రెండో అతిపెద్ద షెడ్యూల్డ్‌ కుల జనాభా. మతువాలు ఎక్కువగా ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో నివాసం ఉన్నారు. నాడియా, హౌరా, కూచ్‌ బెహార్, ఉత్తర– దక్షిణ దినజ్‌పూర్, మాల్డా వంటి సరిహద్దు జిల్లాల్లోనూ వీరు విస్తరించి ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో మతువాల జనాభా 17.4 శాతం. బెంగాల్‌లో 1.8 కోట్ల ఎస్సీ జనాభా కారణంగా రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలను షెడ్యూల్డ్‌ కులాల కోసం రిజర్వ్‌ చేశారు. వీటిలో కూచ్‌ బెహార్, జల్పాయిగురి, బిష్ణుపూర్, బొంగావ్‌ లోక్‌సభ స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది.

    Trending Stories

    Related Stories