భారత్ తో టెస్ట్ సిరీస్ కు ముందు.. ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్

0
793

ఇంకొద్ది రోజుల్లో భారత జట్టుతో ఇంగ్లండ్ జట్టు 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో తలపడనుంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ జట్టు ఒక టాప్ క్లాస్ ఆటగాన్ని కోల్పోయింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కొన్నాళ్లు ఆటకు విరామం తీసుకోవాలని భావిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ ఆడకూడదని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది. తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎడమచేతి చూపుడు వేలుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడంపైనా దృష్టి సారించేందుకు ఈ విరామాన్ని ఉపయోగించుకోవాలని స్టోక్స్ భావిస్తున్నాడని ఈసీబీ పేర్కొంది. స్టోక్స్ నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బోర్డు వెల్లడించింది. తన మనోభావాలను నిర్భయంగా వెల్లడించాడని, తాము అతడికి అండగా నిలుస్తామని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తెలిపారు.మానసిక ఆందోళనకు గురవుతున్నానని.. కొంత సాంత్వన పొందేందుకు క్రికెట్‌కు ‘నిరవధిక విరామం’ ఇస్తున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. గత ఏడాది కాలంలో ‘బయో బబుల్‌’ల కారణంగా స్టోక్స్‌ ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉన్నాడు.

ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. సుదీర్ఘమైన ఈ సిరీస్ లో స్టోక్స్ వంటి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ సేవలు కోల్పోవడం ఇంగ్లండ్ జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి. స్టోక్స్ స్థానాన్ని సోమర్సెట్ ఆల్ రౌండర్ క్రెగ్ ఒవర్టన్ తో భర్తీ చేయనున్నారు. స్టోక్స్‌ స్థానంలో క్రెయిగ్‌ ఓవర్టన్‌ను ఇంగ్లండ్‌ జట్టులోకి ఎంపిక చేశారు. ఎప్పటివరకు ఈ విరామం అనేది చెప్పకుండానే క్రికెట్‌ నుంచి కొంతకాలం తప్పుకుంటున్నానంటూ స్టోక్స్ ప్రకటించడంతో ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.

కోవిడ్ సమయాల్లో క్రికెటర్ల మానసిక ఆరోగ్యం హాట్ టాపిక్ గా మారింది. నెలల తరబడి బయో బబుల్స్ లో ఆడాల్సిన ఆటగాళ్లలో మానసిక ఆరోగ్యం నిరంతర చర్చనీయాంశంగా మారింది. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మానసిక ఆరోగ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆట నుండి డిస్‌కనెక్ట్ చేయడానికి విరామాలు అవసరమని.. బయో బబుల్ లో క్రికెట్ ఆడితే మానసిక ఆరోగ్య నిర్వహణ ఒక నియమావళిగా మారుతుందని తెలిపాడు. మానసిక ఆరోగ్యం గురించి తన గళాన్ని వినిపించిన మరొక స్టార్ క్రికెటర్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, అతను 2019 లో ఆట నుండి విశ్రాంతి తీసుకున్న తర్వాత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. బెన్ స్టోక్స్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా పలువురు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆటగాళ్లలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని.. వీలైనన్ని రోజులు బ్రేక్ తీసుకుని తిరిగి ఇంగ్లండ్ జట్టుకు ఆడాలని స్టోక్స్ కు పలువురు సూచిస్తూ ఉన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here