ఇండియా అనే పదం కాకుండా ఇకపై ‘భారత్’ అనే పేరును వాడబోతున్నట్లు చర్చ కొనసాగుతూ ఉంది. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగబోతూ ఉండగా.. జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించారు. ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. దీన్ని కాంగ్రెస్ వర్గాలు తప్పుబడుతూ ఉన్నాయి.
అయితే ఆగస్టులోనే ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రిక్స్ సమావేశ నోటిఫికేషన్‌లో కూడా ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ పేరును వినియోగించారు. ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని మోదీ ప్రస్తావించారు. గ్రీస్ పర్యటనలో కూడా ఇలానే వాడారు. ఆగస్టు 22-25 మధ్యలో ఆ రెండు దేశాల్లో ప్రధాని పర్యటనకు సంబంధించిన నోటిఫికేషన్‌లో భారత్ అనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే తూర్పు ఆసియా సదస్సు, ఇండోనేషియాలో ఏషియన్ ఇండియా సదస్సుల నోటీసుల్లో కూడా ‘ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అనే వినియోగించారు.
ఇక నిపుణులు భారత్ గా మార్చడంపై ఏమి చెబుతున్నారంటే… రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించి, భారత్ అనే పదాన్ని మాత్రమే ఉంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఆర్టికల్ 1కి సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేసేందుకు ఆర్టికల్ 368లో సింపుల్ మెజారిటీ లేదా స్పెషల్ మెజారిటీ అనే రెండు విధానాలను ఉంచారు. రాజ్యసభలో స్టేట్స్, యూటీలకు సీట్ల కేటాయింపు, మార్పుల వంటి వాటికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. హాజరైన మొత్తం సభ్యుల్లో 50% కంటే ఎక్కువ ఓట్లు సవరణకు అనుకూలంగా రావాలి. కానీ ఆర్టికల్ 1లోని దేశం పేరు, ఇతర అంశాలను మార్చాలంటే మాత్రం స్పెషల్ మెజారిటీ తప్పనిసరి. ఇందుకోసం పార్లమెంట్ ఉభయసభలకు ఓటింగ్ జరగాలి. హాజరైన మొత్తం సభ్యుల్లో కనీసం 66% ఓట్లు రావాల్సి ఉంటుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించి కీలక చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.