తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను చేపట్టారు. ఆమె పాదయాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రస్తుతం ఆమె పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే పాదయాత్ర సందర్భంగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. మోట కొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద ఒక చెట్టు కింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా.. తేనెటీగలు దాడి చేశాయి. ఆమె సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను సురక్షితంగా కాపాడారు. పలువులు వైయస్సార్టీపీ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. ఇప్పటివరకు షర్మిల పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూర్ మండలం ఆరెగూడెం, గిరిబోయినగూడెం మీదుగా పాదయాత్ర నిర్వహించారు షర్మిల. మోటకొండూర్ మండల కేంద్రానికి చేరుకుని ఉద్యోగ దీక్ష నిర్వహించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగ సమస్య పెరిగిందని.. ఎంతో మంది నిరుద్యో గులు కేసీఆర్ పేరు రాసి చనిపోయారని కానీ, ముఖ్యమంత్రిలో చలనం రాకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రజాప్రస్థానం పేరుతో కొనసాగుతున్న పాదయాత్ర బుధవారం నాటికి 34వ రోజుకు చేరింది. తెలంగాణ నిరుద్యోగ సమస్యను షర్మిల ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.