కోహ్లి, రవిశాస్త్రిపై బీసీసీఐ ఆగ్రహం..!

అదేంటి భారత జట్టు అద్భుతమైన విజయం సాధిస్తే ఆనందించాల్సింది పోయి.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసిందని అనుకుంటూ ఉన్నారా..? ఈ ఆగ్రహం నిబంధనలను ఉల్లంఘించి ఓ ఈవెంట్ కు హాజరైనందుకు..! ప్రస్తుతం ఇంగ్లండ్ లో భారత జట్టులో కరోనా కలకలం రేగింది. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఆర్టీపీసీఆర్ టెస్టు లోనూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ లకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా, వారిద్దరూ కరోనా పాజిటివ్ గా తేలారు. దాంతో ఈ ముగ్గురు చివరి టెస్టుకు వేదికైన మాంచెస్టర్ కు వెళ్లబోవడంలేదని మేనేజ్ మెంట్ వర్గాలు తెలిపాయి. వారు లండన్ లోనే మరో 10 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ టోర్నమెంట్లకు వెళుతోంది భారత జట్టు. అయితే చిన్న చిన్న తప్పుల వలన ఆటగాళ్లు కరోనా బారిన పడితే సిరీస్ మొత్తం రద్దయ్యే అవకాశాలు లేకపోలేదు.
అందుకే కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లిలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి నుంచి బోర్డు వివరణ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలోనే కోచ్ రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీళ్లంతా లండన్‌లో గత వారం జరిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లి వచ్చిన తర్వాతే కరోనా బారిన పడినట్లు తేలింది. ఈ ముగ్గురూ కొవిడ్ బారిన పడినా కెప్టెన్ కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్‌కు మాత్రం నెగటివ్ వచ్చింది. ఈ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లడానికి టీమ్ సభ్యులు బీసీసీఐ అనుమతి కోరలేదని.. ఈ అంశాన్ని చాలా తీవ్రంగా బోర్డు పరిగణించడమే కాకుండా విచారణ కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్పటికే బీసీసీఐ అధికారులకు చేరాయి. “కోహ్లి, రవిశాస్త్రి వివరణ కూడా కోరింది. ఇది బోర్డుకు తలవంపులు తీసుకొచ్చింది. నాలుగో టెస్ట్ ముగియగానే కోహ్లి, శాస్త్రిలను బోర్డు వివరణ కోరుతుంది. వీళ్లు ఈ ఈవెంట్‌కు వెళ్లడంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీష్ డోంగ్రె పాత్రను కూడా బోర్డు పరిశీలిస్తోంది” అని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు.
టూర్లో చివరి టెస్ట్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10నే ప్రారంభమయ్యేలా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. బుధవారం జరగనున్న టీ20 వరల్డ్‌కప్ టీమ్ ఎంపిక మీటింగ్‌లోనూ ఈ అంశంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.