ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వెల్లడించింది. రెండు నగరాల్లోని (ముంబై, పుణె) నాలుగు మైదానాల్లో మొత్తం మ్యాచులు జరగనున్నాయి. 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచులు నిర్వహించనున్నారు.
టోర్నీ ఆనవాయితీ ప్రకారం గత సీజన్‌లో ఫైనల్‌లో తలపడిన జట్లు ఈ సారి తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ ప్రకారం మార్చి 26న శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్, డిఫెండింగ్ చాంఫియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది.
ఆ తర్వాతి రోజు ఆదివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. DY పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ & రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరో మ్యాచ్ జరగనుంది. మొత్తం 20 మ్యాచ్‌లు వాంఖడేలో జరుగుతాయి. DY పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్, MCA ఇంటర్నేషనల్ స్టేడియం, పూణేలలో 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ సీజన్ లో మొత్తం 12 డబుల్ హెడర్‌లు ఉంటాయి. సాయంత్రం 7:30PM ISTకి అన్ని సాయంత్రం మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. లీగ్ దశలోని చివరి గేమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మే 22న వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ సారి టోర్నిలో మరో రెండు కొత్త జట్లు రావడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. దీంతో పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్ ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉండగా.. గ్రూప్ బీలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లను ఆడనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది. మే 29న ఫైనల్ నిర్వహించనున్నారు.