More

    ఇక మహిళ క్రికెట్ జట్టుకు మంచిరోజులు.. భారీగా జీతాలు పెంచిన BCCI

    ఇటీవలి కాలంలో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా సిరీస్ లను కైవసం చేసుకుంటోంది. ఐసీసీ టోర్నమెంట్ లలో తిరుగులేని జట్టుగా మంచి మంచి విజయాలను నమోదు చేస్తోంది. ఇటీవలే ఆసియా కప్ ను కూడా సొంతం చేసుకుంది. అలాంటి భారత మహిళల జట్టుకు బీసీసీఐ తీపి కబురు అందించింది. మెన్స్ టీమ్ తో సమానంగా మహిళల జట్టుకు కూడా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది. ఆట ఒకటే అయినప్పుడు.. పురుషులకు, మహిళలకు మ్యాచ్ ఫీజులో తేడా ఎందుకనే చర్చ.. కొన్నేళ్లుగా జోరుగా నడుస్తోంది. ఒక్క క్రికెట్ విషయంలోనే కాదు, చాలా క్రీడాంశాల్లో మహిళలపై ఈ వివక్ష ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ వివక్షను రూపుమాపేందుకు బీసీసీఐ తొలి అడుగు వేసేంది. మహిళా క్రికెటర్ల విషయంలో ఇలాంటి వివక్ష కూడదని భావించి.. భారత మెన్స్ టీమ్ త సమానంగా మ్యాచ్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించింది.

    మహిళా క్రికెట్ జట్టు మ్యాచ్ ఫీజుకు సంబంధించి.. బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా కీలక వివరాలు వెల్లడించారు. బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న భారత మహిళా క్రికెటర్లకు పే ఈక్విటీ పాలసీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఒకే విధంగా ఉండనుంది. పే ఈక్విటీ విధానాన్ని అమలు చేయడం ద్వారా BCCI ఓ అడుగు ముందుకు వేసిందని.. భారత క్రికెట్ లో లింగ సమానత్వంలో కొత్త శకం వైపు పయనించబోతున్నామని జై షా ట్విట్టర్ ద్వారా తెలిపారు.‘బీసీసీఐ వివక్షను రూపుమాపడంలో మొదటి అడుగు అని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. మా కాంట్రాక్ట్ BCCI మహిళా క్రికెటర్లకు మేము పే ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నాము. పురుషులు, మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు ఉంటుంది’ అని జై షా ట్వీట్ చేశారు. భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ నిర్ణయాన్ని ప్రశంసించింది. భారతదేశంలో మహిళల క్రికెట్‌కు నిజంగా ఓ గొప్ప రోజని.. మహిళలు, పురుషులకు సమానమైన వేతనం ప్రకటించడం ఒక చారిత్రాత్మకమైన ఘటన అని కౌర్ చెప్పుకొచ్చింది.

    మహిళా క్రికెటర్లకు మెన్స్ క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని బీసీసీఐ తెలిపింది. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఆటగాళ్లకు రూ.15 లక్షలు, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కి రూ.6 లక్షలు, T20 మ్యాచ్‌కి రూ.3 లక్షలు చెల్లిస్తూ వస్తోంది బీసీసీఐ. ఇప్పుడు ఇదే తరహా పే స్కేల్ మహిళా క్రికెటర్లకు కూడా దక్కనుంది. పే ఈక్విటీ పాలసీకి సంబంధించి బీసీసీఐ నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు, సెలెబ్రిటీలు ప్రశంసిస్తూ ఉన్నారు. భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బీసీసీఐ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్ లో ఇదొక గొప్ప రోజని చెప్పారు.

    అక్టోబర్ నెలలో మహిళల క్రికెట్ ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. సిల్‌హట్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 66 పరుగుల లక్ష్యాన్ని 8.3 ఓవర్లలోనే చేధించి విజేతగా నిలిచింది. భారత జట్టు ఆసియా కప్ గెలవడం ఇది ఏడోసారి. ఆసియా క్రికెట్ లో భారత జట్టే టాప్ పొజిషన్ లో దూసుకుపోతోంది. ఇక ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లకు భారత్ మంచి పోటీని ఇస్తోంది. ఇక మహిళల ఐపీఎల్ ను నిర్వహించి మరింత టాలెంటెడ్ క్రికెటర్లను వెలికితీయడానికి బీసీసీఐ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. త్వరలోనే మహిళల ఐపీఎల్ కు సంబంధించి బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన రానుంది.

    Trending Stories

    Related Stories