భారత దేశ సైనిక చరిత్రలో ‘పూంఛ్ ఎన్ కౌంటర్’ అత్యంత సుదీర్ఘమైందే కాదు, సంక్లిష్టమైంది కూడా. భారత రక్షణ బలగాలు శక్తివంతంగా శ్రమించినా ఉగ్రమూకల చర్యలను నియంత్రించకపోవడానికి కారణమేంటన్న ప్రశ్న సహజంగానే ఎదురవుతోంది. సుమారు 31రోజులుగా పూంఛ్ ఎదురుకాల్పులు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. భాత దూరియన్ లోతట్టు అడవుల్లో మాటు వేసిన ఉగ్రవాదులు అదను చూసుకుని మన బలగాలపై దాడులు చేస్తున్నారు. బాలాకోట్ బ్లాక్ లో ఉన్న భాతదూరియన్ టెర్రెయిన్ బలగాల సమర్థతను పరీక్షిస్తోంది. అక్టోబర్ 10న మొదలైన పూంఛ్ ఎన్ కౌంటర్ లో సుమారు 3వేల మంది బలగాలు పాల్గొన్నట్టు సమాచారం.
పూంఛ్ ఎన్ కౌంటర్ కూ గత చరిత్రకూ చాలా సంబంధం ఉంది. నదీమార్గ్ ఊచకోతకూ భాతదూరియాన్ ఎదురు కాల్పులకూ అమానవీయ గతం ఉంది. అంతే కాదు తాజాగా జమ్మూ-కశ్మీర్ లోని ఉగ్రమూకలకు చైనా ఆయుధాలు అందుతున్న వర్తమానమూ ఉంది. భారత్ పై బహుముఖ దాడి క్రమంగా పెరుగుతోంది. సరిహద్దులను కాపాడుకుంటూ, దౌత్యనీతిని ఆశ్రయించిన భారత్ పై చైనా కూడా అదే పద్ధతిలో ప్రతిదాడి చేస్తోంది. తన పెట్టుబడులతో భారత్ పొరుగున ఉన్న పాక్-ఆఫ్ఘనిస్థాన్ లలో పాగా వేసిన చైనా పరోక్ష, ప్రత్యక్ష్య దాడిని ఉధృతం చేసింది.
బాతాదూరియా కాల్పులకూ, నదీమార్గ్ ఊచకోతకూ ఉన్న సంబంధం ఏంటి? నదీ మార్గ్ లో ఏం జరిగింది? చైనా ఆయుధాలు కశ్మీర్ లోయలోకి ఎలా అందుతున్నాయి? భారత్ ‘టూ ఫ్రంట్’ వార్ ను ఎదుర్కోనుందా? ఎలాంటి స్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎందుకు ప్రకటించారు? కేంద్ర మంత్రి ప్రకటన వెనుక ఉన్న మతలబు ఏంటి? పూంఛ్ ఎదురుకాల్పులు నెలపాటు ఎందుకు జరిగాయి? ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్’లో ఏం జరిగింది?
2003లో జరిగిన ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్’కూడా సురాన్‌కోటె వద్దనే జరిగింది. 1999లో సురాన్‌కోటె ప్రాంతంలోని హల్కాక అనే బకర్వాల్ అంటే గొర్రెలకాపర్ల గ్రామాన్ని ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. దట్టమైన అడవిలో ఎల్‌వోసీకి 10-12 కిలోమీటర్ల లోపల ఉంటుందీ గ్రామం. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్ బదర్ సహా పలు గ్రూపులకు చెందిన ఉగ్రమూకలు ఇక్కడ తిష్ఠవేశాయి.
పర్వత పంక్తుల్లో గొర్రెల కాపర్లు ఉపయోగించే షెడ్లను తమ బంకర్లుగా మార్చుకున్నాయి. అక్కడ కాంక్రీట్ కట్టడాలను నిర్మించాయి. ఉగ్రవాదులు ఇక్కడ ఏకంగా ఒక ఆసుపత్రినే నిర్మించారు. దీంతోపాటు 500 మందికి రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకొన్నారు. పాకిస్థాన్ ఇక్కడ ఏకంగా సమాంతర పాలన సాగించింది. ఇక్కడి పరిస్థితిని గమనించిన సైన్యం పలుమార్లు దాడులు నిర్వహించింది. కానీ, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్’ చేపట్టింది.
అప్పటికే కార్గిల్ యుద్ధాన్ని భారత్-పాక్‌లు పూర్తిగా మర్చిపోలేదు. దీనికి తోడు 2001లో పార్లమెంట్ దాడి తర్వాత ‘ఆపరేషన్ పరాక్రమ్’ కూడా భారత్ చేపట్టింది. దీంతో ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్’లో ఏమాత్రం తేడా వచ్చినా అది ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. దీంతో సైన్యం అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తర్వాత మాత్రమే తుది దాడిని ఆరంభించింది.
2003 జనవరిలో పీర్‌పంజాల్ పర్వత శ్రేణుల్లోని మూడు శిఖరాల మధ్య 150 చదరపు కిలోమీటర్లలో సైన్యం తుది ఆపరేషన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. మొత్తం మూడు బ్రిగేడ్లకు సరిపడా 15,000 మంది సైనికులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అదే ఏడాది ఏప్రిల్-మే నెలల మధ్య భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఒక చిన్నసైజు యుద్ధమే జరిగింది.
ఎంఐ17 హెలికాప్టర్లతో దళాలను ఎన్‌కౌంటర్ ప్రదేశంలో జారవిడిచారు. లాన్సర్ హెలికాప్టర్‌తో దాడులు చేశారు. మొత్తం 64 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఆపరేషన్ తర్వాత అక్కడి బకర్వాల్ వాసులకు ప్రభుత్వం రూ.7.5 కోట్ల పరిహారం అందజేసి.. ఆ ప్రాంతాన్ని మూసి వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రోడ్లతో అనుసంధానించింది.
1990ల్లో కశ్మీరీ పండిట్లపై దాడులు జరగడంతో ‘నదీమార్గ్’ గ్రామంలోని చాలా మంది ఇళ్లు వదిలి జమ్మూ సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పోయారు. కానీ, 50 కుటుంబాలు మాత్రం ధైర్యంగా ‘నదీమార్గ్’లోనే ఉన్నాయి. 2003 మార్చి 23వ తేదీన దాదాపు 12 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి గ్రామానికి వచ్చారు. మొదట గ్రామంలోని పోలీస్ పికెట్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ఆరుగురు పోలీసులు నిద్రపోతుండటంతో వారి ఆయుధాలను తీసుకొని వారిని బంధించారు. అనంతరం గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కశ్మీరీ పండిట్లను వీధుల్లోకి ఈడ్చుకొచ్చి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు.
ప్రస్తుతం కశ్మీరీ పండిట్లు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న దశలో తిరిగి ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘన్-చైనా-పాకిస్థాన్ మూడు దేశాల బంధంతో ఉగ్రవాదానికి ఊతం దొరికింది. ‘ఆపరేషన్ ఆల్ అవుట్’ తర్వాత ఉగ్రవాదం అదుపులో ఉందనుకుంటున్న తరుణం తాలిబన్ల రంగప్రవేశం పరిస్థితిని ఒక్కసారి మార్చింది. ఆసియాఖండంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ కు తాజాగా చైనా చేదోడుగా నిలుస్తోంది.
గడచిన మాసాలుగా పాకిస్థాన్ మిలటరీ మాజీ అధికారులు పూంఛ్ అడవుల్లో భారత్ వ్యతిరేక చర్యలకు పథకాలను రచిస్తున్నట్టూ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ గుర్తించింది. నోరికో కంపెనీ తయారు చేసే NSR రైఫిళ్లను సెప్టెంబర్ 14న సైన్యం గురేజ్ సెక్టార్ లో స్వాధీనం చేసుకుంది. ఎన్ఎస్ఆర్ రైఫిల్ చైనా సైన్యం ఉపయోగించే ప్రామాణిక ఆయుధం.
పశ్చిమాసియాలో అమెరికా ప్రాబల్యం తగ్గడంతో పాత మిత్రులైన రష్యా-చైనాలు దక్షిణాసియా వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. భారత్ లోని కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఈశాన్యంలో కవ్విస్తూ, తూర్పు లఢాక్ లో సరిహద్దులను చెరిపేస్తున్న చైనా ‘multi pronged strategy’ సిద్ధం చేసింది. మరోవైపు పాకిస్థాన్ ఉండనే ఉంది.
పూంఛ్ ఎన్ కౌంటర్ ఎందుకిన్ని రోజులుగా కొనసాగుతోంది? నెలల తరబడి ఉగ్రవాదులు లోతట్టు అడవుల్లో ఎలా దాక్కుంటున్నారు? సరఫరా మార్గాలేంటో చూద్దాం. అక్టోబర్ 10న ఎన్ కౌంటర్ మొదలైన తర్వాత తొలివారంలో అధికారులు వేగంగా స్పందించి స్నైపర్లను రంగంలోకి దించారు. శీతాకాలంతో పాటు టెర్రెయిన్ అననుకూలంగా ఉండటం, ఉగ్రవాదుల స్థావరాలు ఖచ్చితంగా తెలియకపోవడం మూలంగా బలగాలవైపు ప్రాణ నష్టం జరిగింది. దీంతో వ్యూహాన్ని మార్చింది సైన్యం.
అక్టోబర్ 10వ తేదీన ఇద్దరు వ్యక్తులు భారీ తుపాకులతో పూంచ్‌లోని ఓ లేబర్ క్యాంప్‌కు వెళ్లారు. అక్కడ ఓ కూలీ నుంచి ఫోన్ లాక్కొని సమీపంలోని ఆర్మీ క్యాంప్ దిశగా వెళ్లినట్లు స్థానిక కూలీల ద్వారా సమాచారం అందింది. దీంతో ఆ ఫోన్‌పై నిఘా పెట్టిన అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ ఫోన్ పూంచ్-రాజౌరీ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్నట్లు తేలింది. ఫోన్ సంభాషణలను కూడా సైన్యం విని ఉగ్రవాదులు ఉన్న విషయాన్నిధ్రువీకరించుకొని ఆపరేషన్ మొదలుపెట్టింది. రాజౌరీ జిల్లాలోని ఖాబ్లా అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టారు. ఇక్కడ కొందరు అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు నమ్మకమైన సమాచారం లభించడంతో దళాలు గాలింపును ముమ్మరం చేసినా ఫలితం లభించలేదు.
అడవుల్లో కూంబింగ్ చేస్తున్న బలగాలకు బిస్కెట్ ప్యాకెట్లు, టీషర్ట్ లు, డేరాలు లభించాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పూంఛ్ లో పూర్తి ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు ప్రవేశించినట్టూ గుర్తించారు. జూలైలోనే ఏర్పాట్లు చేసుకున్నట్టు స్పష్టమైంది. కొంతమంది స్థానికులు సహకరించినట్టూ పసిగట్టి అరెస్టు చేసింది సైన్యం.
గతంలో కశ్మీర్ లోయలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలు గంటల వ్యవధిలో ముగిసిపోయేవి. ఇళ్ల సముదాయంలో టార్గెట్లను గుర్తించడం సులభం. అటవీ మార్గాల్లో మాటువేసిన వారిని గుర్తించడం కష్టంగా మారడంతో సైన్యం వేచి చూసే ధోరణి అవలంబించడం వల్ల కాల్పులు నెలరోజులుగా కొనసాగుతోంది. ‘ఆపరేషన్ ఆల్ అవుట్’ తర్వాత పాకిస్థాన్ కశ్మీర్ ఉగ్రవాదం విషయంలో వ్యూహాన్ని మార్చింది. మాజీ సైనిక అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే ఉగ్రసంస్థలను ఆపరేట్ చేయాలని భావిస్తోంది. పకడ్బందీ ప్రణాళిక, దాడి ఎత్తుగడలు లేకుండా ఆయుధ సామాగ్రి, డబ్బూ అందజేయకూడదని నిర్ణయించింది. అందుకే పూంఛ్ అడవుల్లో పక్కాగా మాటువేసి దాడి ఆరంభించింది.
గతంలో లోయలో సంచరించే ఉగ్రవాదులు స్మార్ట్ ఫోన్లను వినియోగించేవారు. సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపించేవారు. ఈ ఏడాది జనవరి తర్వాత స్మార్ట్ ఫోన్ల వినియోగంపై టెర్రర్ సర్కిళ్లలో కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్న ఫోన్లను వాడకూడదని టెర్రర్ సంస్థలు నిర్ణయించాయి. దీంతో ఉగ్ర కదలికల సమాచారం మరింత కష్టమైంది. కేవలం ‘మాన్యువల్ ఇన్ఫార్మర్ నెట్ వర్క్’ ద్వారా మాత్రమే సమాచారం అందుతుంది. రాజౌరీ-పూంచ్ ప్రాంతాల్లో పకడ్బందీ ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకపోవడం కూడా తాజా ఘటనకు కారణమంటారు నిపుణులు.
అంతేకాదు, గతంలో ఇళ్లలో ఆయుధాలు, ఇతర వస్తువులను దాచేవారు. ఇటీవలి కాలంలో సైన్యం సోదాలు తీవ్రం చేయడంతో చిట్టడవుల్లో ఆయుధాలు దాచిపెడుతున్నట్టూ భద్రతా దళాలు గుర్తించాయి. ఆయుధ సామాగ్రి భారీగా అందుతోందని గుర్తించినా అవి తరలి వస్తున్న మార్గాలు స్పష్టంగా తెలియకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
ఒక వైపు పార్ట్ టైమ్ షూటర్లకు చిన్న ఆయుధాలు ఇచ్చి పట్టణ ప్రాంతాల్లో దాడులు చేసి అలజడి సృష్టించడం, మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి భారీగా చొరబాట్లను పెంచడంపై పాకిస్థాన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మొత్తం స్థితిని అంచనా వేసిన కేంద్రం ఏ క్షణమైనా, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అయినా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష యుద్ధం రాకపోయినా వాస్తవాధీన రేఖ వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి చైనా మోహరింపు, పాకిస్థాన్ ఉగ్రక్రీడ గతంలో కన్నా పెరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఉప్పందించిన నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి ‘హెచ్చరిక’ ప్రకటన వెలువడిందని అర్థం చేసుకోవాలి.