National

కర్ణాటక సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గ‌హ్లోత్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప కూడా పాల్గొన్నారు. క‌ర్నాట‌క రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. కర్ణాటక రాష్ట్ర‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడే బ‌స‌వ‌రాజ్ బొమ్మై. బ‌స‌వ‌రాజ్ బొమ్మై వ‌య‌సు 61 ఏళ్లు. బీఎస్ య‌డియూరప్ప ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. బ‌స‌వ‌రాజ్ బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ వర్గానికి చెందినవారు. శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు.

మంగళవారం బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన బీజేపీ హైకమాండ్ ప్రతినిధులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న బసవరాజ్ బొమ్మను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. లింగాయత్ వర్గానికే సీఎం పదవిని కట్టబెట్టాలా లేక మరో సామాజికవర్గంతో ప్రయోగం చేయాలా అని తర్జనభర్జన పడ్డ బీజేపీ అధిష్ఠానం చివరకు బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది.

బసవరాజ్ బొమ్మై జనవరి 28, 1960 న జన్మించారు. సదర లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు. బిఎస్ య‌డియూర‌ప్పకు సన్నిహితుడు. ‘జనతా పరివార్’ కు చెందినవాడు. అతని తండ్రి ఎస్ఆర్ బొమ్మై కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బసవరాజ్ బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998,2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో బసవరాజ్ బొమ్మై నాయకత్వాన్ని క‌ర్ణాట‌క బీజేపీ నేత‌లు అందరూ ఆమోదించారు. క‌ర్ణాట‌క‌కు ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఆ పదవులను చేప‌ట్ట‌నున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 + 19 =

Back to top button