ఆంగ్ల నూతన సంవత్సరం 2022 వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించింది. బెలగావిలోని సువర్ణ విధాన సౌధలో తన క్యాబినెట్ సహచరులు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు, కోవిడ్ నిపుణులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 నుండి జనవరి 2 వరకు పలు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. కొత్త సంవత్సరంలో కోవిడ్ నియంత్రణలపై వివరణాత్మక మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయబడతాయని అధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు బెంగళూరు లోని MG రోడ్, బ్రిగేడ్ రోడ్‌లతో సహా అన్ని బహిరంగ కార్యక్రమాలు కర్ణాటక అంతటా నిషేధించబడ్డాయని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ బహిరంగ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉండవని బొమ్మై చెప్పారు. 50 శాతం ఆక్యుపెన్సీతో అన్ని క్లబ్‌లు, రెస్టారెంట్‌లలో వ్యాపారం చేసుకోవచ్చని బొమ్మై తెలిపారు. DJ ఈవెంట్‌లు, న్యూ ఇయర్ పార్టీలను నిర్వహించడానికి ఎటువంటి అనుమతి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. పని చేసే సిబ్బందికి తప్పనిసరిగా RT-PCR పరీక్షలతో పాటు, ఈ ప్రదేశాల్లోని సిబ్బంది అందరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌తో పూర్తిగా టీకాలు వేయించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా గేటెడ్ కమ్యూనిటీలు, భారీ గృహ సముదాయాలు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా కేసులు, ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బసవరాజ్ బొమ్మై తెలిపారు. చర్చిలలో క్రిస్మస్ వేడుకలు, ప్రార్థన సమావేశాలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని అన్నారు. కరోనా నిబంధనలు పాటించి ప్రార్థనలను చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.