చిన్న చిన్న విషయాలకే రాజకీయాలు చేసే నాయకులు ఎంతో మంది ఉంటారు. ప్రస్తుతం ఉన్న కరోనా కష్టకాలాల్లో కూడా రాజకీయాలు చేస్తున్న నాయకులను చూస్తూనే ఉన్నాము. కానీ కొందరు నాయకులు మాత్రం ప్రజలకు వీలైనంత అండగా నిలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి కోవలోకే వస్తారు కర్ణాటక హోమ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మై. తన ఇంటిని బసవరాజ్ బొమ్మై కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. 50 మంది కరోనా రోగులకు ఇప్పుడు ఆయన ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు.
హావేరి జిల్లాలోని శిగ్గావిలో ఉన్న ఇంటిని ఆయన కోవిడ్ కేర్ సెంటర్(సి.సి.సి.) గా మార్చారు. అక్కడ ఇప్పుడు 50 మంది వరకూ కోవిడ్ పాజిటివ్ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆయన ఇంటి వసారాలో 50 బెడ్లను ఏర్పాటు చేశారు. త్వరలోనే ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను కూడా తీసుకుని వచ్చి శ్వాస సమస్యలు ఉన్న వాళ్లకు సహాయపడేలా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారని బసవరాజ్ బొమ్మై సిబ్బంది మీడియాకు తెలిపారు.
ఓ మంత్రి ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చడం ఇదే మొదటిసారని చెప్పుకొచ్చారు. బసవరాజ్ బొమ్మై ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చడం వలన తాలూకా ఆసుపత్రిపై ఉన్న ఒత్తిడి తగ్గుతుందని భావిస్తూ ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లక్ష్మణ్ సావడి బెళగావి జిల్లాలోని అథానిలో తన సొంత డబ్బులు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 50 బెడ్లు ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అథానిలోని కిట్టూరు రాణి చెన్నమ్మ హాస్టల్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు.
కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 41,664 కరోనా కేసులు, 349 మరణాలు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,71,931కు, మొత్తం మరణాల సంఖ్య 21,434కు పెరిగింది. గత 24 గంటల్లో 34,425 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,44,982కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,05,494 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.