కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైను ఎన్నుకున్నారు. బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఎన్నికయ్యారు. ఆయన కర్ణాటక తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన బీజేపీ హైకమాండ్ ప్రతినిధులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, కిషన్ రెడ్డి ఈ అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న బసవరాజ్ బొమ్మను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకూ అందిన నివేదికల ప్రకారం కొత్త కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు మధ్యాహ్నం 3.20 గంటలకు జరుగుతుందని తెలుస్తోంది.

లింగాయత్ సామాజికవర్గానికి చెందిన బసవరాజ్కే సీఎం పదవి కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కథనాలు రాగా బీజేపీ అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపింది. లింగాయత్ వర్గానికే సీఎం పదవిని కట్టబెట్టాలా లేక మరో సామాజికవర్గంతో ప్రయోగం చేయాలా అని తర్జనభర్జన పడ్డ బీజేపీ అధిష్ఠానం చివరకు బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టనుంది.

బసవరాజ్ బొమ్మై జనవరి 28, 1960 న జన్మించారు. సదర లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు. బిఎస్ యడ్యూరప్పకు సన్నిహితుడు. ‘జనతా పరివార్’ కు చెందినవాడు. అతని తండ్రి ఎస్ఆర్ బొమ్మై కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బసవరాజ్ బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998,2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు బసవరాజ్ బొమ్మై అత్యంత సన్నిహితుడు. యడ్యూరప్ప సైతం తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైను ఎంపిక చేయాలని అధిష్టానానికి సూచించారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన చెప్పినట్లుగానే అధిష్టానం బసవరాజ్ బొమ్మైను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. పార్టీలో చాలామంది ఎమ్మెల్యే మద్దతు కూడా బసవరాజ్ బొమ్మైకి ఉండటంతో బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఆయన్నే ఖరారు చేసింది.
