ఆప్ సర్కారు మందు బాబులు తెల్లవారు జామున వరకూ తాగేలా సరికొత్త లిక్కర్ పాలసీని తీసుకుని వచ్చింది. ఎంతగా తాగొచ్చు అంటే ఉదయం మూడు గంటల వరకూ..! సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఢిల్లీలో బాగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏకంగా ఉదయం 3 గంటల వరకూ మద్యం తాగేందుకు ఆప్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఇంకెన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయోనని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2021-22 ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకునే ఉంటాయని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. మద్యం మీద వచ్చే ఆదాయం రాష్ట్ర రెవెన్యూకి చాలా ముఖ్యమని ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. ఇక మందు తాగే వారి కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు.
ఈ కొత్త పాలసీలో ప్రభుత్వ రీటెయిల్ వైన్ షాపులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ షాపులను ప్రమోట్ చేస్తూ పాలసీని తయారు చేసింది. వైన్ షాపులు పూర్తి ఎయిర్ కండిషన్ తో, గ్లాస్ డోర్లతో ఉంటాయి. లిక్కర్ కొనుగోలుదారులు షాపుల ఎదుట బారులు తీరకుండా, షాపులోకి వచ్చి వారికి నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేయవచ్చు. బీర్ల కోసం మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆదాయాన్ని పెంచేందుకు, లిక్కర్ మాఫియా ఆగడాలను నిలువరించేందుకు ఢిల్లీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించినట్లు తెలుస్తోంది. విదేశస్థులు వస్తున్న నగరాల్లో ఢిల్లీ 28వ స్థానంలో ఉంది. ఆబ్కారి ఆదాయం చాలా కీలకమైన వనరు అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మద్యం విక్రయాల్లో రిటేల్ రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే మద్యం షాపులను మూసివేసి ప్రైవేటు షాపులను ప్రోత్సహించనున్నారు.
కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను దృష్టిలో ఉంచుకుని తీసుకుని వచ్చిన కొత్త విధానం ద్వారా రద్దీ తగ్గనుంది. కౌంటర్ ద్వారా కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తుంది. సూపర్ ప్రీమియం విక్రేతలు విస్కీ, జిన్, వోడ్కా, బ్రాందీ మొదలైన వాటికి మాత్రమే పరిమితం కాకుండా, బీరును కూడా అమ్మనున్నారు. కొత్త విధానంతో సంవత్సరంలో ఆదాయం 20 శాతం పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.