డబ్బులు అవసరం ఉండి.. వెంటనే ఏటీఎంలకు పరిగెడుతూ ఉంటాం. కానీ ట్రాన్సాక్షన్ మొత్తం పూర్తయ్యాక.. ‘నో క్యాష్’ అంటూ డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని ఏటీఎం ల ముందు నగదు లభించడం లేదనే బోర్డులను కూడా పెడుతూ ఉన్నారు. మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఫైన్ల మీద ఫైన్లు వేసే బ్యాంకులకు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచుకుంటే ఫైన్లు వేయాలనే డిమాండ్లు ఎప్పటి నుండో వస్తున్నాయి.
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఏటీఎంలలో డబ్బులు లేకుండా ఖాళీగా ఉంటే మాత్రం జరిమానా తప్పదని హెచ్చరించింది. ఏటీఎంలలో నగదు లేని సమయం ఒక నెలలో 10 గంటలు దాటితే రూ. 10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఏటీఎంలు ఖాళీ అయినా నగదు నింపకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా ఆర్‌బీఐ తెలిపింది. కాబట్టి నోట్ల లభ్యతను పర్యవేక్షించే బాధ్యతను బలోపేతం చేసుకోవాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం (డబ్ల్యూఎల్ఏ) ఆపరేటర్లను ఆదేశించింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే వాటికి డబ్బు అందజేసే బాధ్యత ఉన్న బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్‌బీఐ హెచ్చరించింది. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తూ ఉన్నారు.
“నగదు లేని కారణంగా ఏటీఎంలు పనిచేయకపోవడంపై సమీక్ష జరిగింది. నగదు చెల్లింపుల కోసం ఏటీఎంలకు వెళుతోంటే నగదు అందుబాటులో లేదనే విషయం తెలిసి ప్రజలలో అసౌకర్యాన్ని కలిగిస్తోంది” అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆర్‌బీఐ ఆదేశించింది.