More

    బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ నోటీసులు వెనక్కి తీసుకున్న బ్యాంకు..!

    బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ కు సంబంధించిన బ్యాంకు నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముంబయి జుహూ ప్రాంతంలో గాంధీగ్రామ్ రోడ్‌లో ఉన్న విల్లాను సన్నీ డియోల్ గ్యారంటీగా పెట్టి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్లు లోన్ తీసుకున్నాడు. దాన్ని చెల్లించే విషయంలో మాత్రం పట్టించుకోలేదని.. బ్యాంక్ నోటీసులు పంపినా సరే స్పందించలేదని ఆగస్టు 20న ఓ ప్రముఖ పేపర్‌లో విల్లాని వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ ప్రకటన జారీ చేసింది.

    బ్యాంక్ ఆఫ్ బరోడా ఆగస్టు 21న తన నోటీసును ఉపసంహరించుకుంది. ‘సాంకేతిక కారణాలు’ అని పేర్కొంటూ తమ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఆ ప్రకటనలో, “మిస్టర్ అజయ్ సింగ్ డియోల్ అలియాస్ మిస్టర్ సన్నీ డియోల్‌కు సంబంధించి సేల్ నోటీసుకు సంబంధించి 20.08.2023 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా ముంబై ఎడిషన్‌లో ప్రచురించిన 19.08.2023 నాటి ఇ-వేలం సేల్ నోటీసుకు సాంకేతిక కారణాల వలన ఉపసంహరించుకుందని తెలిపారు.

    ఆగస్టు 19న బ్యాంక్ నోటీసు జారీ చేసింది, ఇది ఆగస్టు 20న మీడియాలో విస్తృతంగా నివేదించారు. సన్నీ డియోల్ జుహు బంగ్లాకు సంబంధించిన నోటీసులో బ్యాంక్ దాదాపు రూ. 56 కోట్ల విలువైన బకాయిలు చెల్లించని పక్షంలో సెప్టెంబర్‌లో నటుడి ఆస్తిని వర్చువల్ వేలం వేయనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. తమ నుంచి తీసుకున్న రూ. 56 కోట్లను రికవర్ చేసుకునేందుకు ఈ నెల 25న విల్లాను వేలం వేస్తున్నట్టు నోటీసులు పంపింది. డిసెంబర్ 2022 నుంచి తమకు అసలు, వడ్డీతో కలిపి రూ 55.99 కోట్లు బకాయి పడ్డారని తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలోనే వేలం నోటీసులకు బ్యాంకు వెనక్కి తీసుకుంది. సాంకేతిక కారణాలతో నోటీసులను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది.

    బ్యాంకు వెనక్కి తీసుకోవడంపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… రూ. 56 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించనందుకు సన్నీడియోల్ ప్రాపర్టీని బ్యాంకు వేలం వేస్తున్నట్టు దేశంలోని అందరికీ తెలిసిందని ఆయన అన్నారు. కనీసం 24 గంటలకు కూడా గడవకుండానే నోటీసులను బ్యాంకు సాంకేతిక కారణాలతో ఉపసంహరించుకున్నట్టు తెలిసిందని అన్నారు. సాంకేతిక కారణాలను ఎవరు ప్రేరేపించారనేది తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. సన్నీ డియోల్ బీజేపీకి దగ్గర కాబట్టి బ్యాంకు ఆ ప్రకటనను వెనక్కు తీసుకుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

    బ్యాంకు నోటీసులపై స్పందించారు సన్నీ డియోల్. బ్యాంకుతో సమస్యను పరిష్కరించే ప్రక్రియలో ఉన్నామని.. ఈ విషయంలో ఊహాగానాలకు స్వస్తి పలకాలని అభ్యర్థించారు. జుహులోని సన్నీ డియోల్ కు చెందిన ప్రాపర్టీని సన్నీ విల్లా అని పిలుస్తారు. ఇది ముంబైలోని జుహులోని గాంధీగ్రామ్ రోడ్‌లో 599.44 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. సన్నీ డియోల్ నటించిన గదర్-2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ ఉంది. రెండో శనివారం అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇన్నాళ్లూ బాహుబలి-2 హిందీ వెర్షన్ పేరిట రికార్డ్ ఉండగా.. ఆ రికార్డును కూడా కొల్లగొట్టింది. విడుదలైన తర్వాత రెండో శనివారం బాహుబలి-2 హిందీ వెర్షన్ కు 26.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడీ రికార్డ్ ను గదర్-2 క్రాస్ చేసింది. ఈ చిత్రానికి ఏకంగా 32 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. తన బాక్సాఫీస్ రన్ లో భాగంగా శనివారం నాటికి హృతిక్ నటించిన వార్, సల్మాన్ చేసిన భజరంగీ భాయ్ జాన్ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్ ను అధిగమించింది గదర్-2.

    Related Stories