మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగలేఖ రాశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని లేఖలో బండి సంజయ్ మండిపడ్డారు. ఈ ఘటన జరిగి రోజులు గడిచిపోతున్నా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి మనవడు, మీకు రాజకీయ మిత్రులైన ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా ఇప్పటికే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అన్నారు.
ఆధారాలను బయట పెట్టిన రఘునందన్ రావు:
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా ముందు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్న ఫోటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. ఈ కారులోనే నిందితులు పబ్ కు వచ్చారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కారులోనే ఎమ్మెల్యే కొడుకు పబ్ కు వస్తున్న ఫోటోలను రఘునందన్ రావు రిలీజ్ చేశారు.
బాలికను పబ్ కు తీసుకొచ్చిన బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని.. బాలికపై అతను అత్యాచారం చేశాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తాన చూపిస్తున్న ఫోటోలో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు అవునో కాదో పోలీసులు చెప్పాలన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో పోలీసుల కంట్రోల్ మొత్తం మజ్లిస్ చేతిలో ఉందన్నారు రఘునందన్ రావు. మజ్లిస్ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారని.. అందుకే మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో మజ్లిస్ నేతల పిలలను వదిలేసి.. మిగితా వారిని విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల అరెస్ట్ ఎందుకు చూపడం లేదని రఘునందన్ రావు పోలీసులను నిలదీశారు. అధికార పార్టీ నేతలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పిల్లలు ఉన్నారు కాబట్టే.. చూపించడం లేదా అని ప్రశ్నించారు. గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.