మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం నిర్వహిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన మోమెన్ అనే వ్యక్తిని, అతని సహచరుడు బబ్లూను పోలీసులు అరెస్టు చేశారు. 5,000 మందికి పైగా బాలికలను కొనుగోలు చేసి విక్రయించానని, అలాగే వారిని సెక్స్ రాకెట్‌లోకి నెట్టినట్లు మోమెన్ పోలీసుల ముందు అంగీకరించాడు.

‘విజయ్ కుమార్’ అనే నకిలీ పేరుతో నివసిస్తున్న మోమెన్ సుమారు 25 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత, అతను ముంబైలోని నాలా సోపారా ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. ముంబయి, సూరత్ వంటి ప్రాంతాల్లో తన దందా కొనసాగించడానికి వీలుగా తన వ్యాపారానికి ఇండోర్‌ను కొత్త గమ్యస్థానంగా మార్చడానికి ప్రయత్నించాడు. మోమెన్ భార్య బంగ్లాదేశ్ లో సాంఘిక సంక్షేమం పేరుతో ఎన్జీవోను నిర్వహిస్తోంది, దాని ముసుగులో ఆమె బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి బాలికలను అక్రమంగా రవాణా చేసేది. ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో పేదల ఇళ్లలోని ఆడపిల్లలను భారత్ కు పంపేవారు. అయితే ఇక్కడికి చేరుకోగానే వారిని బలవంతం చేసి వ్యభిచార వృత్తిలోకి నెట్టేసేవారు. ప్రధాన నిందితుడు మోమిన్ 10 పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఇవే కాకుండా అతనికి 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని ఇండోర్ ఐజీ హరినారాయణ్ మిశ్రా చారి మీడియాతో చెప్పారు. ఇండోర్, ధార్, ఝబువా, అహ్మదాబాద్, సూరత్, జైపూర్‌తో సహా దేశంలోని అనేక నగరాల్లో అతడికి లింక్స్ ఉన్నాయని తెలుస్తోంది. వ్యభిచారం ముసుగులో డ్రగ్స్‌ను కూడా స్మగ్లింగ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు.
ఇండోర్‌లోని విజయ్ నగర్ పోలీసుల ప్రకారం.. గత సంవత్సరం అక్టోబర్ 2020 లో ఒక యువతి తాను బంగ్లాదేశ్ నుండి వచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను కొందరు అక్రమంగా దాటించి భారతదేశంలోని విజయ్ (మోమిన్)కి అప్పగించారు. అప్పటి నుండి అతను పోలీసుల రాడార్‌లో ఉన్నాడు. అతనిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం ముంబైలో ఉన్న అతను పోలీసుల దృష్టి తనపై పడిందని తెలుసుకుని వెంటనే ఇండోర్ వచ్చాడు. అయితే ఇక్కడ విజయ్ నగర్ పోలీసులు పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నారు.
