ముష్ఫికర్ రహీమ్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు గుడ్ బై

0
785

బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. వెటరన్ క్రికెటర్ బంగ్లాదేశ్ క్రికెట్‌లో లెజెండ్ గా చెప్పుకొంటారు. ఇప్పటి వరకు ప్రపంచ కప్‌లోని ప్రతి ఒక్క ఎడిషన్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా అతడి రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. రహీమ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇకపై టెస్ట్, వన్డే ఫార్మాట్లపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు చెప్పాడు. 35 ఏళ్ల అతను ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో ఆడటానికి అందుబాటులో ఉంటానని చెప్పాడు. వన్డేలు, టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎదురుచూస్తున్నట్లు రహీమ్ తెలిపాడు.

“నేను T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నాను. టెస్ట్ మరియు ODI ఫార్మాట్‌లపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు నేను ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడటానికి అందుబాటులో ఉంటాను. రెండు ఫార్మాట్లలో నా దేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహించడానికి ఎదురుచూస్తున్నాను-MR15,” అని రహీమ్ తన ప్రకటనలో చెప్పాడు.

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ జట్టు ఒక్క విజయం సాధించకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. 35 ఏళ్ల వికెట్ కీపర్ రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. బంగ్లాదేశ్ తరఫున 102 మ్యాచ్‌లు ఆడిన రహీమ్.. తన T20I కెరీర్‌లో 1500 పరుగులు చేశాడు, అతని పేరు మీద ఆరు అర్ధసెంచరీలు కాగా.. అత్యధిక స్కోరు 72 నాటౌట్. ఈ సంవత్సరం ప్రారంభంలో, తమీమ్ ఇక్బాల్ కూడా T20Iల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ముషీ కూడా టీ20 ఫార్మాట్ నుండి వైదొలిగాడు.