More

    బెంగళూరులో భారీ పేలుడు

    కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. చుట్టుపక్కన భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. గాయపడ్డ వారిని స్థానిక విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సిటీలోని చామరాజపేటలో ఓ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి మృతదేహాలు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డాయని స్థానికులు తెలిపారు. సమీపంలో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

    ఓ గోడౌన్‌ నుంచి బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. వాటిని నిల్వ చేసిన దుకాణంలో పేలుడు సంభవించడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు మరియు నలుగురు గాయపడ్డారు. మృతులను ఫయాజ్ (50), మనోహర్ (29) మరియు అస్లాం (45) గా గుర్తించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఫయాజ్ క్రాకర్స్ షాప్ యజమాని కాగా.. మనోహర్ గూడ్స్ వెహికల్ డ్రైవర్, అస్లాం సమీపంలో పంక్చర్ షాప్ నడుపుతున్నారు. ఈ సంఘటన ఉదయం 11.45 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు మనోహర్ ఫయాజ్‌తో మాట్లాడుతుండగా వారి శరీరాలు ముక్కలైపోయాయి. ఈ పేలుడు తీవ్రత కారణంగా అస్లాం యొక్క పంక్చర్ షాప్, మరో టీ దుకాణం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు 10 ద్విచక్ర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా క్రాకర్స్ నిల్వ చేశారు. పేలుడు సంభవించడానికి గల కారణాలను అగ్నిమాపక అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (DCP) (దక్షిణ) హరీష్ పాండే మాట్లాడుతూ “60 కి పైగా ఫైర్ క్రాకర్స్ బాక్స్‌లు ఉన్నాయి, కానీ ప్రాథమికంగా, ఒక ఫైర్ బాక్స్ పేలినట్లు కనిపిస్తోంది. కానీ పేలుడుకు మూలం మాకు తెలియదు” అని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాంగ్రెస్ శాసనసభ్యుడు జమీర్ అహ్మద్ ఖాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబానికి 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. పేలుడులో గాయపడిన వారిని ఆదుకుంటామని చెప్పారు.

    Related Stories